Pulasa: చేప కోసం వేలం పాటలు..పులస ఎందుకంత స్పెషల్?!

 Pulasa : పులస రుచిని వర్ణించడం అసాధ్యమని చేప ప్రియులు చెబుతారు

 Pulasa : గోదావరి నదిలోకి అరుదైన పులసల సందడి మొదలైంది. దీంతో స్థానిక మత్స్యకారులతో పాటు, పులస ప్రియుల్లో కొత్త ఉత్సాహం నిండింది. అరుదుగా చిక్కుతున్న ఈ చేపల కోసం వేలం పాటలు జరుగుతుండగా, వాటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇటీవల కోసేందుకు కేవలం రెండు ముక్కలయ్యే పరిమాణంలో ఉన్న కొన్ని పులసలు దొరికితే, వాటికే రూ. 2,000 నుంచి రూ. 2,500 వరకు పలికాయంటే, పులసలకు మార్కెట్లో ఎంతటి డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

 Pulasa

తొమ్మిది రోజుల క్రితం లభ్యమైన ఓ పులస చేప (Pulasa Fish) ఏకంగా రూ. 22,000 వేలకు అమ్ముడుపోగా, తాజాగా యానాం మార్కెట్లో మరో పులస రూ. 17,000 వేలకు వేలంలో అమ్ముడైంది. కేవలం కిలో నుంచి కిలోన్నర బరువున్న చేపలకు ఈ ధర పలకడం ఆశ్చర్యకరం. గోదావరిలోకి ఎదురీది వచ్చే పులసలకు మాత్రమే ఇంతటి ధర, ప్రత్యేకమైన రుచి ఉంటుందని చెబుతారు.

పుస్తెలమ్మైనా పులస తినాలన్న’ సామెత కేవలం అతిశయోక్తి కాదు, దాని అద్భుతమైన రుచికి నిదర్శనం. పులస రుచిని వర్ణించడం అసాధ్యమని చేప ప్రియులు చెబుతారు. నిజానికి పులస అనేది ‘ఇలస (Hilsa)’ అనే సముద్రపు చేప యొక్క ఒక ప్రత్యేక దశ. ఇలస చేపలు సముద్రంలో నివసిస్తాయి. అయితే, వర్షాకాలంలో, గోదావరి నదికి వరదలు వచ్చి, నదీజలాలు ఉప్పొంగినప్పుడు, ఇలస చేపలు గుడ్లు పెట్టడానికి, తమ సంతానోత్పత్తి కోసం సముద్రం నుంచి నదిలోకి ఎదురీదుకుంటూ వస్తాయి.

ఈ ప్రయాణంలో, సముద్రపు ఉప్పునీటి నుంచి గోదావరి నదిలోని స్వచ్ఛమైన మంచినీటిలోకి ప్రవేశించిన తర్వాత, వాటి శరీర రసాయన, జీవక్రియల్లో మార్పులు జరుగుతాయి. ఈ క్రమంలో, అవి నదిలోకి ఎదురీదుకుంటూ ప్రయాణించే శారీరక శ్రమ, మరియు నదీజలాల్లో లభించే ప్రత్యేకమైన శైవలాలు, ఆహారం వల్ల వాటి కండర నిర్మాణం, కొవ్వు శాతం మారిపోతాయి. ఈ మార్పుల ఫలితంగా వాటి రుచి అనూహ్యంగా పెరుగుతుంది. అలా నదిలోకి ఎదురీది వచ్చిన ఇలస చేపలనే ‘పులసలు’ అని పిలుస్తారు.

ఈ పరివర్తన సాధారణంగా ఇలస చేపలు సముద్రం నుంచి నదిలోకి ప్రవేశించిన తర్వాత ఒకటి నుంచి రెండు నెలల కాలంలో జరుగుతుంది. ఈ సమయంలోనే అవి పులసలుగా మారి, వాటికి ఆ ప్రత్యేకమైన రుచి వస్తుంది. ఈ వ్యవధిలోనే వాటిని పట్టుకుంటారు.ఆ తర్వాత ఇవి ఇలసలుగా మారిపోతాయి.

పులస చేపలు సాధారణంగా వర్షాకాలంలో, అంటే జులై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో గోదావరి నదిలోకి వస్తాయి. ఈ మూడు నెలలే పులసల సీజన్. ఈ సమయంలోనే చేప ప్రియులు పులసలను దక్కించుకోవడానికి తీవ్రంగా పోటీ పడతారు. కొందరు ఏకంగా మత్స్యకారులకు ముందుగానే అడ్వాన్స్‌లు ఇచ్చి, పులస చిక్కితే తమకే ఇవ్వాలని కోరుకుంటారు.

ఈసారి గోదావరికి ఎర్రనీరు (Godavari River), పులసలు మాత్రం ఆశించిన స్థాయిలో చిక్కడం లేదని జాలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు, నదిలో నీటి ప్రవాహం వంటివి పులసల లభ్యతపై ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం ఆరుదుగా లభిస్తున్నా, ఆగస్టు నెలలో గంగమ్మ తమను కరుణించి, పులసల దిగుబడి పెరుగుతుందని జాలర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ అద్భుతమైన రుచిని ఆస్వాదించడానికి వేచి ఉన్న పులస ప్రియులకు ఆగస్టు నెలలో తీపి కబురు అందుతుందేమో చూడాలి.

 

 

Exit mobile version