Lava Kusa: రూ. 1 కోటి మార్క్ అందుకున్న తొలి చిత్రం..తెలుగు ప్రజల మనసుల్లో నిలిచిపోయిన సజీవ కావ్యం

Lava Kusa: తెలుగు ప్రజల మనసుల్లో ఒక భావోద్వేగాన్ని, భక్తిని నింపి, తెలుగు చిత్రసీమ గతిని మార్చిన ఒక అరుదైన అద్భుతం

Lava Kusa

తెలుగు సినిమా చరిత్రలో కొన్ని చిత్రాలు కేవలం రికార్డులను మాత్రమే కాదు, ప్రజల మనసులను కూడా గెలుచుకుంటాయి. అలాంటి వాటిలో అగ్రస్థానంలో నిలిచే సినిమా ‘లవకుశ’. నందమూరి తారకరామారావు గారు నటించిన ఈ చిత్రం ఒక అద్భుతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభా మూడు కోట్లు ఉన్న రోజుల్లోనే ఇది కోటి రూపాయల వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది.

అంతేకాకుండా, తెలుగులో తొలిసారిగా 500 రోజులు ఆడిన సినిమాగా లవకుశ (Lava Kusa) రికార్డు నెలకొల్పింది. అంతకుముందు ఈ రికార్డు ఎన్టీఆర్ నటించిన ‘పాతాళ భైరవి’ పేరిట ఉండేది, అది 245 రోజులు ఆడింది. ఈ సినిమా కేవలం తెలుగులోనే కాదు, తమిళ వెర్షన్‌లో కూడా సూపర్ హిట్‌గా నిలిచి మధురైలో 40 వారాలు ఆడింది. హిందీలోకి డబ్ చేసినప్పుడు కూడా 27 వారాలు ఆడి ఘన విజయం సాధించింది. ఒకే హీరో రెండు చిత్రాలు (‘పాతాళ భైరవి’, ‘లవకుశ(Lava Kusa)’) మూడు భాషల్లో ఘన విజయం సాధించడం ఎన్టీఆర్‌కు మాత్రమే దక్కిన అరుదైన ఘనత.

lava kusa-pathalabhairavi-NTR

ఈ సినిమా నిర్మాణంలో నిర్మాత అల్లారెడ్డి శంకరరెడ్డి గారు చూపించిన పట్టుదల ప్రశంసనీయం. దాదాపు 59 సంవత్సరాల క్రితమే భారీ మల్టీ-స్టారర్ చిత్రాలు, మల్టీ-హీరో ప్రాజెక్టులు నిర్మించి చూపించిన ఘనుడాయన. తెలుగులో తొలి కలర్ సినిమా తనే నిర్మించాలన్న ఆయన కోరికతో ఈ సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. ఆ సమయంలో ఈస్ట్‌మన్ కలర్ ఫిల్మ్‌లు అందుబాటులో లేకపోయినా, ఎన్నో ఆర్థిక ఇబ్బందులను, ఐదేళ్ల కష్టాన్ని ఎదురొడ్డి ఈ సినిమాను పూర్తి చేశారు.

lava kusa

ఈ చిత్రంలో రాముడిగా ఎన్టీఆర్, సీతగా అంజలీదేవి, వాల్మీకిగా నాగయ్య, లక్ష్మణుడిగా కాంతారావు, భరతుడిగా సత్యనారాయణ, శతృఘ్నుడిగా శోభన్ బాబు, లవకుశులుగా బాల నటులు నాగరాజు, సుబ్రమణియం వంటి దిగ్గజాలు నటించారు. ఈ సినిమా నిడివి 3 గంటల 50 నిమిషాలు కాగా, ఇందులో దాదాపు గంట 45 నిమిషాల పాటు ఘంటసాల గానం చేసిన 36 పాటలు, పద్యాలు ప్రేక్షకులకు కనువిందు చేశాయి. దర్శకులు సి.పుల్లయ్య, సి.ఎస్.రావు తండ్రీ కొడుకులు ఉత్తర రామాయణంతో పాటు పూర్వ రామాయణాన్ని కూడా చూపిస్తూ కథను అద్భుతంగా మలిచారు.

లవకుశ సినిమా విడుదలై ఏ ప్రాంతంలోనైనా రికార్డులు సృష్టించింది. 62 కేంద్రాల్లో 100 రోజులు, 18 కేంద్రాల్లో 25 వారాలు ఆడింది. 75 వారాలు ఆడి వజ్రోత్సవం జరుపుకున్న ఖ్యాతి కూడా ఈ చిత్రానికే దక్కింది. ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి జనం బండ్లు కట్టుకొని వచ్చి ఈ సినిమా చూసేవారు.

హైదరాబాద్‌లోని నటరాజ్ థియేటర్‌లో సినిమా చూసేందుకు అమీర్‌పేట నుంచి రిక్షాలు కట్టుకొని వచ్చేవారంటే ఈ సినిమాకు ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ప్రజలు రాముడు అంటే రామారావే, సీత అంటే అంజలీదేవే అని నమ్మేవారు. తమ పూజా మందిరాల్లో ఎన్టీఆర్ ఫోటోలు పెట్టుకున్నారు. అంజలీదేవి ఎక్కడ కనబడితే అక్కడ ఆమె పాదాలకు నమస్కరించేవారు. ఈ సినిమా ద్వారా నటీనటులకు దక్కిన గౌరవం మరే ఇతర నటులకు దక్కలేదని చెప్పవచ్చు.

59 ఏళ్ల తర్వాత ఇదే సినిమాను బాలకృష్ణ నటించిన ‘శ్రీరామరాజ్యం’ పేరుతో తీసి, ఉత్తమ చిత్రంగా నంది అవార్డును కూడా గెలుచుకుంది. ఈ సినిమా కేవలం ఒక కథను చెప్పడమే కాకుండా, తెలుగు ప్రజల మనసుల్లో ఒక భావోద్వేగాన్ని, భక్తిని నింపి, తెలుగు చిత్రసీమ గతిని మార్చిన ఒక అరుదైన అద్భుతం అని చెప్పాలి.

 

Exit mobile version