Tirumala: తిరుమల శ్రీవారి పరకామణి దొంగతనం కేసు.. రికార్డుల సీజ్, సీసీ పుటేజీల పరిశీలన!

Tirumala: పరకామణి కేసు విచారణలో జాప్యం, లోక్ అదాలత్ రాజీపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో, ప్రభుత్వం తాజాగా సీఐడీ (CID)తో దర్యాప్తును వేగవంతం చేసింది.

Tirumala

తిరుమల తిరుపతి (Tirumala)దేవస్థానం (TTD)లో గతంలో సంచలనం రేపిన శ్రీవారి పరకామణి దొంగతనం కేసు మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయ, న్యాయ రంగాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసు విచారణలో జాప్యం, లోక్ అదాలత్ రాజీపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో, ప్రభుత్వం తాజాగా సీఐడీ (CID)తో దర్యాప్తును వేగవంతం చేసింది.

2023 ఏప్రిల్‌లో తిరుమల(Tirumala)లోని పరకామణి విభాగంలో సీ. రవికుమార్ అనే ఉద్యోగి 920 అమెరికన్ డాలర్లు దొంగతనానికి పాల్పడినట్లు TTD విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అయితే, ఆ తర్వాత అనూహ్యంగా ఆ ఉద్యోగి కుటుంబం ‘పాప పరిహారంగా’ రూ.14 కోట్ల విలువైన ఆస్తులను TTD పేరుతో రాసిచ్చింది. ఆపై, సెప్టెంబర్ 2023లో లోక్ అదాలత్ ముందు రాజీ చేసుకుని కేసును ముగించారు. ఈ ‘రాజీ నిర్ణయం చట్టబద్ధమా?’ అనే వివాదం మొదలై, పలువురు జర్నలిస్టులు ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించారు.

దొంగతనం జరిగిన తర్వాత రూ.14 కోట్ల ఆస్తులను TTD పేరుతో రాయడం, కేసును లోక్ అదాలత్‌లో ముగించడం పట్ల హైకోర్టు తీవ్ర సందేహాలు వ్యక్తం చేసింది. పరకామణి రికార్డులు, లోక్ అదాలత్ ఒప్పంద పత్రాలు, పోలీస్ రిపోర్టులు, TTD తీర్మానాలు సీజ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే, ఆదేశాలను పాటించకపోవడంతో కోర్టు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీనిని అనుసరించి, సీఐడీ డీజీ రవి శంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందం తిరుమలకు చేరుకుని దర్యాప్తు చేపట్టింది. ఈ బృందం పరకామణికి సంబంధించిన ఫైల్స్, సీసీటీవీ పుటేజ్, ఫిర్యాదు, ఛార్జ్ షీట్ వంటి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది.అయితే ఈ కేసు తిరుమల వేదికగా తీవ్ర రాజకీయ వాదోపవాదాలకు దారి తీసింది.

Tirumala

TTD బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి అప్పటి TTD పాలక మండలి మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై నేరుగా ఆరోపణలు చేశారు. రవికుమార్ నుంచి స్వీకరించిన ఆస్తులు ‘అవినీతికి సూచన’గా ఆయన పేర్కొన్నారు.

కాగా భూమన కరుణాకర్ రెడ్డి ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తన పాలనలో దొంగతనం జరగలేదని, అసలు దొంగతనం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందని పేర్కొన్నారు. “నా పాలనలో జరిగిందని నిరూపిస్తే తల నరుక్కుంటానని” బహిరంగ సవాల్ విసిరి, తాను సీబీఐ దర్యాప్తుపకు కూడా సర్దుబాటు కావడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

అయితే ప్రస్తుతం సీఐడీ దర్యాప్తు ప్రస్తుతం రికార్డుల సీజ్, సీసీ పుటేజీల పరిశీలనపై దృష్టి సారించింది. దొంగతనం జరిగినట్లు గుర్తించిన 920 డాలర్ల వెనుక రూ.100 కోట్ల విలువైన మోసాలు, బెనామీ ఆస్తుల వ్యవహారం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో అప్పటి TTD అధికారుల ప్రమేయం ఉందా లేదా అనే దానిపైనా సమగ్రంగా విచారణ కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈరోజు సీఐడీ సమర్పించిన సీజ్‌ చేసిన ఫైల్స్‌, సీసీటీవీ రికార్డుల‌పై చర్చిస్తుంది.డిజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలోని బృందం ఇప్పటికే కేసుకు సంబంధించి ముఖ్య రికార్డులు, లోక్ అదాలత్ కాంప్రొమైజ్ పత్రాలు, టీటీడీ తీర్మానాలు సీజ్ చేసింది. కాగా పరకామణి చోరీ వ్యవహారం ఎవరెవరిని నిందితులుగా తేలుస్తుంది, ఏ స్థాయి అధికారుల మెడకు పాపం చుట్టుకునేదో అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version