Kurnool bus accident
కర్నూలు బస్సు ప్రమాదం(Kurnool bus accident) తీవ్ర విషాదాన్ని నింపింది. వేమూరి కావేరి ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ కోచ్ కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. 27 మంది ప్రాణాలతో బయటపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి.
టూ వీలర్ ను వేగంగా ఢీకొట్టినప్పుడు బైక్ ఇరుక్కోవడంతో ఆ రాపిడికి పెట్రోల్ ట్యాంక్ పేలి ప్రమాదం జరిగినట్టు భావించారు. అయితే ప్రమాద తీవ్రత పెరగడానికి మాత్రం పలు కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. లగేజ్ క్యాబిన్ లో 400 ఫోన్ల పార్సిల్ ఉండడం ప్రమాద తీవ్రతను పెంచిందని అంచనా వేస్తున్నారు. మొదట లగేజ్ క్యాబిన్ కే మంటలు అంటుకుంటున్నట్టు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు.
అందులో 400కు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ కు మంటలు వ్యాపించి అవి పేలినట్టు తెలుస్తోంది. ఈ పేలుడుతో మంటలన్నీ మరింత పెరిగి బస్సులోకి వేగంగా వ్యాపించినట్టు ఫోరెన్సిక్ టీమ్ ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. మంటలు తీవ్రత నిమిషాల వ్యవధిలోనే పెరిగిపోవడం,
అప్పటికే బస్సులో గాఢనిద్రలో ఉన్న ప్రయాణీకులు లేచిచూసే సరికి దట్టమైన పొగలతో మంటలు(Kurnool bus accident) వ్యాపించాయి. తప్పించుకునే ప్రయత్నం చేసినా బస్సు డోర్ తెచుకోకపోవటంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. కొందరు బస్సు ఎమర్జెన్సీ అద్దాలను పగలగొట్టి బయటకు దూకారు. అయితే, ప్రమాద ఘటనలో తీవ్రత పెరగడానికి మొబైల్ ఫోన్ల పేలుడే కారణమని ప్రాథమికంగా తేలింది.
లగేజీ క్యాబిన్‌కు సరిగ్గా పైన బెర్తుల్లో ఉన్న ప్రయాణికులకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఎమర్జెన్సీ డోర్లు వెంటనే పగలకొట్టే అవకాశం కూడా లేకుండా దట్టంగా పొగలు కమ్మేసినట్టు గుర్తించారు. ఈ కారణంగానే బస్సు ముందు భాగంలో ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారని ఫోరెన్సిక్ బృందాలు నిర్థారణకు వచ్చాయి. వాస్తవానికి ప్రయాణికుల బస్సుల్లో మొబైల్ ఫోన్ల వంటి పార్సిల్స్ ను తీసుకెళ్ళకూడదు. వాటికి కార్గో సర్వీసులు మాత్రమే ఉపయోగించాలి. ప్రయాణికుల వాహనాల్లో వారి వ్యక్తిగత లగేజీ తప్ప ఇతర సరకులు రవాణా చేయకూడదనే నిబంధన ఉంది.
కానీ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఈ రూల్స్ ను పట్టించుకోకుండా ఇలాంటి ప్రమాదకరమైన వస్తువులను క్యారీ చేస్తున్నాయి. కొన్నిసార్లు బస్సు టాప్ పైనా, మరికొన్నిసార్లు లగేజీ క్యాబిన్లలో పార్సిల్స్ తీసుకెళుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ వస్తువుల వల్లనే తీవ్రత మరింత పెరిగి ప్రాణనష్టం వాటిల్లుతోంది. అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.
