Indian rice
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మరోసారి భారత్‌కు సంబంధించిన వాణిజ్య అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. అమెరికా మార్కెట్‌లోకి భారత్ నుంచి దిగుమతి అయ్యే బియ్యం(Indian rice)పై అదనపు సుంకాలు విధించేందుకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరగబోతున్న తరుణంలో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది.
రైతుల ఫిర్యాదు, ట్రంప్ స్పందన.. సోమవారం వైట్‌హౌస్‌లో అమెరికన్ బియ్యం రైతులతో జరిగిన సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. ట్రంప్ 12 బిలియన్ డాలర్ల ఫామర్ ఎయిడ్ ప్యాకేజీ ప్రకటన సందర్భంగా రైతులు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. భారత్, థాయ్‌లాండ్, చైనా వంటి ఆసియా దేశాలు తమ ఉత్పత్తులపై భారీగా సబ్సిడీలు ఇస్తున్నాయని, ఫలితంగా బియ్యాన్ని చాలా తక్కువ ధరలకు (డంపింగ్) అమెరికా మార్కెట్‌లో విక్రయిస్తున్నాయని, దీంతో తమ రైతులు పోటీ పడలేకపోతున్నారని విజ్ఞప్తి చేశారు.
దీనికి ట్రంప్ స్పందిస్తూ, “భారత్ రైస్‌ను (Indian rice)ఇలా డంప్ చేయడానికి ఎందుకు అనుమతిస్తున్నాం?” అని అధికారులను సూటిగా ప్రశ్నించారు.
ట్రంప్ ఇచ్చిన కీలక హెచ్చరిక ఏంటంటే: “వాళ్లు (భారత్) మన మార్కెట్‌లోకి వస్తే, మనం కూడా వాళ్ల మార్కెట్‌లోకి వెళ్దాం.” ఒకవేళ అది సాధ్యం కాకపోతే, తప్పనిసరిగా భారత్ బియ్యం(Indian rice)పై అదనపు సుంకాలు (Tariffs) విధిస్తామని, ఇకపై ఇలాంటి డంపింగ్‌ను అనుమతించబోమని స్పష్టం చేశారు.
అమెరికాలో భారత బాస్మతి బియ్యానికి మంచి గిరాకీ ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు సుమారు 4.5 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతి అయింది. ప్రస్తుతం బాస్మతిపై అమెరికా సున్నా నుంచి 2.4 శాతం వరకు మాత్రమే సుంకం విధిస్తోంది.
అయితే, అమెరికన్ రైతుల ప్రధాన ఆరోపణ ఏమిటంటే, నాన్-బాస్మతి రకాలపై ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత్ ధరలు చాలా తక్కువగా ఉండటంతో వారు నష్టపోతున్నారు. ఈ నేపధ్యంలో, ట్రంప్ అదనపు సుంకాలు విధిస్తే, అది భారత బియ్యం ఎగుమతిదారులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్–అమెరికా చర్చలు సిద్ధమవుతున్న ఈ కీలక సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం వాణిజ్య వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.
