Pakistan
తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో దేశాన్ని నడుపుతున్న పాకిస్తాన్(Pakistan) ప్రభుత్వం తమ ఆస్తులను ఒక్కొక్కటిగా విక్రయిస్తూ వస్తోంది. తాజాగా తమ జాతీయ విమానయాన సంస్థ పాకిస్తాన్ ఇంటర్నేషన్ ఎయిర్ లైన్స్ ను విక్రయించింది. గత కొన్ని రోజులుగా దీనిని అమ్మేసే ప్రయత్నాల్లోనే ఉన్న పాక్ ప్రభుత్వం ఎట్టకేలకు ఆ ప్రక్రియను ముగించింది.
దీనిని వేలం వేయడంతో బిడ్డింగ్ లలో ప్రధానంగా 3 సంస్థల మధ్య పోటీ నడిచింది. పారదర్శకత కోసం ఈ ప్రక్రియను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆరిఫ్ హబీబ్ గ్రూప్ కు చెందిన కన్సార్టియం ఈ బిడ్డింగ్‌లో విజేతగా నిలిచి పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ ను సొంతం చేసుకుంది. 20 ఏళ్ల తర్వాత పాక్ లో జరిగిన ప్రైవేటీకరణ ప్రక్రియగా ఇది నిలిచింది.
పీఐఏ కనీస ధరను రూ.1000 కోట్ల రూపాయలుగా నిర్ణయించగా.. లక్కీ సిమెంట్ గ్రూప్ రూ.13 వేల 400 కోట్ల వరకూ పోటీ పడింది. చివరుకు ఆరిఫ్ హబీబ్ గ్రూప్ 13,500 కోట్లకు బిడ్‌ను గెలుచుకుంది. ఈ విక్రయించే ప్రక్రియలో కొన్ని షరతులు కూడా ఉన్నాయి. తమ ఎయిర్ లైన్స్ పునరుద్ధరణకు కండీషన్లు పెట్టారు. పీఐఏలో ప్రస్తుతం 75 శాతం వాటాను మాత్రమే విక్రయించారు. కాగా బిడ్డింగ్ లో గెలిచిన సంస్థ రానున్న 5 ఏళ్లలో పాక్(Pakistan) లో ఎయిర్‌లైన్ అభివృద్ధికి 2500 కోట్ల రూపాయల వరకూ పెట్టుబడి పెట్టాలని కండీషన్ పెట్టారు.
పీఐఏను విక్రయించగా వచ్చిన మొత్తంలో 92.5 శాతం ఎయిర్‌లైన్ అప్పులు తీర్చడానికి కేటాయించనున్నారు. వచ్చిన డబ్బులో 7.5 శాతం మాత్రమే పాకిస్తాన్(Pakistan) ప్రభుత్వానికి వెళుతుంది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ గత కొన్నేళ్లుగా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది.
గత ఏడాది నుంచీ అప్పుడు రూ.20 వేల కోట్లు దాటిపోయాయి.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్‌కు 7 బిలియన్ డాలర్ల రుణం ఇవ్వడానికి ఐఎంఎఫ్ పెట్టిన ప్రధాన నిబంధనల్లో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ కీలకంగా మారింది. ప్రస్తుతం దేశ ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టే ప్రయత్నాల్లోనే ఇలా ప్రైవేటు వ్యక్తులకు ఆస్తులను విక్రయిస్తున్నట్టు పాక్ ప్రభుత్వం చెబుతోంది. అయితే పాక్ లోని ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయి. అయినా కూడా వెనక్కి తగ్గని పాక్ సర్కారు మరికొన్ని ఆస్తులను కూడా వేలం వేసే యోచనలో ఉంది.
