Donald Trump
వెనిజులా అధ్యక్షుడిని బందీగా పట్టుకుని ఆ దేశాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్న అమెరికా ఇప్పుడు తర్వాతి లక్ష్యాలకు రెడీ అయిపోయింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇప్పటికే ఆయా దేశాల గురించి హింట్ కూడా ఇచ్చేశారు.
మిగిలిన ప్రపంచ దేశాలకు హింట్ ఇవ్వడమే కాదు తాను తర్వాత టార్గెట్ చేయబోతున్న దేశాల అధినేతలకు వార్నింగ్ కూడా గట్టిగానే ఇచ్చారు. ట్రంప్ హిట్ లిస్టులో కొలంబియా, మెక్సికో, క్యూబా, గ్రీన్‌లాండ్ ఉన్నాయి.ఈ జాబితా చూస్తే అగ్రరాజ్యం అధినేత ట్రంప్ (Donald Trump) ఆక్రమణల పర్వం లాటిన్ అమెరికాలో పెను దుమారం రేపబోతోంది.
ఈ జాబితాలో కొలంబియా, మెక్సీకో ముందు వరుసలో ఉన్నాయి. ఈ దాడులు చేసేందుకు ట్రంప్ చెబుతున్న కారణం అక్కడ పెద్దఎత్తున డ్రగ్స్ తయారవుతుండడం.. కానీ అసలు సంగతి మాత్రం వేరే ఉందంటున్నారు బాధిత దేశాధినేతలు, ఇతర రాజకీయ పార్టీ నేతలు.. వారు చెప్పినదాని ప్రకారం లాటిన్ అమెరికాలోని ఆయాదేశాల్లో దాగి ఉన్న అరుదైన ఖనిజ సంపదలను సొంతం చేసుకోవడమే లక్ష్యంగా ట్రంప్ ఈ చర్యలకు దిగుతున్నట్టు అర్థమవుతోంది.
ఈ దేశాల్లో డ్రగ్స్ తయారీ, రవాణా వంటి అంశాలు ట్రంప్ కు అస్త్రాలుగా మారాయి. తాజాగా ట్రంప్ మెక్సికోను ఉద్దేశించి చేసిన కామెంట్స్ చూస్తే దీనిపై క్లారిటీ వస్తోంది. మెక్సికో విషయంలో కూడా ఏదో ఒకటి చేస్తామంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బాం మంచి వ్యక్తే అయినా సరే దేశాన్నిపాలించడం లేదన్నారు. మెక్సికోను డ్రగ్ ముఠాలే నడుపుతున్నాయని ఆరోపిస్తూ ఆక్రమణ సంకేతాలిచ్చాడు.
అదే సమయంలో గ్రీన్‌లాండ్ టార్గెట్‌గా ట్రంప్ (Donald Trump )డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ భార్య, మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ కేటీ మిల్లర్ ఒక పోస్ట్ చేసింది .గ్రీన్ లాండ్ భూభాగాన్ని అమెరికా జెండాతో కప్పేసిన మ్యాప్‌ను షేర్ చేయడం కలకలం రేపింది. ఆ పోస్టుకు త్వరలో అనే క్యాప్షన్ కూడా ఇవ్వడంతో తర్వాతి టార్గెట్ అదేనని భావిస్తున్నారు.
ఇక అమెరికా భద్రత కోసం గ్రీన్‌లాండ్ కావాల్సిందే అంటూ ట్రంప్ చేసిన ప్రకటనతో అందరికీ విషయం అర్థమైపోయింది. పైకి డ్రగ్స్, అమెరికా భద్రత అంటూ చెబుతున్నా అసలు టార్గెట్ మాత్రం యురేనియం, ఐరన్ నిక్షేపాలను సొంతం చేసుకునేందుకే అన్న ప్రచారం వినిపిస్తోంది. అలాగే బంగారం, బొగ్గు, చమురు నిల్వలకు కొలంబియా చిరునామాగా చెబుతారు. అటు వెండి ఉత్పత్తి చేసే మెక్సికోతోనే ట్రంప్ తన తర్వాతి ప్లాన్ ను ప్రారంభించే అవకాశముందని భావిస్తున్నారు.
