Kingdom :ఈ కింగ్డమ్ ఒక ఇద్దరు అన్నదమ్ముల ప్రేమ కథ !
Kingdom : రెండు కథలు సూక్ష్మం గా పరిశీలిస్తే ఒకటే.. ఒక బైరాగి భవిష్యవాణి చదువుతూ ఉంటాడు.. మిగతా నటులంతా కొన్ని సంవత్సరాలపాటు తమని కాపాడే కథానాయకుడు కోసం సముద్రం ఒడ్డున కూర్చుని ఎదురు చూస్తూ ఉంటారు.

Kingdom : అరిగిపోయిన సినిమా కథలు కూడా పెద్ద హిట్ అవ్వడం చూస్తూనే ఉంటాము. రాజమౌళి సినిమా కథలన్నీ ఒకటే అని ఆయన సినిమా విడుదల అయిన ప్రతిసారీ అనిపిస్తూనే ఉంటుంది. ఒక తెగ ప్రజలు బాధలు పడుతూ ఉంటారు. వాళ్ల దరిద్రాలు పరాకాష్టకు చేరిన తర్వాత ఒక హీరో అక్కడకు వాళ్ల కష్టాలు తీర్చడానికి వెళ్తాడు. అక్కడకు వెళ్లి ముందు అతని అతి సామాన్యుడిగా ఉంటాడు.
Kingdom
కథానాయకుడిగా అతనిని ఆ పనికి సెలెక్ట్ చేసే క్రమం కూడా చాలా నాటకీయంగా ఉంటుంది. మొత్తానికి హీరో అక్కడకు వెళ్తాడు విలన్ సామ్రాజ్యాన్ని కూలగొట్టి గొప్ప హీరోయిక్ గర్వంతో సినిమా ముగిస్తాడు. ఇదే రాజమౌళి తీసిన అన్ని సినిమాల కథల సారాంశం. ఇప్పుడు కింగ్డమ్ డైరెక్టర్ గౌతం తిన్ననూరి(Gowtham Thinnanuri), కొద్ది రోజులు ముందు దేవర దర్శకుడు కొరటాల శివ (Koratala Shiva)కి కూడా ఇదే సేఫ్ కథ అని భావించారు. అందులో భాగంగా రెండు భారీ సినిమాలు నిర్మించారు అవి ఒకటి దేవర అయితే.. రెండోది కింగ్డమ్.
అదేం పోలిక అని మీకు సందేహం రావొచ్చు కానీ రెండు కథలు సూక్ష్మం గా పరిశీలిస్తే ఒకటే.. ఒక బైరాగి భవిష్యవాణి చదువుతూ ఉంటాడు.. మిగతా నటులంతా కొన్ని సంవత్సరాలపాటు తమని కాపాడే కథానాయకుడు కోసం సముద్రం ఒడ్డున కూర్చుని ఎదురు చూస్తూ ఉంటారు. మధ్య మధ్యలో బోర్ కొట్టకుండా రక్తపాతం జరుగుతూనే ఉంటుంది. సముద్రం కూడా ఎరుపెక్కింది అనిపించే ఎఫెక్ట్ కోసం బాగా కష్టపడుతూ ఉంటారు.
తెలుగు సినిమా దర్శకులలో గౌతంకి ఒక ప్రత్యేక స్థానం ఉంది అందుకు ఆయన తీసిన మళ్లీ రావా, జెర్సీ అనే సినిమాలు ఒక కారణం . మధ్యతరగతి మనుషులు వాళ్ల మానవ సంబంధాలు వాటి మధ్యలో రగిలే భావోద్వేగాలు అద్భుతంగా తెరకెక్కించాడు అని భావించిన దర్శకుడు ఆయన. ఆయన కూడా పాన్ ఇండియా మోజులో సినిమాలలో హంగులు ఆర్భాటాలు ముఖ్యం అని భావించడంలో పెద్ద తప్పు లేదు కాబోలు.
బాహుబలి సినిమా వచ్చి ఎంత మంచి చేసిందో తెలీదు కానీ చాలా మంది దర్శకులు, ప్రొడ్యూసర్స్ ఆలోచనా సరళిని పక్కదోవ పట్టించే చెడు చేసింది అని మనకు అర్ధం అవుతుంది. 30 కోట్లతో అద్భుతంగా తీసే దర్శకులు వందల కోట్లు గుమ్మరించి ఒక ఆర్టిఫీషియల్ అంగడి బొమ్మను తయారు చేస్తున్నారు. ఆ ప్రమాదంలో పడ్డారు అనిపిస్తుంది.
కింగ్డమ్ సినిమా విషయానికి వస్తే విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) , సత్యదేవ్ , వెంకటేష్ వీ.పీ నటన అద్భుతంగా ఉంది. మలయాళి సినీరంగం నుంచి మళ్లీ ఒక వజ్రం లాంటి నటుడు వెంకటేష్ ప్రతినాయకుడి పాత్రలో అందరినీ డామినేట్ చేశాడు అని చెప్పాలి. విజయ్‌కు చాలా రోజులుగా హిట్స్ లేవు కాస్త ఈ సినిమాతో ఆ లోటు తీరిందని చెప్పాలి. సత్యదేవ్‌కు మంచి ఫుల్ లెంగ్త్ రోల్ దొరికింది. దర్శకత్వ ప్రతిభ , సినిమాటోగ్రఫీ బాగున్నా కథలో జరగాల్సిన మార్పు, మలుపులు సరిగా జరగలేదు. కథలో ఒక వర్గం వారి అంత ఇబ్బందికి కారణాలు నమ్మశక్యంగా లేవు.
హీరోయిన్ కథలోకి ఎప్పుడూ చొచ్చుకురాలేక పోవటంతో పాటుగా.. రెండో భాగం కథ గాల్లో తేలాడుతూ ఉన్నట్లు అనిపించడం ఒక లోపంగా చెప్పాలి. కేవలం విజయ్ దేవరకొండ లాంటి అద్భుతమైన నటుడు ఈ సినిమాని తన భుజాన వేసుకుని క్లైమాక్స్ లో పడవను లాగడానికి ఎలా కష్టపడ్డాడో సినిమాని కూడా అలానే లాగి కష్టపడ్డాడు. దర్శకుడు దేవర సినిమా ఎక్కువగా చూసైనా , లేదా అసలు చూడకుండా అయినా ఈ సినిమా తీసి ఉండాలి అనిపించింది.
తన బలం అంతా భావోద్వేగాలను తెరమీద చూపించగలగటం అని తెలిసినా దర్శకుడు కొన్ని చోట్ల కథనంలో చాలా తప్పులు చేశాడు. కథను నడిపించడంలో ఎక్కడో బిగుతుగా వెళ్లలేక పోయాడు అనిపిస్తూ ఉంటుంది. ఊహించే క్లైమాక్స్‌తో పాటు అసలు అన్ని రోజులు పడవను సముద్రంలోకి లాగటం మర్చిపోయారా ఆ బాధితులంతా అన్నట్లు కాస్త నమ్మశక్యం కాని రీతిలో సినిమా ముగుస్తుంది.

కాపాడే ఒక వ్యక్తి రావడం అతనిని కాలమే నడిపించడం.. ఆఖరికి దేవరకొండ డిప్ప కటింగ్ తలమీద కిరీటం పెట్టడం కొంచెం సినిమా మన ఆలోచన స్థాయిని దాటి ఎటో వెళ్లిపోయింది అనిపిస్తూ ఉంటుంది. ఒక సినిమా తీసే ముందు ఆ సినిమా కథాంశం లో మూలమైన సమస్య కనీసం తెలుగు వారికి తెలిసేది గానూ, లేదా అర్థమయ్యేది గానూ ఉంటే బాగుండేది. శ్రీకాకుళానికి శ్రీలంకకు కనెక్షన్ ఎక్కడో వికటించింది అని స్పష్టం అయ్యింది.
అసలు వారు ఎందుకు బాధితులు, ఎవరివల్ల బాధితులు అది కూడా అర్ధం కాదు కొన్నిసార్లు. ఏది ఏమైనా సినిమా ఒకసారి చూడటానికి అయితే వెళ్లొచ్చు. అనిరుద్ సంగీతం అలరించకపోయినా నేపథ్య సంగీతం మాత్రం పర్వాలేదు అనిపించింది. మొత్తానికి కింగ్డమ్ ఒక పులిని చూసి వాతలు పెట్టుకున్న నక్క లాంటి పాన్ ఇండియా సినిమా !
నా రేటింగ్ 3/5 అని మాత్రం చెప్తాను
.. క్రాంతి
A different style of review.. Good interpretation..