Wall of Tears
ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడాలలో ఒకటైన ‘ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ గురించి అందరికీ తెలుసు. అయితే, మీరు ఎప్పుడైనా ‘ది వాల్ ఆఫ్ టియర్స్’ (The Wall of Tears) గురించి విన్నారా? ఇది ఎక్కడ ఉంది, దీని వెనుక ఉన్న విషాదకరమైన చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
‘ది వాల్ ఆఫ్ టియర్స్’ (Wall of Tears)ఉన్న ప్రాంతం ఈక్వెడార్‌లోని గాలాపోగస్ ద్వీపసమూహంలోని ఇసబెల్లా ఐలాండ్. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, అంటే 1946లో, అప్పటి ప్రభుత్వం దాదాపు 300 మంది ఖైదీలతో ఈ ఇసబెల్లా ఐలాండ్‌లో ఒక కాలనీని ఏర్పాటు చేసింది.
ఈ ఖైదీలతో ఆ ప్రభుత్వం ద్వీపం చుట్టూ ఒక గోడను నిర్మించాలని నిర్ణయించింది. గోడ నిర్మాణం కోసం ఖైదీలు చాలా దూరం నడుచుకుంటూ వెళ్లి, క్వారీల్లో రాళ్లను పగలగొట్టి, వాటిని తమ భుజాలపై మోసుకుంటూ వచ్చి గోడ నిర్మించాల్సి వచ్చేది. ఈ వెట్టి చాకిరీ కారణంగా చాలా మంది ఖైదీలు అనారోగ్యానికి గురై మరణించారు.
ప్రభుత్వం తమతో ఇంతటి వెట్టి చాకిరీ చేయించడాన్ని వ్యతిరేకిస్తూ, కొందరు ఖైదీలు 1958లో తిరుగుబాటు చేయగా, పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస విషాదాలతో, ప్రభుత్వం చివరకు ఆ కాలనీని మూసివేసింది. అయితే, ఖైదీలు కన్నీరు పెట్టుకుంటూ, చెమటోడుస్తూ నిర్మించిన ఆ గోడ మాత్రం ఇప్పటికీ ఇసబెల్లా ఐలాండ్‌లో దర్శనమిస్తుంది. ఆ గోడ యొక్క విషాద చరిత్ర కారణంగానే దీనికి ‘ది వాల్ ఆఫ్ టియర్స్’ అని పేరు పెట్టారు.
ప్రస్తుతం ఆరు మీటర్ల ఎత్తు, వంద మీటర్ల పొడవు ఉన్న ఈ గోడ ఒక టూరిస్ట్ స్పాట్‌గా మారింది. ఇసబెల్లా ఐలాండ్‌ను సందర్శించిన పర్యటకులు కచ్చితంగా ఈ కన్నీటి గోడను సందర్శిస్తుంటారు.