OTT
సినిమా థియేటర్లకు వెళ్లలేని వారికి, ఇంట్లోనే కూర్చుని ప్రశాంతంగా సినిమా చూడాలనుకునే వారికి ఓటీటీ(OTT) వేదికలు ఇప్పుడు ప్రధాన వినోద సాధనాలుగా మారాయి. ప్రతి వారం లాగే, ఈ డిసెంబర్ చివరి వారంలో కూడా ప్రేక్షకులను అలరించడానికి సరికొత్త సినిమాలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా ఈ వారం ఇద్దరు స్టార్ హీరో, హీరోయిన్ల సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి.
కీర్తి సురేష్ రివాల్వర్ రీటా.. నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ రివాల్వర్ రీటా. థియేటర్లలో విడుదలైనప్పుడు మంచి స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. ఒక సాధారణ అమ్మాయి తన జీవితంలో ఎదురైన ఊహించని పరిస్థితుల వల్ల తుపాకీ పట్టాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది.
రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా.. ఉస్తాద్ రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. సాధారణంగా మనం సెలబ్రిటీల బయోపిక్ లు చూస్తుంటాం, కానీ ఒక హీరోకి ఉన్న వీరాభిమాని బయోపిక్ గా ఈ సినిమాను ప్రచారం చేశారు. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా.. రామ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు ఈ చిత్రం కూడా నెట్‌ఫ్లిక్స్ లోనే ఈ గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. వీటితో పాటు మదం అనే రా అండ్ రస్టిక్ మూవీ , పలు క్రిస్మస్ స్పెషల్ సినిమాలు ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్నాయి.
