Egg :గుడ్డు తినాలంటే భయపడాల్సిందే..రికార్డు స్థాయికి చేరిన ధరలు

Egg: ఒక ట్రే గుడ్లు 160 నుండి 170 రూపాయలకు లభించేవి, కానీ ఇప్పుడు వాటి ధర 220 రూపాయలకు పైగా పెరగడం సామాన్య ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

Egg

సామాన్యుడికి పోషకాహారం అందించే కోడిగుడ్డు (Egg)ఇప్పుడు ధరల విషయంలో చుక్కలను చూపిస్తోంది. పౌల్ట్రీ రంగ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కోడిగుడ్డు ధరలు ఆకాశాన్ని తాకాయి. నిన్న మొన్నటి వరకు ఐదు లేదా ఆరు రూపాయల వద్ద ఉన్న ఒక్కో గుడ్డు ధర ఇప్పుడు ఏకంగా ఎనిమిది రూపాయలకు చేరింది.

బహిరంగ మార్కెట్లో ఎనిమిది రూపాయలు ఉంటే హోల్‌సేల్ మార్కెట్లోనే గుడ్డు(Egg) ధర ఏడు రూపాయల ముప్పై పైసలు పలుకుతోంది. సాధారణంగా ఒక ట్రే గుడ్లు 160 నుండి 170 రూపాయలకు లభించేవి, కానీ ఇప్పుడు వాటి ధర 220 రూపాయలకు పైగా పెరగడం సామాన్య ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఇది పెద్ద భారంగా మారింది.

ధరలు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం ఉత్పత్తి భారీగా తగ్గడమే. కోళ్ల ఫారాల నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతుండటంతో చాలా మంది రైతులు ఈ రంగానికి దూరమవుతున్నారు. కోళ్లకు పెట్టే దాణా, మక్కలు , సోయా వంటి ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి.

Egg

దీనివల్ల చిన్న తరహా కోళ్ల ఫారాలను యజమానులు మూసివేస్తున్నారు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో రోజుకు సుమారు ఎనిమిది కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యేవి, కానీ ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా పడిపోయింది. అలాగే కోల్డ్ స్టోరేజీల్లో ఉండే నిల్వలు కూడా పూర్తిగా తగ్గిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు.

మరోవైపు నాటు కోడి గుడ్ల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం ఒక్కో నాటు కోడి గుడ్డు 15 రూపాయల వరకు పలుకుతోంది. శీతాకాలం కావడంతో గుడ్లకు డిమాండ్ పెరగడం, అదే సమయంలో సరఫరా తగ్గడం వల్ల ధరలు అదుపులోకి రావడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రభుత్వం కోళ్ల దాణాపై సబ్సిడీ ఇవ్వడం లేదా ఉత్పత్తిని పెంచేలా ప్రోత్సాహకాలు అందిస్తే తప్ప ధరలు తగ్గేలా కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో ఒక్కో గుడ్డు పది రూపాయల వరకు వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాపార వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇది సామాన్యుడి డైట్ మీద ,హోటల్ వ్యాపారాల మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version