Casting Couch
తెలుగు సినీ ఇండస్ట్రీలో ‘మెగాస్టార్’ అన్న పిలుపు ఎంత విలువైందో, ఆయన మాటలకు కూడా అంతే బరువు ఉంటుంది. అయితే తాజాగా చిరంజీవి ఒక వేదికపై సినిమా పరిశ్రమ గురించి మాట్లాడుతూ..ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిదని, ఇక్కడ నిబద్ధత (Commitment) ఉంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయని వ్యాఖ్యానించారు. ఈ మాటలు వినడానికి సానుకూలంగా ఉన్నా..దానికి గాయని చిన్మయి శ్రీపాద చేసిన ట్వీట్‌తో ఒక్కసారిగా ఇండస్ట్రీలోని పునాదులను కదిలించినట్లు అయింది.
సినిమా ఇండస్ట్రీలో కమిట్‌మెంట్ అంటే కేవలం పని పట్ల శ్రద్ధ మాత్రమే కాదు, శరీరాన్ని అప్పగించడం కూడా అని చిన్మయి సూటిగా ఎత్తి చూపింది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి .. గ్లామర్ ప్రపంచం వెనుక దాగి ఉన్న కాస్టింగ్ కౌచ్ (Casting Couch)(లైంగిక వేధింపులు) అనే భయంకరమైన నిజం మరోసారి వెలుగులోకి వచ్చింది.
ఏదైనా ఒక రోల్ లేదా ఛాన్స్ కోసం ప్రతిభను కాకుండా, ప్రతిఫలంగా లైంగిక కోరికలను తీర్చమని అడగటాన్ని కాస్టింగ్ కౌచ్ (Casting Couch) అంటారు . ఇది దాదాపు అన్ని రంగాల్లో ఉన్నా, సినీ ఇండస్ట్రీలోనే ఈ మాట ఎక్కువగా వినిపించడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. ఇక్కడ అవకాశాల సంఖ్య తక్కువ,కానీ పోటీ పడే వారు లక్షల్లో ఉంటారు. ఒక సినిమా అవకాశం ఒక వ్యక్తి జీవితాన్నే మార్చేస్తుంది.
ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని కొంతమంది సినీ ప్రముఖులు, కాస్టింగ్ ఏజెంట్లు అమ్మాయిలను లోబరుచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. గ్లామర్, భారీ డబ్బుతో ముడిపడి ఉన్న సినిమా ఇండస్ట్రీలోనే దీని ప్రభావం కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. పైగా ఇక్కడ పవర్ డైనమిక్స్ పెద్దవారి చేతుల్లోనే కేంద్రీకృతమై ఉండటం వల్ల బాధితులు నోరు విప్పడానికి భయపడతారు.
చిన్మయి శ్రీపాద 2018 నుంచే #MeToo ఉద్యమంలో భాగంగా నిరంతరం గొంతు ఎత్తుతూనే ఉన్నారు. అప్పట్లో ఆమె ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. తాజాగా 2026 ప్రారంభంలో శివాజీపై ఆమె చేసిన పోస్ట్‌లు ఇండస్ట్రీలోని కొత్త బాధితుల గొంతుకగా మారాయి. అలాగే పది లక్షలకు పైగా రీట్వీట్లు వచ్చిన ఆమె పోస్ట్ ప్రకారం.. ఒక మేల్ సింగర్ మహిళా సింగర్లకు అసభ్యకరమైన ఫోటోలు పంపుతున్నాడని, స్టూడియోలలో మహిళలను బంధించి వేధిస్తున్నారని చిన్మయి వెల్లడించారు.
కేవలం చిన్మయినే కాదు, 2025 , 2026 సంవత్సరాల్లో సయామీ ఖేర్, ఫాతిమా సనా షేక్ వంటి నటీమణులు కూడా తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. 19 ఏళ్ల వయసులోనే కాంప్రమైజ్ అవ్వాలనే ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు వారు బాహాటంగానే చెబుతున్నారు.
నిజానికి కాస్టింగ్ కౌచ్(Casting Couch) కేవలం సినీ రంగానికే పరిమితం కాలేదు. ఇది కార్పొరేట్ సంస్థల నుంచి రాజకీయం వరకు అన్ని చోట్లా వేళ్లూనుకుంది. ఫ్యాషన్ రంగంలో మోడళ్లను డ్రెస్ ట్రయల్స్ పేరుతో వేధించడం, టీవీ , ఓటీటీ ప్రొడక్షన్స్ లో ఛాన్సుల కోసం ఒత్తిడి చేయడం కామన్‌గా మారింది. 2023లో ఒక ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థలో కొంతమంది మహిళలు లైంగిక వేధింపుల ఫిర్యాదులు చేయడం, రాజకీయ రంగంలో ప్రజ్వల్ రేవణ్ణ వంటి వారి వీడియోలు బయటపడటం మనం చూశాం.
అంతెందుకు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చాలామంది యాంకర్లు ఈ కాస్టింగ్ కౌచ్(Casting Couch) బారిన పడినవారే. చదువు చెప్పే విద్యా సంస్థల్లో ప్రొఫెసర్లు కూడా విద్యార్థులను వేధిస్తున్న కేసులు నిత్యం నమోదవుతూనే ఉన్నాయి. అంటే అధికారం ఎక్కడైతే ఉంటుందో, అక్కడ ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళలను దోపిడీ చేసే మనస్తత్వం ప్రతి రంగంలోనూ కనిపిస్తోంది.
ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడకపోవడానికి మెయిన్ రీజన్ ఆ అమ్మాయిల ‘మౌనం’. ఒకవైపు అవకాశాలు పోతాయనే భయం, మరోవైపు సమాజం తనను ఎలా చూస్తుందో అన్న ఆందోళన బాధితులను కట్టిపడేస్తున్నాయి. టాలీవుడ్‌లో శ్రీరెడ్డి వంటి వారు బహిరంగంగా నిరసన తెలిపినప్పుడు, ఇండస్ట్రీ ఆమెను ఆదరించడం మానేసి బ్యాన్ చేసింది. అంటే గొంతు విప్పిన వారిని క్యారెక్టర్ లెస్ అని ట్యాగ్ చేయడం వల్ల బాధితులు భయపడుతున్నారు.
అలాగే చట్టపరమైన లోపాలు కూడా చాలానే ఉన్నాయి. వేధింపులను నిరూపించడానికి అవసరమైన ఆధారాలు సేకరించడం కష్టం కావడం, నిందితులకు పలుకుబడి ఉండటం వల్ల కేసులు చూస్తుండగానే నీరుగారిపోతున్నాయి. ఇండస్ట్రీలో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలు (ICC) ఉన్నా, అవి కేవలం పేరుకే ఉంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.
చిన్మయి మాట్లాడింది కరెక్టా కాదా అన్న చర్చ పక్కన పెడితే.. ఇప్పుడు ఆమె లేవనెత్తిన ప్రశ్నల్లో నిజం ఉందని మాత్రం ఒప్పుకోవాల్సిందే. చిరంజీవి చెప్పిన ‘నిబద్ధత’ అనే పదాన్ని ఇండస్ట్రీలోని కొంతమంది దళారులు ఎప్పుడూ తప్పుడు అర్థంలోనే వాడుతున్నారు. “నీకు హీరోయిన్ అవ్వాలని ఉందా? మరి ఏం కమిట్‌మెంట్ ఇస్తావని అడిగే కల్చర్ ఇంకా పోలేదు.
మరి దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే ఏం చేయాలంటే.. మొదటగా మలయాళ చిత్ర పరిశ్రమలో ఏర్పాటు చేసిన ‘హేమ కమిటీ’ లాంటి బలమైన వ్యవస్థలు ప్రతి ఇండస్ట్రీలో ఉండాలి. 2013 POSH (ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్‌మెంట్) చట్టాన్ని ప్రతి సెట్‌లోనూ కచ్చితంగా అమలు చేయాలి. మహిళలు కేవలం 10 శాతం మాత్రమే ఉండటం వల్ల మేల్ డామినేషన్ ఎక్కువగా ఉంది. అందుకే మహిళా భాగస్వామ్యం 50 శాతానికి పెరిగినప్పుడు ఇటువంటివి తగ్గే అవకాశం ఉంది.
తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షించే ధైర్యం ఫిలిం ఛాంబర్‌కు ఉండాలి. అవకాశాల కోసం శరీరాన్ని అడిగే పద్ధతికి చట్టపరంగా, సామాజికంగా సమాధి కట్టినప్పుడే అసలైన ప్రతిభకు గుర్తింపు దక్కుతుంది. గ్లామర్ లోకం ప్రకాశవంతంగా ఉండాలంటే, దాని వెనుక ఉన్న ఇటువంటి చీకటి మచ్చలను కడిగేయాలి.
Municipal Elections : తెలంగాణ మున్సిపోల్స్‌కు మోగిన నగారా..పోలింగ్ , కౌంటింగ్ ఎప్పుడంటే ?
