Municipal Elections : తెలంగాణ మున్సిపోల్స్‌కు మోగిన నగారా..పోలింగ్ , కౌంటింగ్ ఎప్పుడంటే ?

Municipal Elections : ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్‌‌ను విడుదల చేశారు.ఆమె ప్రకటనతో ఇవాల్టి నుంచే ఎన్నికలు జరిగే పట్టణాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చేసింది

Municipal Elections

తెలంగాణలో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. కొంతకాలంగా ప్రధాన రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) ప్రకటించింది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్‌‌ను విడుదల చేశారు.ఆమె ప్రకటనతో ఇవాల్టి నుంచే ఎన్నికలు జరిగే పట్టణాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చేసింది.

షెడ్యూల్ ప్రకారం..రేపటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. జనవరి 30 వరకూ నామినేషన్ల స్వీకరణ, జనవరి 31న వాటి పరిశీలన ఉంటుంది. నామినేషన్లు విత్ డ్రా చేసుకునేందుకు ఫిబ్రవరి 3వ తేదీ చివరి గడువు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుండగా.. ఫిబ్రవరి 13న ఫలితాలు వెల్లడించనున్నారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరగనున్నాయి.

ఏదైనా సమస్యలతో ఎక్కడైనా రీపోలింగ్ కు అవసరం ఏర్పడితే ఫిబ్రవరి 12న నిర్వహిస్తారు. ఫలితాలు విడుదలైన మూడు రోజుల్లో అంటే ఫిబ్రవరి 16న మున్సిపాలిటీల్లో ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ ఎన్నిక ఉంటుంది. అలాగే 7 కార్పొరేషన్లలోనూ అదే రోజు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా ఉంటుంది.

మున్సిపల్ ఎన్నికలకు(Municipal Elections) సంబంధించి తెలంగాణలో మొత్తం 52 లక్షల 43 వేల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నట్టు కమీషనర్ రాణి కుముదిని చెప్పారు. మొత్తం 2996 వార్డులకు ఎన్నికలు జరుగుతాయనీ, ఈ ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఓటర్ల జాబితా కూడా పూర్తయిందని వెల్లడించారు.

పోలీస్ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ సమస్యాత్మక ప్రాంతాల్లో మరింత భద్రత కల్పిస్తామన్నారు. రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభం కానుండటంతో.. రిటర్నింగ్ అధికారులు తమ కార్యాలయాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ఆయా ప్రాంతాల పరిధిలో అందరూ సహకరించాలని కోరారు.

Municipal Elections

ఇదిలా ఉంటే ఇటీవలే స్థానిక సంస్థల ఎన్నికలు ముగియగా.. ఇప్పుడు పట్టణ ఓటర్ల తీర్పు ఎటు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల(Municipal Elections) షెడ్యూల్ ముఖ్యతేదీలు

మున్సిపాలిటీలు 116 , కార్పొరేషన్లు 7

ఓటు హక్కు వినియోగించుకునేవారి సంఖ్య : 52,43,000

నామినేషన్ల స్వీకరణ : 28.01.2026

నామినేషన్ల ముగింపు: 30.01.2026

పోలింగ్ తేదీ: 11.02.2026

ఓట్ల లెక్కింపు: 13.02.2026

మేయర్, ఛైర్ పర్సన్‌ల ఎన్నిక – 16.02.2026

Nipah Virus:పెరుగుతున్న నిపా వైరస్ కేసులు..తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి?

Exit mobile version