Gold
ఎప్పుడూ బంగారం(Gold) ధరలు సామాన్యులకు షాకిస్తుంటే.. ఇప్పుడు మాత్రం సామాన్యులు బంగారానికి షాకిచ్చారు. రోజు రోజుకూ పెరుగుతున్న ధరల నేపథ్యంలో బంగారు ఆభరణాల సేల్స్ తగ్గినట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక విడుదల చేసింది. ఈ ఏడాది జులై-సెప్టెంబరులో ఇండియాలో పసిడి గిరాకీ పరిమాణపరంగా 16 శాతం తగ్గింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో భారత్‌లో బంగారం డిమాండ్ 16 శాతం తగ్గి 209.4 టన్నులకు పరిమితమైనట్టు డబ్ల్యూజీసీ తెలిపింది. ధరలు పెరగడంతో ఆభరణాల డిమాండ్ తగ్గింది.
మరోవైపు సురక్షిత సాధనంగా పెట్టుబడుల పరమైన డిమాండ్ పెరిగిందనని డబ్ల్యూజీసీ తన నివేదికలో పేర్కొంది. పరిమాణం పరంగా డిమాండ్ తగ్గినప్పటికీ, విలువ పరంగా సెప్టెంబర్ త్రైమాసికంలో 2 లక్షల 3 వేల 240 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే బంగారం విలువ 23 శాతం పెరిగింది. ధరలు అధికంగా ఉండడం వల్ల కొనుగోలు పరిమాణం తగ్గినప్పటికీ, విలువ మాత్రం అదే స్థాయిలో ఉంది.
డబ్ల్యూజీసీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం జులై-సెప్టెంబరులో మొత్తంగా 209.40 టన్నుల పసిడి(Gold)ని కొనుగోలు చేశారు. గతేడాది ఇదే సమయంలో పసిడి కొనుగోళ్లు 248.30 టన్నులు. విలువ పరంగా పసిడి కొనుగోళ్లు లక్షా 65 వేల 380 కోట్ల నుంచి 23 శాతం పెరిగి 2 లక్షల 3 వేల 240 కోట్లకు పెరిగాయి. పసిడి ధర బాగా పెరగడం దీనికి కారణంగా చెప్పొచ్చు. పసిడి ఆభరణాల కొనుగోళ్లు 171.60 టన్నుల నుంచి 31 శాతం తగ్గి 117.7 టన్నులకు పరిమితమయ్యాయి. పసిడి ఆభరణాల కొనుగోళ్లు పెద్దగా మార్పు లేకుండా లక్షా 14 వేల 270 కోట్లుగా నమోదయ్యాయి.
పెట్టుబడుల నిమిత్తం పసిడి(Gold) కొనుగోలు 20 శాతం పెరిగి 91.6 టన్నులకు చేరగా.. విలువ పరంగానూ 51 వేల 80 కోట్ల నుంచి 88 వేల 970 కోట్లకు పెరిగింది. జులై-సెప్టెంబరులో భారత్‌లో 10 గ్రాముల పసిడి ధర లక్ష దాటింది. ఏడాది క్రితం ఇదే సమయంలో బంగారం ధర 66 వేల 614 గా ఉంది. అంటే గత ఏడాది కంటే ఇప్పుడు ధర ఏకంగా 46 శాతం పెరిగింది. జులై-సెప్టెంబరులో ప్రపంచవ్యాప్తంగా 1313 టన్నులకు పసిడి గిరాకీ పెరిగింది. పలు దేశాల కేంద్ర బ్యాంకులు పసిడి కొనుగోళ్లను పెంచడం, పెట్టుబడులకు అధిక గిరాకీ ఇవ్వడం దీవికి కారణమైందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
