Mohanlal
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఈ సారి మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal) కు దక్కింది. సినీ పరిశ్రమకు చేసిన సేవలకు ఆయనకు ఈ పురస్కారం లభించింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ద్వారా వెల్లడించింది. 2023 ఏడాదికి గానూ మోహన్ లాల్ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకోనున్నారు. సెప్టెంబర్ 23న జరిగే జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో మోహన్ లాల్ కు ఈ పురస్కారం అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఆయనపై ప్రశంసలు కురిపించింది. నాలుగు దశాబ్దాలకు పైగా నటుడిగా విభిన్న పాత్రలలో అలరిస్తున్న మోహన్ లాల్ భారత చలనచిత్ర రంగంలో చెరిగిపోలేని ముద్రవేశారని కొనియాడింది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కేరళలోని పతనంతిట్ట లో జన్మించిన మోహన్ లాల్(Mohanlal) మలయాళ సినిమా రంగం లో అగ్రనటుడిగా కొనసాగుతున్నారు. దాదాపు 45 ఏళ్ల సుదీర్ఘ సినీ కెరీర్ లో మోహన్‌లాల్ 360కి పైగా సినిమాల్లో నటించారు. నాలుగు దశాబ్దాల సినీ కెరీర్ లో ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. కేవలం హీరోగానే కాకుండా కథ, పాత్ర నచ్చితే ఎటువంటి ఇగో లేకుండా నటిస్తారనే పేరుంది. ఈ కారణంగానే ఆయన నటించిన పాత్రలు కొన్ని చిన్నవే అయినా ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. టాలీవుడ్‌లో బాలకృష్ణ, రోజా నటించిన గాండీవం చిత్రంలోని ఒక పాటలో తొలిసారి అతిథి పాత్ర పోషించారు. కొన్నేళ్ళ క్రితం జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ లోనూ కీలక పాత్రలో ఆకట్టుకున్నారు.
కేవలం నటుడిగా మాత్రమే కాకుండా సింగర్ గానూ అలరించారు. అలాగే ప్రొడ్యూసర్, డైరెక్టర్, డిస్ట్రిబ్యూటర్ గానూ వ్యవహరించారు. మలయాళంలో సినిమాలను నిర్మించడంతో పాటు డైరెక్షన్ కూడా చేశారు.గాంధీనగర్ సెకండ్ స్ట్రీట్, అదివెరుకల్, ఉన్నికల్ ఒరు కాద పరయమ్ లాంటి సినిమాలను నిర్మించారు. ఆయన డైరెక్షన్ లో బారోజ్ అనే మూవీ వచ్చింది.
ఇక మోహన్ లాల్(Mohanlal) తన లేడీ ఫ్యాన్ నే ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు. సుచిత్ర అనే అమ్మాయి మోహన్ లాల్ ను ప్రేమించగా.. ఆయన కూడా ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. జాతకాలు కలవకపోవడం, పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోయినా మోహన్ లాన్, సుచిత్ర ఒక్కటయ్యారు.