Shivaji
మహిళల వస్త్రధారణపై ఒక సెలబ్రెటీ చేసిన వ్యాఖ్యలు సమాజాన్ని ఎలా రెండుగా చీలుస్తాయో శివాజీ(Shivaji) ఉదంతం మరోసారి నిరూపించింది.ఈమధ్య ఒక సినిమా ఈవెంట్‌లో మహిళల డ్రెస్సింగ్ గురించి నటుడు శివాజీ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. చివరకు దీనిపై తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడంతో శివాజీ (Shivaji)వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వడంతో.. ఈ గొడవ ఇక్కడితో ముగిసినా, దీని వెనుక ఉన్న అసలైన ప్రశ్నలు మాత్రం అలాగే మిగిలిపోయాయి.
సమాజంలో మహిళల స్థానం, వారి స్వేచ్ఛపై దశాబ్దాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఒక సెలబ్రెటీ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పినపుడు అది సామాజికంగా ఎంత ప్రభావం చూపించిందో ఈ ఉదంతం నిరూపించింది. ముఖ్యంగా మోడ్రన్ దుస్తులు ధరించడం వల్లే దాడులు జరుగుతున్నాయన్న భావన వచ్చేలా మాట్లాడటం తీవ్ర విమర్శలకు దారితీసింది.
దీనిపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్పందించి నోటీసులు జారీ చేయడంతో, తాను మహిళల రక్షణ కోసమే అలా మాట్లాడానని ఆయన సమర్థించుకున్నా.. మహిళా కమిషన్ మాత్రం పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌లో మాట్లాడేటప్పుడు పదజాలం ఎంత జాగ్రత్తగా ఉండాలో స్పష్టం చేసింది.
ఈ వివాదంలో సినీ నటుడు, ఏపీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు .. శివాజీ(Shivaji)ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయకుండానే, సమాజంలో పేరుకుపోయిన పురుషాధిక్య ఆలోచనా ధోరణిని బాగానే ఎండగట్టారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వారి దుస్తులు కారణం కాదని, అది పురుషుల వికృత చేష్టల వల్లే అని గట్టిగా చెప్పారు.
కాగా తాను అన్న మాటల్లో ఏది తప్పు అనిపిస్తే దానికే సారీ అన్న శివాజీ(Shivaji) తాను మంచి చెప్పానని అన్నారు. మంచి చెప్పడం కూడా తప్పే అన్నట్లు.. నువ్వెంత నీ బతుకెంత అంటున్నారని ఆవేదన చెందారు. అన్నిటికి కాలం, కర్మ సమాధానం చెప్తుందన్న ఆయన..తన మీద కుట్ర చేయాల్సిన అవసరం లేదన్నారు.తనకు సినిమా ఛాన్సులు ఇవ్వకపోయినా పర్వాలేదని తనకు 30 ఎకరాల పొలం ఉంది కాబట్టి అక్కడకు వెళ్లి వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు
అయితే శివాజీ భావం మంచిదే అయినా అతను వాడిన లాంగ్వేజ్ చాలామందికి ఇబ్బందిగా అన్పించింది. ఏది ఏమయినా ఇది కేవలం ఒక సెలబ్రెటీ గొడవగా కాకుండా, ఆధునిక సమాజంలో స్త్రీ స్వేచ్ఛకు ఉన్న పరిమితులు, అపోహలపై ఒక పెద్ద విశ్లేషణకు దారితీసింది.
అసలు మహిళల వస్త్రధారణపై భారత రాజ్యాంగం ఏమంటుందో కూడా మరోసారి చర్చించాల్సిన అవసరం ఉంది. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా బతికే హక్కు ఉంటుంది. దీనిలో భాగంగానే వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఉంటుంది. మహిళల డ్రెస్ కోడ్ గురించి ప్రత్యేకంగా ఎలాంటి పరిమితులు లేదా చట్టాలు లేకపోయినా..ఈ సమాజంలో పరస్పర గౌరవం అనేది కనీస ధర్మం.
ఫెమినిస్టులు వాదిస్తున్నట్లుగా, ఒక మహిళ క్యారెక్టర్‌ను ఆమె వేసుకునే బట్టల ద్వారా అంచనా వేయడం మంచిది కాదు. ఇలాంటి బహిరంగ విమర్శలు మహిళలను మానసిక ఆందోళనకు గురిచేస్తూ.. సమాజంలో వారి పట్ల వివక్షను కూడా మరింత పెంచుతాయి. మహిళా కమిషన్ జోక్యంతో శివాజీ ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయనని హామీ ఇచ్చి ఈ రచ్చకు తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పెట్టినా, లోలోపల ఇలాంటి భావజాలం ఉన్న వ్యక్తులు ఇంకా చాలామందే ఉన్నారన్న విషయం ఈ 4 రోజుల నుంచీ చూస్తూనే ఉన్నాం.
వివాదాలు రావడం, వెళ్లడం సహజమే కానీ, ఇలాంటి చర్చల వల్ల అసలు సమస్య ఎప్పుడూ పక్కదారి పట్టకూడదు. మహిళల రక్షణ గురించి మాట్లాడేటప్పుడు వారిని నియంత్రించడం కంటే, వారికి సమాజంలో భద్రమైన వాతావరణాన్ని కల్పించడంపైన దృష్టి పెట్టాలి.
బహిరంగ వేదికలపై సెలబ్రెటీలు చేసే కామెంట్లు లక్షలాది మందిపై ప్రభావం చూపిస్తాయి కాబట్టి, వారు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అవతలివారి స్వేచ్ఛను గౌరవించడం, ఆత్మగౌరవాన్ని కాపాడటం అనేది మన సంస్కారానికి నిదర్శనం.
ఒక వ్యక్తి చేసిన కామెంట్లు సమాజాన్ని రెండు వర్గాలుగా చీల్చిన ఈ ఉదంతం, చివరికి మహిళల పట్ల ప్రతి ఒక్కరూ హుందాగా ప్రవర్తించాలన్న సందేశంతో క్లోజ్ అవడం మంచి పరిణామం. ఇకపై ఇలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండాలంటే, అది మనుషుల ఆలోచనా విధానంలో వచ్చే మార్పుతోనే సాధ్యమవుతుంది. లేదంటే సమాజంలో ఈ చర్చ మాత్రం నిరంతరం సాగుతూనే ఉంటుంది.
