Ice Flowers
ప్రకృతి ఎన్నో అద్భుతాలకు నిలయం. అలాంటివాటిలో ఒకటి ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ సముద్రాలపై ఏర్పడే మంచు పువ్వులు(Ice Flowers) . మీరే ఊహించుకోండి. విశాలమైన మంచు సముద్రంపై ఒక తెల్లని, అందమైన పూల తోట వికసించినట్లుగా ఉంటే ఎంత బాగుంటుంది. ఈ దృశ్యం చూసి కవి హృదయాలు, ప్రకృతి ప్రేమికులే కాదు ఎవరైనా మనసు పారేసుకోవాల్సిందే కదా. అందుకే ఇది ఒక సాధారణ దృశ్యం కాదు.. నిర్దిష్ట పరిస్థితులలో మాత్రమే ఏర్పడే ఒక అరుదైన సహజ దృగ్విషయంగా మారి శాస్త్రవేత్తలకే అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.
నిజానికి ఈ మంచు పువ్వులు(Ice Flowers) పరుచుకునే అద్భుతం జరగాలంటే మూడు కీలకమైన పరిస్థితులు ఒకచోట కలవాలి. మొదటిది, సముద్రం పైన కొత్తగా ఏర్పడిన మంచు పొర చాలా పలుచగా, కొన్ని సెంటీమీటర్ల మందంలో ఉండాలి. రెండవది, దాని పైన ఉన్న గాలి ఉష్ణోగ్రత చాలా చల్లగా, కనీసం మైనస్ 20°C లేదా అంతకంటే తక్కువగా ఉండాలి, అలాగే గాలి ప్రశాంతంగా వీయాలి. మూడవది, సముద్రపు నీరు గడ్డకట్టే ఉష్ణోగ్రత (-1.8°C)కి చేరుకోవాలి.
ఈ పరిస్థితులు ఒకచోట కలిసినప్పుడు, పలుచటి మంచు పొరలోని చిన్న పగుళ్ల నుంచి సముద్రపు నీటి ఆవిరి బయటకు వస్తుంది. ఈ ఆవిరి అత్యంత చల్లని గాలిని తాకిన వెంటనే ఘనీభవించి (sublimation), చిన్న చిన్న మంచు స్ఫటికాలుగా మారుతుంది. ఈ స్ఫటికాలే పూల రేకుల్లాంటి అందమైన ఆకృతుల్లో ఒకదానిపై ఒకటిగా పెరిగి, భూమికి దగ్గరగా అతుక్కుని ఉంటాయి. ఈ ప్రక్రియ చాలా వేగంగా జరిగి, సముద్రం పైన ఒక అందమైన మంచుతోటను సృష్టిస్తుంది.
మంచు పువ్వులు(Ice Flowers) వాటి అందం కంటే ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. అవి సముద్రపు నీటిలో ఉండే ఉప్పు ,లవణాలను తమలో ఇముడ్చుకోవడం వల్ల సాధారణ మంచు కంటే చాలా ఉప్పగా ఉంటాయి. ఇది శాస్త్రవేత్తలకు సముద్రపు రసాయన శాస్త్రం, ఉప్పు పదార్థాలు మంచు పొరలోకి ఎలా చేరుతాయనే విషయాలపై పరిశోధన చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం ఇస్తుంది.
అంతేకాకుండా, ఈ మంచు పువ్వుల అధ్యయనం వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడానికి కూడా కీలకంగా ఉంది. అవి సముద్రం , వాతావరణం మధ్య జరిగే సంక్లిష్టమైన పరస్పర చర్యలను ప్రతిబింబిస్తాయి. నీటి ఆవిరి ఏ విధంగా ఘనీభవిస్తుంది, గాలిలోని రసాయన కణాలు మంచులో ఎలా నిక్షిప్తం అవుతాయి వంటి విషయాలపై వీటి పరిశోధనలు ఎంతో సహాయపడతాయి. ఈ అద్భుత దృశ్యం ఎక్కువగా ఉత్తర ధ్రువం (ఆర్కిటిక్), దక్షిణ ధ్రువం (అంటార్కిటిక్) ప్రాంతాలలో, శీతాకాలం సమయంలో అంటే నవంబర్ నుంచి మార్చి మధ్య వరకు కనిపిస్తుంది.
ఈ మంచు పువ్వులు(Ice Flowers) కేవలం ప్రకృతి అద్భుతం మాత్రమే కాదు, అవి మన భూమి యొక్క వాతావరణం , సముద్ర జీవనానికి సంబంధించిన రహస్యాలను విప్పేందుకు శాస్త్రవేత్తలకు లభించిన ఒక సహజ ప్రయోగశాల. వాటి సున్నితమైన ఆకృతి, ప్రత్యేక లక్షణాలు ప్రకృతి ఎంత విభిన్నంగా, సంక్లిష్టంగా ఉంటుందో మనకు తెలియజేస్తాయి.