Ibomma
వేలాది సినిమాలు పైరసీ చేసి చిత్రపరిశ్రమకు కోట్ల రూపాయల నష్టం తెచ్చిన ఐ బొమ్మ(Ibomma) రవి కేసులో పోలీసులు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. ఈ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో రవి తన నేరాన్ని అంగీకరించాడని తెలిసింది. పైరసీ వెబ్ సైట్లు ఎలా రన్ చేసాడో వివరించాడని పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు. ఐబొమ్మ, బప్పం పేరుతో మొత్తం 17 వెబ్ సైట్లు నడిపించినట్టు గుర్తించారు. ఐబొమ్మ(Ibomma) వెబ్ సైట్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంపై అతను ఫోకస్ పెట్టగా.. చివరికి అదే అతన్ని పట్టించిందని పోలీసులు తెలిపారు.ఐ బొమ్మ, బెట్టింగ్ సైట్స్ రెండు ట్రాఫిక్ డొమైన్స్ ఏర్పాటు చేసినట్లుగా గుర్తించారు.
వీటి రిజిస్ట్రేషన్లే నిందితుడిని దొరికేలా చేశాయి, ఒక ట్రాఫిక్ డొమైన్ అమెరికాలోనూ, మరొకటి అమీర్ పేట్ లోనూ రిజిస్టర్ అయినట్టు గుర్తించి దీని ద్వారానే పట్టుకున్నారు. ఒక సైట్ బ్లాక్ చేయగానే మరొకటి క్రియేట్ చేయడం ద్వారా తన దందా కొనసాగించాడని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. రని అరెస్ట్ చేయకుంటే ఇలాంటి వెబ్ సైట్లు మళ్లీ మళ్ళీ సృష్టిస్తూనే ఉంటాడని పేర్కొన్నారు. కరేబియన్ దీవుల్లో అక్కడి పౌరసత్వం తీసుకున్న రవి విలాసవంతమైన జీవితం గడిపాడని గుర్తించారు. ప్రతీ 2 నెలలకోసారి దేశాలు తిరిగేవాడని వెల్లడించారు.
విదేశీ పౌరసత్వం తీసుకోవడం ద్వారా తన క్రిమనల్ దందాను సుధీర్ఘ కాలం నడిపేలా ప్లాన్ చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో తనకు ఎలాంటి సంబంధం లేదని విచారణలో రవి పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. అలాగే తాము అరెస్ట్ చేసేందుకు వెళ్లినప్పుడు గంటకు పైగా తలుపు తీయలేదని, ఆధారాలు నాశనం చేసేందుకు ప్రయత్నించాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ల్యాప్ టాప్, ఫోన్లను దాచి పెట్టాడని, టెలిగ్రామ్, వాట్సాప్ లో చాట్ హిస్టరీని తొలగించాడని తెలిపారు. ఇదిలా ఉంటే ఐ బొమ్మ రవి కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది.
ఈ కేసులో మనీలాండరింగ్ జరిగినట్టు అనుమానిస్తున్న ఈడీ కేసు వివరాలు పంపించాలంటూ హైదరాబాద్ సీపీని కోరింది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినట్టు పోలీసులు కూడా రిమాండ్ రిపోర్టులో పేర్కొనడంతో ఈడీ పూర్తిగా ఫోకస్ పెట్టింది. బెట్టింగ్ యాప్స్ నుంచి క్రిప్టో కరెన్సీ ద్వారానే రవికి నిధులు చేరాయని భావిస్తున్నారు. ఈ నిధులతో రవి విదేశాల్లో ఇళ్లు, పలు ఆస్తులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు.
