ED : ఒక యాడ్..కోట్ల డీల్ ..ఈడీ ముందు విజయ్‌దేవరకొండ

ED: ఇంతకాలం స్క్రీన్‌పై హీరోలుగా కనిపించినవాళ్లు… ఇప్పుడు ఈడీ ప్రశ్నల ముందు నిలబడుతున్నారు. మనీ లాండరింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రకటనలతో కోట్ల డీల్‌ల మధ్య తిరిగిన కథ..

ED

ఇంతకాలం స్క్రీన్‌పై హీరోలుగా కనిపించినవాళ్లు… ఇప్పుడు ఈడీ ప్రశ్నల ముందు నిలబడుతున్నారు. మనీ లాండరింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రకటనలతో కోట్ల డీల్‌ల మధ్య తిరిగిన కథ.. ఇప్పుడు వరుస విచారణలతో బిజీబిజీగా మారింది. స్టార్ ఇమేజ్, సోషల్ మీడియా ఫాలోయింగ్‌తో కోట్లాదిమందికి చేరిన వీరి స్టోరీ… ఇప్పుడు నేర చరిత్రల దాకా వెళ్తుందా అనే అనుమానాలను కలిగిస్తోంది.

ఈడీ(ED) విచారణలో తాజాగా విచారణకు హాజరైన వ్యక్తి నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో ఈ ఉదయం ఆయనను అధికారులు ప్రశ్నించారు. ఆరోపణల ప్రకారం, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు విజయ్ ప్రచారం చేశాడని, ఇందుకు భారీ పారితోషికం తీసుకున్నాడని సమాచారం. ఆయన నుంచి ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలు మాత్రం స్పష్టంగా మనీలాండరింగ్ కోణంలోకి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ మాత్రమే కాదు… ఈడీ (ED) లిస్టులో మరో 28 మంది ఉన్నారు. అందులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, ఇతర సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌ను ఈడీ విచారించింది. రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి లాంటి ప్రముఖులకూ నోటీసులు వెళ్లాయి. వారందరూ కూడా వేర్వేరు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసినట్లు ఈడీ అనుమానిస్తోంది.

ED

ఈ విచారణకు గల కారణాలు మాత్రం తీవ్రంగానే ఉన్నాయి. కొంతకాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌(online betting apps scam)ల వల్ల యువత తీవ్రంగా బలవుతున్నారన్న ఫిర్యాదులు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ యాప్‌లు చట్టవిరుద్ధమని న్యాయపరంగా స్పష్టత ఉన్నా, సెలబ్రిటీలు వాటికి ప్రమోషన్ చేయడం వల్ల వాటికి బలపడే వారి సంఖ్య పెరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనినిబట్టి కొన్ని రాష్ట్రాల పోలీసులు కేసులు నమోదు చేయగా, ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది.

సెలబ్రిటీలు తీసుకున్న డబ్బు లావాదేవీలు ఎక్కడ జరిగాయి? ఆ డబ్బు చట్టబద్ధంగా వచ్చిందా?ఎలాంటి ఒప్పందాలపై ప్రమోషన్ చేశారు? యాప్ యాజమాన్యంతో వారి సంబంధం ఎంత వరకు ఉంది? ఇలా ప్రస్తుతం విచారణలో తేలాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి.

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ విచారణలో తేలనుంది. అయితే మరింత ఆసక్తికర విషయం ఏంటంటే… ఈ ప్రచారాలు చేసినంత మాత్రాన నేరమా? లేక యాప్‌లు చట్టబద్ధంగా లేవనే అంశంపై స్పష్టత లేకపోవడమా? అనే చర్చ ఇప్పుడు న్యాయవర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ జరుగుతోంది.

సెలబ్రిటీలకు ఫాలోయింగ్ ఉంటుంది. వారి మాటకు బలం ఉంటుంది. అదే బలాన్ని తమ యాప్‌లకు వాడుకోవాలనే వ్యూహంతో బెట్టింగ్ యాప్ యాజమాన్యాలు సెలబ్రిటీలను ఎంచుకున్నాయన్నది ఓ కోణం. కానీ ఇప్పుడు విచారణ వెలుగులోకి వస్తే, దాని వాస్తవ స్వరూపం ఏంటో తెలుస్తుంది. అసలు ప్రమోషన్‌ల పేరుతో తీసుకున్న డబ్బు.. నేరారోపణల దారిగా మారుతుందా అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఉలిక్కిపడేలా చేస్తున్న ప్రశ్న.

ఈ విచారణ మరింత లోతుగా సాగుతుంది. అందులో ఇంకా ఎన్నో పేర్లు బయటపడే అవకాశం ఉంది. ఈడీ అధికారుల దృష్టి ఇప్పుడు డబ్బు ఏ దారిలో ప్రవహించింది? ఎవరు ఎంత తీసుకున్నారు? ఎవరి ప్రమోషన్ ఎలా మలిచింది? అనే విషయాలపై ఉంది. దీంతో టాలీవుడ్‌లోనూ, డిజిటల్ మీడియా సర్కిల్‌లోనూ టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది.

ఓ పక్క ఫేమ్ కోసం, మరోపక్క డబ్బు కోసం చేసిన ప్రమోషన్… ఇప్పుడు చట్టం ముందు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నగా మారడం చాలా మంది సెలబ్రెటీలకు గుణపాఠంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

 

Exit mobile version