IndiGo flights
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా పేరొందిన ఇండిగో(IndiGo flights) ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కేవలం రెండు రోజుల వ్యవధిలో (మంగళ, బుధవారాల్లో) 300 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేయడమే కాక, ఇటీవల వందలాది విమానాలను ఆలస్యంగా నడపడం దేశీయ విమాన ప్రయాణాల్లో తీవ్ర గందరగోళానికి దారి తీసింది. రోజుకు సగటున 2,300 కంటే ఎక్కువ విమానాలను నడిపే ఇండిగో (IndiGo flights)సంస్థ, మొత్తం విమానాల్లో దాదాపు ఏడు శాతం రద్దు చేయడం ప్రయాణికులలో ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఊహించని విమానాల రద్దుకు ప్రధాన కారణం పైలట్ల కొరత. అయితే, ఈ కొరత ఒక్కసారిగా పెరగడానికి కారణం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నవంబర్ 1 నుంచి పూర్తిగా అమలులోకి తెచ్చిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనలు. ఈ కొత్త నియమాలు చాలా కఠినంగా ఉన్నాయి.
పైలట్లు విమానాలు నడపాల్సిన గంటలను తగ్గించడం, అలాగే పైలట్లు సహజంగా అలసిపోయే తెల్లవారుజామున (ఎర్లీ మార్నింగ్) వారికి డ్యూటీ సమయాన్ని తగ్గించడం.అంతేకాదు వరుసగా ఎన్ని రాత్రులు పనిచేయవచ్చనే దానిపైనా ఇప్పుడు పరిమితి విధించడం.
ఈ కొత్త FDTL నిబంధనలు, పైలట్ల విశ్రాంతిని, భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి. కానీ, ఇండిగో (IndiGo flights)కు సరిపడా పైలట్లు లేకపోవడం, ఉన్నవారి షిఫ్ట్‌లను ఈ కొత్త నిబంధనలకు అనుగుణంగా సరిగ్గా ప్లాన్ చేయడంలో కంపెనీ తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో, విమానాల రద్దు అనివార్యమైంది.
ఢిల్లీ విమానాశ్రయం, ముంబై విమానాశ్రయాలలోనే కలిపి బుధవారం ఒక్కరోజే దాదాపు 70కి పైగా విమానాలు రద్దయ్యాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ రద్దుల కారణంగా వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో నవంబర్ నెలలో తీవ్ర కార్యాచరణ వైఫల్యాన్ని ఎదుర్కొంది. ఈ నెలలో మొత్తం 1,232 విమానాలు రద్దయ్యాయి. వందలాది విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఈ సంక్షోభం కారణంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాన్ని, ఆర్థిక నష్టాన్ని చవిచూశారు.
ఇండిగో ఆన్-టైమ్ పనితీరు (OTP) అక్టోబర్‌లో 84.1% నుంచి నవంబర్‌లో కేవలం 67.70%కి పడిపోయింది. ఈ తీవ్ర క్షీణతపై డీజీసీఏ (DGCA) ఇండిగోను వివరణ కోరింది.
అయితే కలిగిన అసౌకర్యానికి ఇండిగో క్షమాపణలు చెప్పింది. కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి, రాబోయే 48 గంటల పాటు తమ షెడ్యూల్‌లో క్రమాంకనం చేసిన సర్దుబాట్లు (calibrated adjustments) ప్రారంభించినట్లు ప్రకటించింది.
కాగా ఇండిగో విమానాల రద్దు వల్ల అత్యవసర వైద్య సేవలు, ముఖ్యమైన వ్యాపార సమావేశాలు లేదా కుటుంబ కార్యక్రమాల కోసం ప్రయాణించే వారు చివరి నిమిషంలో విమానం రద్దు కావడంతో నానా అవస్థలు పడుతున్నారు.
అంతర్జాతీయ ప్రయాణాలకు వెళ్లేవారు, కనెక్టింగ్ ఫ్లైట్స్ కోల్పోయి విదేశీ విమానాశ్రయాల్లో చిక్కుకుపోతున్నారు.
విమానం రద్దు అవ్వడం వల్ల ప్రత్యామ్నాయ మార్గాలలో (రైలు లేదా ఇతర విమానాలలో) టిక్కెట్లు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇవి చివరి నిమిషంలో ఎక్కువ ధరలకు లభిస్తాయి, దీంతో ప్రయాణికులు భారీగా ఆర్థికంగా నష్టపోతున్నారు.
విమానం రద్దు వల్ల ఎప్పుడు ప్రయాణం మొదలవుతుందో తెలియక, గంటల తరబడి విమానాశ్రయాల్లో వేచి ఉండటం మానసిక ఒత్తిడికి, ఆందోళనకు దారితీస్తోంది.
ప్రస్తుతం ఇండిగో (యొక్క ఆన్-టైమ్ పనితీరు (OTP) 35 శాతానికి పడిపోయింది. అంటే, నడిపిన విమానాల్లో కేవలం 35 శాతం మాత్రమే సమయానికి గమ్యస్థానాలకు చేరుకున్నాయి. ఇది భద్రత, నాణ్యత విషయంలో ప్రయాణికుల నమ్మకాన్ని దెబ్బతీస్తోంది.
భవిష్యత్తులో ఏం జరగబోతుంది? భయపడాల్సిన అవసరం ఉందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.అయితే ఇండిగో (IndiGo flights)తన పైలట్ షెడ్యూలింగ్‌ను పూర్తిగా కొత్త FDTL నిబంధనలకు అనుగుణంగా మార్చడానికి మరికొంత సమయం పట్టొచ్చన్న విమానాయన సంస్థలు అంచనా వేస్తున్నాయి.
ఇలాంటి భారీ రద్దుల పరంపర కొనసాగితే, అత్యవసర ప్రయాణాలకు ఇండిగో (IndiGo flights)విమానాలను బుక్ చేసుకోవడానికి ప్రజలు భయపడటం ఖాయం. దీని ప్రభావం ఇండిగో మార్కెట్ వాటాపై పడుతుంది.
ఇండిగో ఈ సమస్యను పరిష్కరించడానికి కొత్త పైలట్లను త్వరగా నియమించుకోవడం, శిక్షణ ఇవ్వడం, ఉన్న పైలట్ల పని వేళలను అత్యంత సమర్థంగా ప్లాన్ చేయడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఈ సంక్షోభం తాత్కాలికమే అయినా, రాబోయే రోజుల్లో ఇండిగో (IndiGo flights)ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటుంది అనే దానిపైనే ప్రయాణికుల విశ్వాసం ఆధారపడి ఉంటుంది. విమానయానంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి, కాబట్టి DGCA నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే.
