Shivaji
సినిమా పరిశ్రమలో హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ(Shivaji) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా దండోరా ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ, ఆడవాళ్లు నిండుగా బట్టలు వేసుకుంటేనే వారికి గౌరవం ఉంటుందని, హీరోయిన్లు పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం ఒక దరిద్రమని వ్యాఖ్యానించారు.
ఆడవాళ్ల అందం కేవలం చీరల్లో, శరీరం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుందని, అప్పుడే వారికి నిజమైన మర్యాద దక్కుతుందని ఆయన చెప్పుకొచ్చారు. స్త్రీని ప్రకృతితో పోలుస్తూ, సావిత్రి , సౌందర్య వంటి మహానటులను ఉదాహరణగా చూపిస్తూ గ్లామర్ అనేది ఒక పరిమితి వరకు మాత్రమే ఉండాలని హితబోధ చేశారు. అయితే, ఈ సమయంలో ఆయన ‘దరిద్రపు ముండ’ వంటి అభ్యంతరకరమైన పదజాలాన్ని వాడటం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీసింది.
Telugu Actor Sivaji doles out unnecessary advice to Actresses using slurs like ‘Daridrapu Munda’ saying they need to wear Saris to cover their ‘Saamaan’ – a word incels use.
Actor Shivaji played a villain in a fantastic film and end up becoming the hero for incel boys.
The…
— Chinmayi Sripaada (@Chinmayi) December 23, 2025
శివాజీ(Shivaji) చేసిన ఈ వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. మగవారు జీన్స్, హూడీలు వంటి ఆధునిక దుస్తులు ధరించి తిరుగుతున్నప్పుడు, కేవలం హీరోయిన్లు మాత్రమే పద్ధతిగా ఉండాలని కోరడం ఏంటని ఆమె ప్రశ్నించారు. భారతీయ సంస్కృతిపై అంతగా ప్రేమ ఉంటే మగవారు కూడా ధోవతులు కట్టుకుని, బొట్టు పెట్టుకుని తిరగాలని ఆమె కౌంటర్ ఇచ్చారు.
కాగా సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ల మీద, ముఖ్యంగా వారి బట్టల మీద కామెంట్స్ చేయడం అనేది ఈరోజో నిన్నటో మొదలైనది కాదు. గతంలో సీనియర్ నటుడు చలపతి రావు అయితే ఒక అడుగు ముందుకు వేసి, ఆడవాళ్లు కేవలం పక్కలోకి మాత్రమే పనికొస్తారు అంటూ అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై నాగార్జున వంటి స్టార్ హీరోలు కూడా స్పందించి ఆయనను తప్పుబట్టారు. ఆ తర్వాత ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.
ఇక గాయకుడు యేసుదాస్ కూడా ఒకసారి బహిరంగ సభలో మాట్లాడుతూ మహిళలు జీన్స్ వేసుకోకూడదని, అది మన సంస్కృతి కాదని, అలా వేసుకుంటే ఎదుటివారికి చెడు ఆలోచనలు వస్తాయని మోరల్ పోలీసింగ్ చేశారు. దీనిపై అప్పట్లో చాలా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. నీతులు చెప్పే మగవారు వాళ్లకు నచ్చిన బట్టలు వేసుకున్నప్పుడు, ఆడవారికి మాత్రం ఆ స్వేచ్ఛ ఎందుకు ఉండకూడదని చాలామంది ప్రశ్నించారు.
అలీ కూడా చాలా సందర్భాల్లో హీరోయిన్ల బాడీ పార్ట్స్ మీద, ముఖ్యంగా వారి నడుము లేదా తొడల మీద డబుల్ మీనింగ్ డైలాగులు వేసి విమర్శలు పాలయ్యారు. సమంత, అనుష్క వంటి హీరోయిన్ల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతుంటాయి.
శివాజీ(Shivaji) విషయానికి వస్తే, ఆయన గతంలో రాజకీయాల మీద, ఏపీ ప్రత్యేక హోదా మీద ‘ఆపరేషన్ గరుడ’ లాంటి విశ్లేషణలతో ఎప్పుడూ వార్తల్లో ఉండేవారు. కానీ మహిళల విషయంలో ఇలాంటి పరుష పదజాలం వాడటం ఇదే మొదటిసారి.
ఈ వివాదంపై నెటిజన్లు కూడా రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు శివాజీ (Shivaji)మాటల్లోని ఉద్దేశం మంచిదే అని, అమ్మాయిలు పద్ధతిగా ఉంటేనే గౌరవం ఉంటుందని ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. మరికొందరు మాత్రం, మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని, ముఖ్యంగా వారిని ఉద్దేశించి అసభ్య పదజాలం వాడటం జుగుప్సాకరమని చిన్మయి వాదనను సమర్థిస్తున్నారు. ప్యాంట్లు, హూడీలు వంటివి శరీరం నిండుగా కప్పి ఉంచుతాయని, శివాజీ ఉద్దేశం కేవలం అసభ్యకరమైన పొట్టి దుస్తుల గురించేనని ఆయన మద్దతుదారులు వాదిస్తుండటంతో ఈ చర్చ సోషల్ మీడియాలో మరింత వేడెక్కింది.
