water : ఆ వాటర్‌లో ఏ వస్తువు వేసినా రాయిలా మారుతుందట..

water : ప్రకృతిలో అనేక అంతుచిక్కని  వింతలు ఉన్నాయి. వాటిలో కొన్ని శాస్త్రీయంగా వివరించగలిగినవి కాగా, మరికొన్ని ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి.

water : ప్రకృతిలో అనేక అంతుచిక్కని  వింతలు ఉన్నాయి. అవి మనల్ని ఆశ్చర్యపోయేలా చేస్తాయి. వాటిలో కొన్ని శాస్త్రీయంగా వివరించగలిగినవి కాగా, మరికొన్ని ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. అలాంటి ఒక అద్భుతమైన ప్రదేశం ఇంగ్లాండ్‌లో ఉంది .. ఒక జలపాతం, దాని నీటిలో ఏ వస్తువును వేసినా అది రాయిలా మారుతుందట. వినడానికి అద్భుతంగా ఉన్నా, ఇది నిజంగానే జరుగుతుంది.

The Dropping Well

ఈ అద్భుతమైన జలపాతం ఇంగ్లాండ్‌లోని నారెస్‌బరో (Knaresborough) అనే పట్టణంలో ఉంది. ఇక్కడ ఒక నీటి బుడగ నుంచి బయటకు వచ్చే నీళ్లు షిప్టాన్స్ (Mother Shipton’s Cave) అనే ప్రసిద్ధ గుహ నుంచి కిందకు జారుతాయి. ఈ జలపాతాన్ని స్థానికులు ,పర్యాటకులు డ్రాపింగ్ వెల్ (The Dropping Well) అని కూడా పిలుస్తారు.

ఈ జలపాతం యొక్క ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే, దాని నీటిలో ఏదైనా వస్తువును వేస్తే అది క్రమంగా రాయిలా(stone) మారిపోతుంది. ఈ వింతను 1630లో గుర్తించారు. ఈ జలపాతాన్ని చూడటానికి ప్రపంచ దేశాల నుంచి అనేక మంది పర్యాటకులు అక్కడికి వస్తుంటారు. కొందరు పర్యాటకులు పొరపాటున నీటిలో పడితే ఎక్కడ రాయిలా మారుతామేమోనని భయపడుతుంటారు.

కొందరు మాత్రం ఆసక్తితో , మరి కొందరు దీనిని పరీక్షించేందుకు తమ సైకిళ్లను, టెడ్డీ బేర్లను, లేదా ఇతర వస్తువులను నీటిలో వేలాడదీస్తారు. కొద్ది రోజుల తర్వాత, ఆ వస్తువులు నిజంగానే రాయిలా మారిపోయి గట్టిపడిపోతాయి. అక్కడ వేలాడదీసిన టెడ్డీ బేర్లు, బూట్లు, టీ కెటిల్స్ వంటివి రాతి రూపంలో కనిపించడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఈ జలపాతంపై సంవత్సరాల తరబడి పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఎట్టకేలకు దాని వెనుక ఉన్న రహస్యాన్ని కనుగొన్నారు. ఆ నీటిలో పెద్ద మొత్తంలో సున్నపు రాయి (Limestone) మరియు ఇతర ఖనిజాలు కరిగి ఉన్నాయని గుర్తించారు. నీరు ప్రవహించే మార్గంలో, ఇది ఖనిజాలను, ముఖ్యంగా కాల్షియం కార్బొనేట్‌ను గ్రహిస్తుంది.

ఈ నీటిలో ఏదైనా వస్తువును ఉంచినప్పుడు, నీటిలోని కరిగిన సున్నం, ఇతర ఖనిజాలు ఆ వస్తువు ఉపరితలంపై నిక్షిప్తం అవుతాయి. అవి పొరలు పొరలుగా పేరుకుపోయి, కాలక్రమేణా వస్తువును గట్టిపడేలా చేస్తాయి, చివరికి అది రాయిలా మారిపోతుంది (పెట్రిఫికేషన్ ప్రక్రియ).

ఇది నిజానికి వస్తువు రాయిలా మారడం కాదు, దాని ఉపరితలంపై ఖనిజాలు పేరుకుపోయి, దాన్ని రాతితో కప్పినట్లుగా మార్చడం అన్నమాట. అయితే ఈ డ్రాపింగ్ వెల్ అనేది ప్రకృతిలోని రసాయన ప్రక్రియలకు ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుంది. ఇది పర్యాటకులను, శాస్త్రవేత్తలను ఒకేలా ఆకర్షిస్తూ, ప్రకృతిలోని అద్భుతాలను తెలియజేస్తుంది.

 

Exit mobile version