Silver:ఫ్యూచర్ పెట్టుబడిగా వెండిని కొంటున్నారా? వీరికి ఫిబ్రవరి 1న షాక్ తప్పదా?

Silver : పారిశ్రామికంగా దీనికి ఉన్న డిమాండ్ ఓవైపు, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం వంటి భౌగోళిక ఉద్రిక్తతలు మరోవైపు.. వెండిని ఆకాశానికి ఎత్తేశాయి.

Silver

కొద్ది రోజులుగా బులియన్ మార్కెట్‌లో బంగారం కంటే వెండి(Silver) ధరలే హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. 2026 ప్రారంభం నుంచి వెండి ధరలు ఊహించని విధంగా 60 శాతం పైగా పెరిగాయి. దీంతో బంగారం కొనలేని వారు వెండిని నిల్వ చేయడం (Stacking) మొదలుపెట్టారు. అయితే, ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌లో వెండిపై దిగుమతి సుంకాన్ని (Import Duty) భారీగా తగ్గించే అవకాశం ఉందనే చర్చ ఆర్థిక వర్గాల్లో నడుస్తోంది.

ప్రస్తుతం 6 శాతం వరకు ఉన్న దిగుమతి సుంకాన్ని మరింత తగ్గిస్తే, వెండి(Silver) ధరలు ఒక్కరోజులోనే కిలోపై 20 వేల నుంచి 40 వేల రూపాయల వరకు పడిపోయే ప్రమాదం ఉంది. ఈ భారీ మార్పు జరిగితే, గరిష్ట ధరల వద్ద వెండి కొన్న సామాన్య ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అందుకే నిపుణులు ఇప్పుడు అత్యాశకు పోయి అప్పులు చేసి వెండి కొనకండి అని హెచ్చరిస్తున్నారు.

వెండి ఎందుకు ఇంతలా పెరుగుతోంది?..ప్రస్తుతం వెండి పెరగడానికి కేవలం వెండి(Silver) ఆభరణాలు, వస్తువుల వినియోగం మాత్రమే కారణం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), సోలార్ ప్యానెల్స్ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్లలో వెండి వాడకం విపరీతంగా పెరిగింది. పారిశ్రామికంగా దీనికి ఉన్న డిమాండ్ ఓవైపు, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం వంటి భౌగోళిక ఉద్రిక్తతలు మరోవైపు.. వెండిని ఆకాశానికి ఎత్తేశాయి.

దీంతో వెండి ధరలు ఇంకా పెరుగుతాయన్న భయంతో ఇన్వెస్టర్లు బంగారాన్ని వదిలి వెండి వైపు మళ్లారు. అయితే, ఏ వస్తువు ధర అయినా అతిగా పెరిగినప్పుడు అది ఒక్కసారిగా కుప్పకూలే ప్రమాదం (Profit Booking) ఉంటుంది. ఈరోజు జనవరి 30న కూడా లాభాల స్వీకరణ వల్ల వెండి ధరలు భారీగా తగ్గడమే దీనికి నిదర్శనం అంటున్నారు ఆర్ధిక నిపుణులు

Silver

చరిత్రను చూస్తే ఇలాంటి సంఘటనలు కనిపిస్తాయి. ముఖ్యంగా 2024 జూలై బడ్జెట్ సమయంలో కేంద్రం బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని ఏకంగా 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. ఆ ఒక్క నిర్ణయంతో బంగారం ధర తులంపై రూ. 4,000 పడిపోగా, వెండి కిలోపై రూ. 6,000 వరకు అప్పటికప్పుడే పడిపోయాయి. అంతకుముందు 2013లో కూడా భారీగా పెరిగిన బంగారం ధరలు బడ్జెట్ నిర్ణయాల వల్ల.. కుప్పకూలిన సందర్భాలు ఉన్నాయి. ధరలు పెరిగినప్పుడు కొని, బడ్జెట్ తర్వాత ధరలు తగ్గినప్పుడు బాధపడటం కంటే.. మార్కెట్ నిలకడగా ఉండే వరకు వేచి చూడటం మంచిది అంటున్నారు నిపుణులు.

బడ్జెట్ తర్వాత ఏం జరగొచ్చు?..ఒకవేళ ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం వెండిపై సుంకాన్ని తగ్గిస్తే, అది దేశీయ మార్కెట్‌లో వెండిని చౌకగా మారుస్తుంది. దీంతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు కూడా దీనిపై ప్రభావం చూపుతాయి. సామాన్యులకు నిపుణుల సలహా ఏంటంటే, వెండిని కేవలం పెట్టుబడిగా మాత్రమే చూడొద్దు. ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు ‘ఫోమో’ (FOMO – ఎక్కడ లాభం మిస్ అవుతామో అనే భయం) తో కొనడం ఆపేయాలి. వెండి ధర ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇది చాలా వేగంగా పెరుగుతుంది, అంతే వేగంగా పడిపోతుంది. అందుకే ఇప్పుడున్న ఈ హైప్ చూసి బుక్ అయిపోవద్దంటున్నారు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version