Diversity Visa: డైవర్సిటీ వీసా నిలిపివేసిన ట్రంప్..భారతీయుల పరిస్థితి ఏంటి?

Diversity Visa: బ్రౌన్ యూనివర్సిటీ కాల్పుల ఘటనలో అనుమానితుడైన వాలెంటే అనే వ్యక్తి 2017లో ఇదే డైవర్సిటీ లాటరీ ద్వారా అమెరికాలోకి ప్రవేశించి గ్రీన్ కార్డ్ పొందినట్లు అధికారులు గుర్తించారు.

Diversity Visa

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పాలనలో వలస విధానాలపై అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా డైవర్సిటీ(Diversity Visa) ఇమ్మిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తూ ట్రంప్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా దీన్ని సామాన్యులు ‘గ్రీన్ కార్డ్ లాటరీ’ అని పిలుచుకుంటారు. ఇటీవల బ్రౌన్ యూనివర్సిటీ , మాసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) లో జరిగిన కాల్పుల ఘటనలను కారణంగా చూపుతూ ఈ ప్రోగ్రామ్‌ను సస్పెండ్ చేశారు. అమెరికా భద్రతను పణంగా పెట్టి ఇలాంటి వీసా ప్రోగ్రామ్స్ అవసరం లేదని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భావిస్తోంది.

ఈ నిర్ణయానికి బలమైన కారణం కాల్పుల ఘటనలో నిందితుడిగా ఉన్న వ్యక్తి బ్యాక్ గ్రౌండ్. బ్రౌన్ యూనివర్సిటీ కాల్పుల ఘటనలో అనుమానితుడైన వాలెంటే అనే వ్యక్తి 2017లో ఇదే(Diversity Visa) డైవర్సిటీ లాటరీ ద్వారా అమెరికాలోకి ప్రవేశించి గ్రీన్ కార్డ్ పొందినట్లు అధికారులు గుర్తించారు.

దీనిపై అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయం స్పందిస్తూ, ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల అమెరికన్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ట్రంప్ ఆదేశాల మేరకు యూఎస్‌సీఐఎస్ (USCIS) ఈ పథకాన్ని నిలిపివేసింది. వాస్తవానికి 2017లోనే ట్రంప్ దీన్ని రద్దు చేయాలని ప్రయత్నించారు, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా తన నిర్ణయాన్ని అమలులోకి తెచ్చారు.

Diversity Visa

అయితే ఈ నిర్ణయం భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన చాలామందిలో ఉంది. కానీ నిపుణుల విశ్లేషణ ప్రకారం, భారతీయులకు ఈ నిర్ణయం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే డైవర్సిటీ వీసా(Diversity Visa) ప్రోగ్రామ్ అనేది అమెరికాకు తక్కువ మంది వలస వచ్చే దేశాల పౌరుల కోసం ఉద్దేశించింది. భారత్ నుంచి ప్రతి ఏటా లక్షలాది మంది అమెరికాకు వెళ్తుండటంతో, భారత్ ఇప్పటికే ఈ పథకానికి అనర్హుల జాబితాలో ఉంది. నిబంధనల ప్రకారం గత ఐదేళ్లలో 50 వేల కంటే ఎక్కువ మంది అమెరికాకు వలస వెళ్తే ఆ దేశం లాటరీకి పనికిరాదు. భారత్ ఈ పరిమితిని ఎప్పుడో దాటేసింది కాబట్టి, 2028 వరకు ఎలాగూ భారతీయులు ఈ లాటరీకి దరఖాస్తు చేసుకోలేరు.

Diversity Visa

కాబట్టి హెచ్ 1బీ (H-1B) లేదా హెచ్ 4 (H-4) వీసాల ద్వారా అమెరికాలో ఉన్న భారతీయులకు ఈ గ్రీన్ కార్డ్ లాటరీ రద్దుతో నేరుగా సంబంధం లేదు. కానీ ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి చూస్తుంటే, మున్ముందు ఇతర వీసాల జారీలో కూడా మరింత కఠినత ఉండే అవకాశం కనిపిస్తోంది. అక్రమ వలసదారులను ఏరివేసే ప్రక్రియలో భాగంగా ట్రంప్ తీసుకుంటున్న ఈ వరుస నిర్ణయాలు అమెరికాలో ఉండాలనుకునే విదేశీయుల్లో కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. ఏదేమైనా భద్రతా కారణాల వల్ల తాజాగా అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version