Bail
తెలుగు సినీ ఇండస్ట్రీని వణికించిన పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ (IBomma) సూత్రధారి ఇమ్మడి రవి బెయిల్ (Bail) పిటిషన్లను.. కోర్టు వరుసగా కొట్టివేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేవలం సినిమాలు దొంగిలించి వెబ్‌సైట్‌లో పెట్టాడనే పాయింట్ మాత్రమే కాకుండా..దీని వెనుక ఉన్న భారీ కుట్రను, ఆర్థిక నేరాలను పోలీసులు కోర్టు ముందు బలంగా ఉంచారు. ముఖ్యంగా 5 వేర్వేరు కేసుల్లో దాఖలైన ఐదు బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు , హైకోర్టు తోసిపుచ్చడం వెనుక కీలకమైన కారణాలున్నాయి.
విశాఖపట్నంకు చెందిన ఇమ్మడి రవి, సామాన్య వ్యక్తిలా కనిపిస్తూనే.. కరీబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పౌరసత్వం తీసుకున్నాడు. అమెరికా, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లోని సర్వర్లను వాడుతూ ఒక భారీ పైరసీ సామ్రాజ్యాన్నే నిర్మించాడు.
నెలకు 50 లక్షల మంది ట్రాఫిక్ తో, సుమారు 21,000 పైగా సినిమాలను పైరసీ చేస్తూ.. ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం మిగిల్చినట్లు పోలీసులు . నన్ను ఎవరూ పట్టుకోలేరని పోలీసులకే సవాల్ విసిరిన రవిని, చివరకు ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ రాగానే కూకట్‌పల్లి అపార్ట్‌మెంట్‌లో పోలీసులు వల పన్ని పట్టకున్నారు. అతని వద్ద నుంచి రూ. 20 కోట్లకు పైగా అక్రమ సంపాదనను, హార్డ్ డిస్కులను సీజ్ చేశారు.
రవి దగ్గర విదేశీ పౌరసత్వం ఉండటం కోర్టును ఆలోచనలో పడేసిందని చెప్పొచ్చు. ఒకవేళ బెయిల్ (Bail) ఇస్తే, అతను తనకున్న అంతర్జాతీయ సంబంధాలను వాడుకుని దేశం దాటి పారిపోయే అవకాశం ఉందని పోలీసులు బలంగా వాదించారు. సెయింట్ కిట్స్ వంటి దేశాలతో ఉన్న లింకులు, అతని వద్ద ఉన్న పాస్‌పోర్టుల వల్ల ఒకసారి దేశం దాటితే మళ్లీ పట్టుకోవడం అసాధ్యం.
ఐబొమ్మ అనేది కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. దీని ద్వారా వన్-విన్ (1win), వన్-ఎక్స్ బెట్ (1xbet) వంటి బెట్టింగ్ యాప్స్ కు రీడైరెక్ట్ చేయడం, ఏపీకే (APK) ఫైల్స్ ద్వారా డేటా చోరీ చేయడం వంటి సైబర్ నేరాలకు కూడా ఇది అడ్డాగా మారింది. ఇది యూత్‌ను ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీసే డిజిటల్ మాఫియాగా కోర్టు భావించింది.
ఈ కేసులో రవి ఒక్కడే కాదు.. ఇంకా చాలా మంది సహచరులు, ఏజెంట్లు బయట ఉన్నారు. ఇప్పుడు రవికి బెయిల్(Bail)ఇస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని, సహ నిందితులను ప్రభావితం చేస్తాడని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికే కేంద్ర ఏజెన్సీలు (ED) కూడా మనీ ల్యాండరింగ్ కోణంలో విచారణ మొదలుపెట్టాయి.
కోర్టులో రవి (IBomma) తరపు లాయర్లు ..రవి ఎక్కడికీ పారిపోడని, పోలీసుల వద్దే అన్ని ఆధారాలు ఉన్నాయని, ఎక్కువ రోజులు జైలులో ఉంటే ఆరోగ్యం పాడవుతుందని వాదించినా సరే.. నేరం తీవ్రత ముందు ఆ వాదనలు ఏమీ ఫలించలేదు. పైరసీ వల్ల తెలుగు సినీ ఇండస్ట్రీకి సుమారు రూ.3,700 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేయడం , బెట్టింగ్ ముఠాలతో ఉన్న లింకులు ఈ కేసును మరింత సీరియస్ గా మార్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఐబొమ్మ రవి బెయిల్(Bail) నిరాకరించడం అనేది భవిష్యత్తులో పైరసీ చేసే వారికి ఒక పెద్ద హెచ్చరిక లాగా అయింది. ఎంతటి టెక్నాలజీ వాడినా, ఎంతటి అంతర్జాతీయ నెట్‌వర్క్ ఉన్నా సరే చట్టం ముందు లొంగక తప్పదని ఈ కేసు నిరూపించింది. ప్రస్తుతం రవి కస్టడీలో ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఇతర రాష్ట్రాల్లో కూడా రెయిడ్లు నిర్వహిస్తున్నారు. ఈ నేర శృంఖలాన్ని (Criminal Chain) పూర్తిగా ఛేదించే వరకు రవికి ఉపశమనం దొరికేలా కనిపించడం లేదు.
