Shivakumar
సినిమా అవార్డులంటే కేవలం ఒక ట్రోఫీ కాదు, ఒక గుర్తింపు. కానీ ఆ గుర్తింపు ఎప్పుడూ నిజంగా అర్హుడికే దక్కుతుందా అన్న ప్రశ్న మాత్రం చాలాసార్లు తలెత్తుతుంది. దీనికి పెద్ద ఉదాహరణే హారో సూర్య తండ్రి శివకుమార్ (Shivakumar)నటించిన మరుపక్కం సినిమా.
1990లో కె.ఎస్. సేతుమాధవన్ దర్శకత్వంలో వచ్చిన మరుపక్కం చిత్రం, జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం అవార్డు అందుకుంది. కథలోని లోతు, శివకుమార్(Shivakumar) చేసిన పాత్రలోని భావోద్వేగం అన్నీ కలిసి సినీ వర్గాలను ఆశ్చర్యపరిచాయి. అంతా ఒకే మాట అన్నారు .. ఈసారి జాతీయ ఉత్తమ నటుడు శివకుమార్‌కే అని. కానీ చివరికి ఆ అవార్డు అమితాబ్ బచ్చన్‌కి అగ్నిపథ్ సినిమా కోసం వెళ్లింది.
ఇక్కడే వ్యవస్థలోని విరుద్ధత బయటపడింది. కేంద్రం గుర్తించిన సినిమాకు రాష్ట్రం మాత్రం కనీస అవార్డు కూడా ఇవ్వలేదు. తమిళనాడు ప్రభుత్వం ఇచ్చే రాష్ట్ర అవార్డుల్లో మరుపక్కం కనిపించకపోవడం అభిమానులకు పెద్ద షాక్‌గా మారింది. ప్రశ్న ఒక్కటే .. కేంద్రం గుర్తించిన గొప్పతనం రాష్ట్రానికి ఎందుకు కనబడలేదు?
ఇది ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ (isolated incident) కాదు. ఇలాంటివి తెలుగు, తమిళం సహా అన్ని భాషల్లో పదే పదే జరుగుతూనే ఉన్నాయి. ఉదాహరణకి ..సితార (1984) జాతీయ స్థాయిలో మూడు అవార్డులు గెలిచింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవార్డుల్లో ఒక్కటీ దక్కలేదు.
దాసి (1988) ఐదు జాతీయ అవార్డులు గెలిచింది. అయినా ఒక్క నంది అవార్డు కూడా రాలేదు.జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలిచిన అర్చనకు రాష్ట్ర స్థాయిలో ఎలాంటి గుర్తింపు రాలేదు.ఇలాంటి ఉదాహరణలు చెప్పుకుంటూ వెళ్తే జాబితా పెద్దదవుతుంది.
ఈ విరుద్ధతలు ఎందుకు వస్తాయనే ప్రశ్నకు కొంతమంది లాబీయింగ్ అని అంటారు. కొందరు జ్యూరీ అభిరుచులు, రాజకీయ ప్రభావం అని చెబుతారు. ఇంకొందరు కేంద్రానికి ఒక దృష్టి, రాష్ట్రానికి మరో దృష్టి అని సరిపెట్టేస్తారు. కానీ ఏది నిజమో ఎవరికి తెలియదు. కమీటీ తీర్పులు ఎప్పుడూ ఒకేలా ఉండవు.
అసలు సమస్య ఏమిటంటే .. అవార్డు వ్యవస్థలో స్పష్టమైన ప్రమాణాలు లేకపోవడం. ఎవరి కంటికి ఏది నచ్చితే అది అవార్డు పొందుతుంది. ఆ కారణం వల్లే ఒక సినిమా కేంద్రంలో గొప్పదిగా గుర్తిస్తారు. కానీ అదే సినిమాను రాష్ట్రంలో కనీసం పట్టించుకోరు.
మరి అవార్డు రాకపోతే సినిమా విలువ తగ్గుతుందా? అసలు కాదంటారు సినీ క్రిటిక్స్. మిస్సమ్మ, మాయాబజార్, మల్లీశ్వరి లాంటి క్లాసిక్స్ ఎన్ని అవార్డులు గెలుచుకున్నాయి? పెద్దగా ఏమీ కాదు. కానీ ఇవి తరతరాలుగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచి ఉన్నాయి.
అందుకే చెప్పుకోవాల్సిన సత్యం ఒక్కటే ..అవార్డులు ప్రతిభకు తుది కొలమానం కావు. అవి కొన్ని సందర్భాల్లో గౌరవం ఇవ్వవచ్చు, కానీ ప్రతిభను ఎప్పటికీ అవి కొలవలేవు. శివకుమార్‌కి రాని జాతీయ అవార్డు, ఆయన కుమారుడు సూర్యకు రావడం ఒక ప్రతీకాత్మక సంఘటనే కానీ, అసలు ఆయన నటన విలువ మాత్రం ప్రేక్షకుల జ్ఞాపకాలలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది.