Income tax
ఇప్పుడు ప్రతి ఉద్యోగి జేబులో ఒక క్రెడిట్ కార్డు తప్పనిసరిగా ఉంటోంది. చాలామంది తమ క్రెడిట్ కార్డుతో స్నేహితుడికి విమాన టికెట్లు బుక్ చేయడం, విలువైన వస్తువులను కొనుగోలు చేయడం లేదా ఆన్‌లైన్ బిల్లులు చెల్లించడం వంటివి చేస్తుంటారు. ఈ ఖర్చుల తర్వాత వాళ్లు ఆ మొత్తాన్ని మీకు ఫోన్‌పే, గూగుల్ పే లేదా బ్యాంక్ బదిలీల ద్వారా తిరిగి పంపడం సర్వసాధారణం. అయితే, ఇదే అలవాటు పన్ను అధికారుల దృష్టిలో మీకు కొత్త సమస్యలను సృష్టించొచ్చని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.
ఆదాయపు పన్ను(Income tax) శాఖ ప్రకారం, మీ బ్యాంక్ ఖాతాకు వచ్చే ప్రతి పెద్ద మొత్తం ఆదాయంగా పరిగణిస్తారు. మీరు మీ స్నేహితుల నుంచి తరచుగా లేదా పెద్ద మొత్తంలో డబ్బును స్వీకరిస్తుంటే, పన్ను శాఖ దీనిని మీ అదనపు ఆదాయంగా భావించి మీకు నోటీసులు పంపొచ్చు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మీ ఆదాయమా? అంటూ వారు ప్రశ్నించే అవకాశం ఉంది. ఉదాహరణకు, మీరు మీ కార్డుతో స్నేహితుడి కోసం రూ.50,000 ఫోన్ కొని, ఆ డబ్బును తిరిగి పొందితే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ, ఇలాంటి లావాదేవీలు పదే పదే, ఎక్కువ మొత్తాల్లో జరిగితే, మీపై అనుమానాలు పెరిగిపోతాయి.
ఆదాయపు పన్ను(Income tax) శాఖకు బ్యాంకులు కొన్ని ముఖ్యమైన ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని నివేదిస్తాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో మీ క్రెడిట్ కార్డ్ ఖర్చులు రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ దాటితే, ఆ సమాచారాన్ని బ్యాంక్ నేరుగా ఆదాయపు పన్ను(Income tax) శాఖకు తెలియజేస్తుంది. ఈ పరిమితిని దాటినప్పుడు మీ లావాదేవీలపై ఐటీ శాఖ దృష్టి పెడుతుంది. మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లును రూ. 1 లక్ష కంటే ఎక్కువ మొత్తాన్ని నగదు రూపంలో చెల్లిస్తే, అది కూడా అనుమానాలకు తావిస్తుంది. నగదు మూలాన్ని పన్ను అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. అందుకే ప్రతి లావాదేవీని బ్యాంకింగ్ ద్వారానే చేయడం మంచిది.
స్నేహంలో సహాయం చేయడం మంచిదే, కానీ తెలివిగా వ్యవహరించడం అవసరం.కొన్ని కొన్ని సమయాల్లో మీ క్రెడిట్ కార్డులతో వస్తువులు కొనుక్కుని మీతో డబ్బులు కట్టించడం, తిరిగి ఇవ్వకపోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి.
మీ స్నేహితుల నుంచి డబ్బు తీసుకునేటప్పుడు ఎప్పుడూ నగదు తీసుకోకుండా, యూపీఐ, నెఫ్ట్ (NEFT) లేదా ఐఎంపీఎస్ (IMPS) వంటి బ్యాంకింగ్ మార్గాలను ఉపయోగించండి. దీనివల్ల ప్రతి లావాదేవీకి ఒక రికార్డు ఉంటుంది, ఇది అవసరమైనప్పుడు రుజువుగా పనిచేస్తుంది.అలాగే ఒకే వ్యక్తితో తరచుగా, పెద్ద మొత్తంలో లావాదేవీలు జరపడం మానుకోండి. ఇది పన్ను శాఖ దృష్టిలో మీరు వ్యాపార కార్యకలాపాలు చేస్తున్నట్టుగా కనిపించవచ్చు.
చాలా పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం చేయాలనుకున్నప్పుడు, అది అప్పు లేదా సహాయం మాత్రమే అని రుజువు చేసేందుకు వీలుగా ఒక చిన్న రాతపూర్వక ఒప్పందం లేదా కనీసం డిజిటల్ రికార్డును ఉంచుకోవడం మంచిది. ఇది భవిష్యత్తులో అడిగితే వివరణ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. సహాయం చేయడం మంచి లక్షణమే కానీ, మన ఆర్థిక భద్రతను నిర్లక్ష్యం చేయడం తెలివైన పని కాదు.