Railway Stations
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థలో.. భారతదేశంలోని రైల్వే వ్యవస్థ ఒకటి అని తెలిసిందే. అయితే పట్టాలపై పరుగులు తీసే రైళ్లతో పాటు, కొన్నికొన్ని స్టేషన్ల చుట్టూ అల్లుకున్న రహస్యాలు కూడా అంతే ఆసక్తికరంగా ఉంటాయి. కొన్ని రైల్వే స్టేషన్లు కేవలం ప్రజా రవాణా కేంద్రాలుగా కాకుండా, దశాబ్దాల పాటు భయానికి, వింత అనుభవాలకు చిరునామాలుగా మిగిలిపోయాయి.
దీనిలో పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలో ఉన్న బేగున్‌కోడోర్ స్టేషన్ చాలా ప్రసిద్ధమైనది. 1960ల కాలంలో ఒక స్టేషన్ మాస్టర్ అక్కడ తెల్లచీర కట్టుకున్న మహిళను పట్టాలపై చూశారని, ఆ తర్వాత ఆయనతో పాటు ఆయన కుటుంబం కూా అనుమానాస్పదంగా మరణించారని జరిగిన ప్రచారం ఆ ప్రాంతాన్ని గజగజలాడించింది.
ఆ భయం ఎంతగా పెరిగిపోయిందంటే, ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 42 ఏళ్ల పాటు భారత రైల్వే శాఖ ఈ స్టేషన్‌ను మూసివేసింది. ఏ రైలు కూడా అక్కడ ఆగేది కాదు. చివరకు చిన్నస్థాయి ఉద్యోగి కూడా అక్కడ పని చేయడానికి సిద్ధపడలేదు. చివరకు 2009లో ఈ స్టేషన్‌ను మళ్లీ తెరిచాక.. అది ఒక పర్యాటక ప్రాంతంగా మారిపోయింది.
అలాగే హిమాచల్ ప్రదేశ్‌లోని బరోగ్ రైల్వే స్టేషన్(Railway Stations) కూడా ఒక విషాద గాథకు నిలయమే. కల్కా-సిమ్లా రైల్వే లైన్‌లో 33వ నంబర్ సొరంగం తవ్వడంలో విఫలమయ్యానంటూ అవమాన భారంతో ఇంజనీర్ కల్నల్ బరోగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆయన ఆత్మ ఇప్పటికీ ఆ సొరంగం వద్ద తిరుగుతుందని స్థానికులు నమ్ముతారు.
అయితే ఒకప్పుడు నిర్మానుష్యంగా, భయం కలిగించేలా ఉన్న ఈ ప్రదేశాలు ఇప్పుడు మిస్టరీ టూరిజం పేరుతో కొత్త రూపును సంతరించుకుని కళకళలాడుతున్నాయి. మనుషులు సహజంగానే అంతుచిక్కని రహస్యాలన్నా, సాహసాలన్నా బాగా ఇష్టపడతారు. ఆ ఇష్టమే ఈ దెయ్యాల రైల్వే స్టేషన్ల(Railway Stations)ను లాభదాయకమైన పర్యాటక కేంద్రాలుగా మారుస్తోంది.
అయితే ఇక్కడ చీకటి పడ్డాక మాత్రం ఎవరూ ఉండరు. ఇప్పటికీ అక్కడ వినిపించే వింత శబ్దాలు వస్తుంటాయని కొంతమంది పర్యాటకులు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. మొత్తంగా చరిత్రకు, ఊహకు మధ్య ఉండే సన్నని గీతను ఈ స్టేషన్లు పరిచయం చేస్తాయి.అలాగే మన దేశంలోని స్థానికంగా ఉన్న కథలు, నమ్మకాలు మారి ఈ కాలంలో ఎలా పర్యాటక వ్యాపారాలుగా మారుతున్నాయో చెప్పడానికి ఇవే నిదర్శనంగా నిలిచాయి.
