Scrub Typhus
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) కేసుల పెరగడంతో అక్కడి వారు భయపడుతున్నారు. ఏడు నెలల కాలంలోనే జిల్లావ్యాప్తంగా 380కి పైగా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
అంతేకాదు స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్ ఆంధ్రప్రదేశ్‌లోని చాలా జిల్లాలకు విస్తరించిందని ఆరోగ్య అధికారులు గుర్తించారు. ఇది కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైన సమస్య కాదు. తాజా గణాంకాల ప్రకారం, చిత్తూరు జిల్లా సుమారు 380+ కేసులతో అగ్రస్థానంలో ఉన్నా..కాకినాడలో సుమారు 146 కేసులు, విశాఖపట్నంలో సుమారు 124 కేసులు, వైఎస్ఆర్ కడపలో సుమారు 97 కేసులు నమోదయ్యాయి.
అంతేకాకుండా నెల్లూరు, అనంతపురం, తిరుపతి, విజయనగరం, కర్నూలు, అనకాపల్లి, శ్రీకాకుళం, అన్నమయ్య, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో కూడా కేసులు నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం (2025లో) రాష్ట్రవ్యాప్తంగా పరీక్షించిన 6,778 అనుమానిత నమూనాలలో, 1,346 కేసులు స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి.
ఈ వ్యాధిగ్రస్తులు చాలామంది స్థానిక ఆసుపత్రుల్లో సరైన పరీక్షా సౌకర్యాలు, మెరుగైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో చికిత్స కోసం పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలోని ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. సరైన సమయంలో వ్యాధిని గుర్తించకపోవడం, చికిత్సలో జాప్యం జరగడం వల్ల రోగుల పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా నివారణ చర్యలను పర్యవేక్షిస్తూ, అంటువ్యాధి కాకపోయినా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
స్క్రబ్ టైఫస్ (Scrub Typhus)అనేది ‘ఓరియెంటియా సుత్సుగాముషి’ (Orientia tsutsugamushi) అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఒక తీవ్రమైన జ్వరంగా వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది మనుషుల నుంచి మనుషులకు అంటుకోదు, కానీ లార్వల్ మైట్స్ (చిగ్గర్స్) అని పిలువబడే నల్లిని పోలిన చిన్న కీటకాలు కాటు వేయడం ద్వారా వ్యాపిస్తుంది. ఈ కీటకాలు ప్రధానంగా పొలాలు, పొదలు, తడి నేలలు, చెత్తాచెదారం ఉన్న ప్రాంతాల్లో కనిపిస్తాయి.
ఈ వ్యాధికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే.. ఈ వ్యాధిని గుర్తించిన ప్రాంతం, అది వ్యాపించే విధానం ఆధారంగా దీనికి ‘స్క్రబ్ టైఫస్’ అనే పేరు వచ్చింది. ‘స్క్రబ్’ (Scrub) అంటే పొదలు, చిట్టడవులు, లేదా చెత్తాచెదారంతో కూడిన ప్రాంతాలు అని అర్థం. ఈ వ్యాధిని కలిగించే కీటకాలు (చిగ్గర్స్) ఎక్కువగా అలాంటి ప్రాంతాల్లోనే ఉంటాయి. ‘టైఫస్’ (Typhus) అనేది హై టెంపరేచర్ ఫీవర్, దద్దుర్లు వంటి లక్షణాలతో కూడిన వ్యాధి సమూహాన్ని సూచిస్తుంది. కాబట్టి, పొదలు లేదా అడవి ప్రాంతాల నుంచి వ్యాపించే జ్వరం కాబట్టి దీనికి ‘స్క్రబ్ టైఫస్’ అని పేరు స్థిరపడింది.
స్క్రబ్ టైఫస్ సోకిన వారిలో హై ఫీవర్ , తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పి, కీటకం కుట్టిన చోట నల్లటి పుండు (‘ఎస్కార్’ ) ఏర్పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఎస్కార్ (Eschar) అనేది చాలా కీలకమైన లక్షణం, దీని ద్వారానే డాక్టర్లు ఈ వ్యాధిని గుర్తించగలుగుతారు. కొందరిలో దద్దుర్లు, దగ్గు, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ లక్షణాలు సాధారణ జ్వరాలైన మలేరియా, టైఫాయిడ్ లాగానే ఉండటం వల్ల చాలామంది పొరబడి చికిత్సలో జాప్యం చేస్తున్నారు.
స్క్రబ్ టైఫస్ వ్యాధి ఇప్పటిదే కాదు. ఇది మొట్టమొదటగా జపాన్‌లోని తీర ప్రాంతాల్లో (ముఖ్యంగా నదీ తీరాల వెంట) 1899లో సుమారుగా గుర్తించారు. ఆ తర్వాతే, ఓరియెంటియా సుత్సుగాముషి అనే బ్యాక్టీరియా ఈ వ్యాధికి కారణమని నిర్ధారించారు. భారతదేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వర్షాకాలం, శీతాకాలంలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.
స్క్రబ్ టైఫస్(Scrub Typhus)ను సరైన సమయంలో గుర్తిస్తే, యాంటీబయాటిక్స్ (ముఖ్యంగా డోక్సీసైక్లిన్, అజిత్రోమైసిన్) తో చికిత్స అందించి పూర్తిగా నయం చేయొచ్చు. కానీ చికిత్స ఆలస్యమైతే మాత్రం ఇది శ్వాసకోశ ఇబ్బందులు, మెదడు ఇన్‌ఫెక్షన్లు, కిడ్నీ వైఫల్యం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీసి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, పొదలు, పొలాల్లో పనిచేసేటప్పుడు లేదా ఆడేటప్పుడు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. కీటకాలు కుట్టకుండా రక్షణ కల్పించే లోషన్లను వాడటం వంటి ముందు జాగ్రత్తలు తప్పనిసరి. ఎవరికైనా మూడు రోజులకు పైగా జ్వరం, తలనొప్పి, శరీరంలో నల్లటి మచ్చలు (ఎస్కార్) కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Wash your feet:పడుకునే ముందు కాళ్లు కడుక్కుంటే ఏం జరుగుతుంది? సైన్స్ ఏం అంటుంది? జ్యోతిష్యం ఏం చెబుతుంది?
