Potato
ప్రపంచంలో కళకు, సృజనాత్మకతకు వెలకట్టలేం. అలా ఒక సాధారణ ఆలుగడ్డ (Potato) ఫోటోను ఏకంగా రూ.9 కోట్లకు (1 మిలియన్ యూరోలు) కొనుగోలు చేశారంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ విచిత్రమైన సంఘటన ప్రపంచ ఆర్ట్ మార్కెట్‌లో ఒక సంచలనం సృష్టించింది. అసలు ఆ ఫోటోలో అంత ప్రత్యేకత ఏముంది? ఎందుకు దానిని అంత భారీ ధరకు కొన్నారంటూ నెట్టింట చర్చ సాగుతోంది.
ఈ అద్భుతమైన ఫోటోను ఐరిష్ ఫోటోగ్రాఫర్ కెవిన్ అబోష్ 2010లో డబ్లిన్‌లో తీశారు. బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్‌పై ఒక సాదా ఆలుగడ్డను నిలబెట్టి తీసిన ఈ ఫోటోకు ఆయన “Potato #345” అని పేరు పెట్టారు. ఇది చూసేందుకు చాలా సింపుల్‌గా ఉన్నా కూడా, దాని వెనుక ఒక లోతైన అర్థం దాగి ఉందని కెవిన్ అబోష్ చెబుతారు.
Bigg Boss: బిగ్ బాస్ అసలైన అగ్ని పరీక్ష మొదలయిందా?
కెవిన్ అబోష్ తన కెమెరాతో సిలికాన్ వ్యాలీలోని ప్రముఖులు, అలాగే జానీ డెప్, మలాలా యూసఫ్‌జాయ్ వంటి సెలబ్రిటీల ఫోటోలు తీయడంలో ప్రసిద్ధి పొందారు. ఆలుగడ్డలు కూడా మనుషుల్లాగే ఉంటాయి. అవి చూడటానికి ఒకేలా కనిపించినా, ప్రతి ఆలుగడ్డ(Potato)కు ఒక ప్రత్యేకమైన రూపు ఉంటుంది. జీవితంలో మనం ఎదుర్కొనే బాధలు, ఒడిదుడుకులను కూడా ఈ ఆలుగడ్డ ప్రతిబింబిస్తుందని ఆయన వివరించారు. ఈ ఫోటోలో ఆలుగడ్డ సాదాసీదాగా ఉన్నా, దానిని కళా రూపంగా చూపించడం కెవిన్ సృజనాత్మకతకు నిదర్శనం.
2016లో కెవిన్ తన స్టూడియోలో ఉన్నప్పుడు ఒక యూరోపియన్ బిజినెస్‌మ్యాన్ దానిని చూసి, దాని విలువ తెలుసుకున్న వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా, 1 మిలియన్ యూరోలు దాదాపు 1.08 మిలియన్ డాలర్లు చెల్లించి కొనుగోలు చేశారు. ప్రపంచంలో అత్యధిక ధరలకు అమ్ముడుపోయిన ఫోటోలలో ఇది కూడా ఒకటిగా నిలిచింది.
సాధారణంగా కళాఖండాలకు వాటి విలువ, వాటిలోని భావాన్ని బట్టి వస్తుంది. ఈ ఫోటోలో ఒక సాధారణ వస్తువును తీసుకొని, దానికి కళాత్మక రూపం ఇవ్వడం, మానవ జీవితానికి దానిని పోల్చడం వంటి అంశాలు దీనికి ఇంత విలువను తెచ్చిపెట్టాయి. అలాగే, అంతర్జాతీయంగా కెవిన్ అబోష్‌కు ఉన్న పేరు, ఇతర ప్రముఖుల ఫోటోలు తీసిన విధానం కూడా ఈ ఫోటో విలువను పెంచింది.
గతంలో కూడా, 2011లో ఆంధ్రియాస్ గర్స్కీ తీసిన “Rhein II” అనే ఫోటో 4.3 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. ఈ సంఘటనలు కళా ప్రపంచంలో కేవలం ఒక ఫోటోకు ఎంత విలువ ఉంటుందో, అది ఎంత లోతైన భావాన్ని వ్యక్తీకరించగలదో తెలియజేస్తున్నాయి. ఇది కేవలం కళాకారుల ప్రతిభకు మాత్రమే కాదు, సాధారణ విషయాలను కూడా అసాధారణంగా చూడగలిగే వారి దృష్టికి కూడా విలువనిస్తోంది.