India
తాజాగా అమెరికా భారత్‌పై విధిస్తున్న భారీ టారిఫ్‌లు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటంతో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 25% పన్ను, ఇప్పటికే ఉన్న 25% పన్నుకు తోడై.. మొత్తం పన్ను 50%కి పెరిగింది. గార్మెంట్స్, ఆభరణాలు, పాదరక్షలు వంటి భారతీయ ఉత్పత్తులపై ఈ పన్నులు అమల్లోకి రావడంతో ఎగుమతిదారుల్లో ఆందోళన మొదలైంది.
భారత్ ఈ చర్యలను అన్యాయం, ఆమోదయోగ్యం కాదని చెబుతోంది. అయితే, ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి చర్చల మార్గం ఇంకా తెరిచే ఉందని భారత్ తెలిపింది. రెండు దేశాల మధ్య సంభాషణలు కొనసాగుతున్నాయని, దీని ద్వారా ఒక పరిష్కారానికి రావాలని ఆశిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
అయితే చర్చలు ఎంత ముఖ్యమైనవైనా, భారత్(India) తమ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గని అంశాలు (Red lines) విషయంలో చాలా స్పష్టంగా ఉంది. మన దేశ రైతులు, చిన్న ఉత్పత్తిదారులు ,సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) ప్రయోజనాలను కాపాడటంలో ఏమాత్రం రాజీపడబోమని భారత్ తేల్చి చెప్పింది. ఈ అంశాలపై ఎంత ఒత్తిడి వచ్చినా, వాటిని ఎదుర్కోవడానికి తమ శక్తిని పెంచుకుంటూనే ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పష్టం చేశారు.
అంతేకాదు అమెరికా చర్యలపై భారత్ కొన్ని తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న చైనా లాంటి దేశాలపై ఎలాంటి పన్నులు విధించకుండా, భారత్‌పైనే ఈ చర్యలు తీసుకోవడం అన్యాయమని అభిప్రాయపడింది. అంతేకాకుండా, ఈ 25% పన్ను ఒప్పంద చర్చల్లో భాగంగా లేదని, ఇది ఒక అనుకోని దెబ్బ అని భారత్ పేర్కొంది. ఈ పన్ను తాత్కాలికమేనని, ద్వైపాక్షిక చర్చల ద్వారా దీనిని రద్దు చేయాలని భారత్ ఆశిస్తోంది.
కాగా ఈ పన్నుల వల్ల 2 దేశాల మధ్య దశాబ్ద కాలంగా పెరుగుతున్న వాణిజ్య, రక్షణ సహకారాలపై ఒత్తిడి పెరుగుతోంది. 2024లో భారత్-అమెరికా మధ్య వస్తువుల వాణిజ్యం విలువ 129 బిలియన్ డాలర్లు కాగా, దీనిలో అమెరికా వాణిజ్య లోటు 45.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ పన్నుల పెంపు వల్ల భారత్ నుంచి అమెరికాకు జరిగే 87 బిలియన్ డాలర్ల ఎగుమతుల్లో 55% వరకు ప్రభావం పడొచ్చు. దీనివల్ల బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలకు లాభం చేకూరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.