Team India
భారత క్రికెట్ జట్టు(Team India) డ్రెస్సింగ్ రూమ్ లో ఆల్ ఈజ్ నాట్ వెల్ వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో హెడ్ కోచ్ గంభీర్ కు పడడం లేదన్న వార్తలు విపరీతంగా వస్తున్నాయి. దీనికి తగ్గట్టే జరుగుతున్ కొన్ని సంఘటనలు, వినిపిస్తున్న మాటలు ఆ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. నిజానికి రోకో జోడీ టెస్ట్ ఫార్మాట్ రిటైర్మెంట్ కు కారణం గంభీరే అన్నది వారి అభిమానులు బలంగా నమ్ముతున్న మాట.
ఇప్పుడు వన్డే జట్టు (Team India)నుంచి కూడా రోహిత్ , కోహ్లీలను సాగనంపే పనిలో గంభీర్ బిజీగా ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే తరచుగా గంభీర్ చేస్తున్న వ్యాఖ్యలే ఈ అనుమానాలకు మరింత బలాన్నిస్తున్నాయి. తాజాగా వచ్చే 2027 వన్డే ప్రపంచకప్ లో రోకో జోడీకి ప్లేస్ ఉందా అన్న ప్రశ్నకు గంభీర్ ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు. ఆస్ట్రేలియా టూర్ దగ్గర నుంచీ వీరిద్దరూ అద్భుతంగా రాణిస్తున్నా గంభీర్ మాత్రం వారి ప్రదర్శనను పెద్దగా లెక్క చేయడం లేదన్నది తెలుస్తోంది.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత గంభీర్ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. ఆసీస్ టూర్ లో దుమ్మురేపిన కోహ్లీ, రోహిత్ తాజాగా సౌతాఫ్రికాపైనా అదరగొట్టారు. ఇప్పటి వరకూ జరిగిన రెండు సిరీస్ లలో కోహ్లీ 107 పైగా స్ట్రైక్ రేట్ తో 376 రన్స్ చేశాడు. దీనిలో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలున్నాయి. రోహిత్ కూడా మూడు అర్థసెంచరీలు, ఒక సెంచరీతో 348 పరుగులు చేశాడు. దీంతో వీరిద్దరూ ఖచ్చితంగా ప్రపంచకప్ వరకూ ఆడే సత్తా ఉన్న ఆటగాళ్లేనని అందరికీ అర్థమైంది.
కానీ హెడ్ కోచ్ గంభీర్ మాత్రం యువ ఆటగాళ్లపై ఫోకస్ పెట్టాడు. రోహిత్ , కోహ్లీ ప్రపంచస్థాయి ఆటగాళ్ళని, వారి అనుభవం జట్టుకు ఖచ్చితంగా కావాలంటూ ప్రశంసిస్తూనే ప్రపంచకప్ లో వారిద్దరూ ఆడడంపై అప్పుడే చెప్పలేమన్నాడు. మెగాటోర్నీకి ఇంకా చాలా సమయముందంటూ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో యువ ఆటగాళ్ళు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు. యువ క్రికెటర్లకు ఎక్కువ ఛాన్సులు ఇవాల్సిన బాధ్యత తనపైనే ఉంటుందన్నాడు. దీంతో గంభీర్ చేసిన కామెంట్స్ రోహిత్, కోహ్లీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అతను రోకో జోడీని తప్పించే ప్రయత్నంలోనే ఉన్నాడంటూ మండిపడుతున్నారు.
