Switzerland
నూతన సంవత్సర వేడుకల వేళ స్విట్జర్లాండ్ (Switzerland)లో విషాదం నెలకొంది. ఆల్స్ మౌంటైన్ సమీపంలోని పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన క్రాన్స్ మెంటా స్కీ రిసార్టులో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 40 మంది వరకూ మృతి చెందినట్టు సమాచారం. లే కాన్స్టెలేషన్ బార్‌లో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తోంది. వేడుకల్లో భాగంగా బాణాసంచా పేలుస్తుండగా పేలుడు సంభవించినట్టు అనుమానిస్తున్నారు.
తెల్లవారుజామున సుమారు 1.30 గంటలకు బార్‌లో ఒక్కసారిగా పేలుడు జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. న్యూ ఇయర్ కు వెల్ కమ్ చెప్పేందుకు అందరూ అక్కడ సెలబ్రేషన్స్ లో ఉండగా.. ఒక్కసారిగా పేలుడు సంభవించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమనయంలో అక్కడ 200 మందికి పైగా ఉన్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. దాదాపు 100 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్టు, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
ప్రమాదం జరిగిన (Switzerland)వెంటనే దట్టమైన పొగతో దారి తెలియకపోవడంతో పలువురు మంటల్లో చిక్కుకుపోయారు. ఎట్టువెళ్లాలో తెలియక, తొక్కిసలాటలో కొందరు ఇరుక్కున్నట్టు భావిస్తున్నారు. అటవీ ప్రాంతం కావడంతో రోడ్డు మార్గంలో గాయపడిన వారిని తరలించడం కష్టమైంది. దీంతో హెలికాఫ్టర్లను రంగంలోకి దించిన అధికారులు క్షతగాత్రులను వాటి ద్వారా తరలించారు. దగ్గరలోని హాస్పిటల్స్ తక్కువే ఉండడంతో గాయపడిన వారితో నిండిపోయాయి,
ఇదిలా ఉంటే ప్రమాదానికి స్పష్టమైన కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. పేలుడు సంభవించినట్టు చెబుతున్నా అది బాణాసంచా వల్లనే అనేందుకు పూర్తిస్థాయి ఆధారాలు ఇంకా దొరకలేదని పోలీసులు చెబుతున్నారు. ఇది ఉగ్రవాద చర్య కాకపోవచ్చని మాత్రం పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అంతకంటే ఎక్కువ జనసామర్థ్యం ఉండే బార్ లు, రెస్టారెంట్లు ఇంకా ఉన్నప్పటకీ.. ఇక్కడ పేలుడుకు పాల్పడే పరిస్థితి లేదంటున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలాన్ని , చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇటువైపు విమాన రాకపోకలను కూడా తాత్కాలికంగా ఆపివేశారు. ఫైర్ సేఫ్టీ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి కారణమైందన్న కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.
