Chicken
నవంబర్ 20తో కార్తీకమాసం ముగియడంతో.. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మాంసాహార ప్రియులు ఒక్కసారిగా చికెన్ (chicken)షాపుల వైపు పరుగులు తీశారు. కార్తీకమాసం ముగిసిన వెంటనే వచ్చిన తొలి ఆదివారం కావడంతో, మాంసం దుకాణాల ముందు కిక్కిరిసిన జనం కనిపించారు. దాంతో డిమాండ్ అమాంతం పెరిగిపోవడం వల్ల చికెన్, కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి.
మూడు వారాలుగా స్థిరంగా కొనసాగిన చికెన్ ధరలు ఒక్క రోజులోనే ఊహించని స్థాయిలో పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ సహా ప్రధాన మార్కెట్లలో స్కిన్‌లెస్ చికెన్ ధర కిలోకు దాదాపు రూ.230 నుంచి రూ.250 మధ్య పలుకుతోంది. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి ఆంధ్రా ప్రాంతాల్లోనూ ఇదే ధరకు అమ్ముడవుతోంది. ప్రస్తుత డిమాండ్‌ను బట్టి చూస్తే, ఈ నెలాఖరుకు చికెన్ ధర కిలోకు రూ. 280 వరకు చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ధరల పెరుగుదల సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయిందనే చెప్పాలి.
మరోవైపు, మటన్ ధరలు మాత్రం ఎప్పటిలాగే ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం కిలో మటన్ ధర రూ. 800 నుంచి రూ. 900 మధ్యలో ఉంది. వీటి ధరల్లో పెద్దగా మార్పు లేకపోయినా, చికెన్ ధరల పెరుగుదల మాత్రం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది.
కేవలం చికెన్(Chicken) మాత్రమే కాదు, కోడిగుడ్ల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం ఒక్కొక్కటి రూ. 7.50 నుంచి రూ. 8 వరకు అమ్ముడవుతోంది. కూరగాయల ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు మధ్యతరగతి కుటుంబాలకు చౌకైన ప్రత్యామ్నాయంగా కోడిగుడ్లు ఉండేవి. ఇప్పుడు వాటి ధరలు కూడా పెరగడంతో, సామాన్యులకు గుడ్డు కూడా భారం మారింది. వచ్చే రెండు మూడు వారాల్లో డజను గుడ్ల ధర రూ. 100 మార్కును తాకే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
ప్రతీ ఏటా కార్తీకమాసం ముగిసి, మార్గశిర మాసం మొదలయ్యే నవంబర్ 21 తరువాత చికెన్(Chicken), కోడిగుడ్లకు డిమాండ్ పెరిగి, ధరలు పెరగడం సర్వసాధారణమే అయినా కూడా, ఈసారి పెరుగుదల చాలా వేగంగా ఉండటంతో మాంస ప్రియులు ధరలు ఎప్పుడు తగ్గుతాయో అని ఎదురుచూస్తున్నారు.
