IND vs ENG
టీ20 ప్రపంచకప్ నాకౌట్ స్టేజ్ కు చేరుకుంది. 20 జట్లతో ప్రారంభమైన ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా టైటిల్ కు రెండడుగుల దూరంలో నిలిచింది. గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్(IND vs ENG) తో తలపడబోతోంది. ఈ నాకౌట్ ఫైట్ కు వాంఖడే స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఇరు జట్లలోనూ టీ20 హిట్టర్స్ ఉండడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయం.
భారత్ విషయానికొస్తే ఈ వరల్డ్ కప్ లో అంచనాలకు తగ్గట్టే రాణిస్తున్న టీమిండియాను కొన్ని బలహీనతలు మాత్రం వెంటాడుతున్నాయి. వెస్టిండీస్ తో డూ ఆర్ డై మ్యాచ్ లో మిడిలార్డర్ బ్యాటింగ్ వైఫల్యం , డెత్ ఓవర్లలో బౌలర్లు పరుగులిచ్చేయడంతో పాటు పేలవమైన ఫీల్డింగ్ తో పలు క్యాచ్ లు జారవిడిచారు.
ఈ నేపథ్యంలో సెమీఫైనల్ కు ఈ బలహీనతలను అధిగమించాల్సిందే. ఎందుకంటే ఇక్కడ అవే తప్పులు రిపీటయితే మాత్రం ఇంటిదారి పట్టాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే భారత తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. వైఫల్యాల బాట వీడని అభిషేక్ శర్మను తప్పిస్తారా లేదా అన్నది చూడాలి.
ప్రస్తుతం జట్టు వర్గాల సమాచారం ప్రకారం అభిషేక్ ను కొనసాగించేందుకే గంభీర్ మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో సంజూ శాంసన్,అభిషేక్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా.. ఇషాన్ కిషన్ వన్ డౌన్ లో రానున్నాడు. గత మ్యాచ్ లో సంజూ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి ఫామ్ లోకి వచ్చాడు. సెమీస్ లోనూ సంజూపైనే అంచనాలున్నాయి.
అయితే మిడిలార్డర్ లో తడబాటు మాత్రం ఆందోళన కలిగిస్తోంది. సూర్యకుమార్ , తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా మంచి ఆరంభాలను భారీస్కోర్లుగా మలచలేకపోతున్నారు. దీంతో తర్వాతి బ్యాటర్లపై అనవసర ఒత్తిడి పెరుగుతోంది. వరుసగా విజయాలు వస్తుండడంతో దీనిని అంతగా పట్టించుకోవడం లేదు. అయితే సెమీఫైనల్లో మాత్రం మరొక అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా మిడిలార్డర్ బ్యాటర్లు రాణించాల్సి ఉంటుంది.
అటు బౌలింగ్ లో పేస్ ఎటాక్ ను బుమ్రానే లీడ్ చేయనుండగా.. మరొక పేసర్ గా అర్షదీప్ సింగ్ ఉంటాడు. అర్షదీప్ అనుకున్న స్థాయిలో సత్తా చాటలేకపోతున్నాడు. వికెట్లు తీయకపోగా భారీగా పరుగులిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అటు హార్థిక్ పాండ్యా, దూబే కూడా ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టలేకపోతున్నారు. ఎటొచ్చీ స్పిన్నర్లే కాస్తో కూస్తో మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్లలో వికెట్లు తీస్తున్నారు. దీంతో తుది జట్టు కూర్పును మార్చే అవకాశాలు కనిపించడం లేదు.
మరోవైపు ఇంగ్లాండ్ ను ఏ మాత్రం తేలిగ్గా తీసుకోలేం. ఎందుకంటే ఈ మెగాటోర్నీలో ఒక మ్యాచ్ మాత్రమే ఓడిన ఇంగ్లీష్ టీమ్ సూపర్ 8లో హ్యాట్రిక్ విజయాలు సాధించి సెమీస్ కు దూసుకొచ్చింది. సూపర్ 8లో శ్రీలంక, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లను చిత్తు చేసింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ తో పాటు ఫిల్ సాల్ట్ , ఆదిల్ రషీద్ , విల్ జాక్స్ , సామ్ కరన్ లాంటి కీలక ఆటగాళ్లు మంచి ఫామ్ లో ఉండడంతో ఇంగ్లాండ్ కూడా పూర్తి కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగుతోంది. ఇక మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న ముంబై వాంఖడే స్టేడియంలో పిచ్ బ్యాటర్లకు అనుకూలిస్తుంది. దీంతో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ కే మొగ్గుచూపొచ్చు.
