Thailand
థాయ్‌లాండ్(Thailand)-కంబోడియా మళ్ళీ ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇటీవలే ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపానంటూ ట్రంప్ ప్రకటించినా సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం ఏ మాత్రం తగ్గలేదు. కంబోడియా దళాలు సోమవారం తెల్లవారుజామున కాల్పులు జరపగా… ఓ థాయ్ సైనికుడు మృతి చెందాడు. మరో నలుగురు సైనికులు కూడా గాయపడినట్టు తెలుస్తోంది. దీంతో థాయ్ లాండ్(Thailand) ప్రతీకార దాడులకు దిగింది. కంబోడియా పోస్టులు, ఆయుధ డిపోలే టార్గెట్ గా బాంబుల వర్షం కురిపించింది.
కంబోడియా సైనికులే దాడులు చేయడంతో తాము ప్రతీకార దాడులకు దిగినట్టు థాయ్ సైనిక వర్గాలు వెల్లడించాయి. అయితే థాయ్ దళాల వాదనను కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. ముందుగా థాయ్ దళాలే కాల్పులు జరిపాయని ఆరోపించింది. శాంతికి విఘాతం కలిగించే ఇలాంటి పనులను థాయ్‌లాండ్(Thailand) వెంటనే ఆపాలని డిమాండ్ చేసింది. కవ్వింపు చర్యలతో తమను రెచ్చగొట్టొద్దంటూ హెచ్చరించింది. సరిహద్దుల్లో వెంటనే శాంతి పూర్వక వాతావరణం నెలకొనేలా కృషి చేద్దామని సూచించింది.
నిజానికి ఈ ఏడాది జూలైలో థాయ్‌లాండ్-కాంబోడియా మధ్య చిన్న యుద్ధం జరగ్గా.. పలువురు సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా మృతి చెందారు. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాల ప్రభుత్వాలను రాజీకి ఒప్పించారు. సంధి ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది నెలలకే మళ్లీ ఘర్షణలు చెలరేగాయి.
ఈ రెండు దేశాల మధ్య ఎన్నో ఏళ్లుగా సరిహద్దు వివాదాలు నెలకొన్నాయి.
హిందూ దేవాలయాల కోసమే థాయ్ లాండ్, కంబోడియా ఘర్షణ పడుతున్నట్టు చెబుతారు. పలు ఆలయాలతో పాటు పర్వతాలు, అడవి ప్రాంతాలు కలిసి ఉన్న వాటి కోసం ఇరు దేశాల మధ్య ఎప్పటినుంచో పోరాటం సాగుతోంది. ముఖ్యంగా సరిహద్దుల్లో ఉన్న ప్రీహ్ వివాార్ అనే శివాలయం కోసం ఇరు దేశాలు కొట్టుకుంటున్నాయి. దీనిని గతంలో ఖెమర్ పాలకులు నిర్మించినట్టు చెబుతారు. ఈ ఆలయం కంబోడియాకే చెందుతుందని 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
అప్పట్లో థాయ్ లాండ్ (Thailand)కూడా దీనిని అంగీకరించింది. అయితే ఇటీవల కాలంలో కొన్ని సెంటిమెంట్ల కారణంగా తరచూ వివాదాలు రేగుతున్నాయి. అలాగే థాయ్ లాండ్ సరిహద్దుల్లో ఉన్న మోన్ థోమ్, మ్యూన్ థోమ్ ప్రాంతాలు కూడా వివాదాస్పదంగానే కొనసాగుతున్నాయి. ఇక్కడ ఉండే శివాలయాలు, ఇతర ఆలయాల కోసం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఆ ఆలయాలు కూలిపోయే స్థితికి చేరినా వాటిని పట్టించుకోకుండా ఈ వివాదాలతోనే కాలం గడేపేస్తున్నారు.
