Greenland
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాలను వేడెక్కించారు. ఆర్కిటిక్ ప్రాంతంలోని వ్యూహాత్మక ద్వీపం గ్రీన్‌ల్యాండ్(Greenland)పై అమెరికా నియంత్రణను అంగీకరించని దేశాలపై భారీ సుంకాలు విధిస్తామని తాజాగా ట్రంప్ హెచ్చరించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. జనవరి 16, 2026న.. వైట్ హౌస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గ్రీన్‌ల్యాండ్ (Greenland) విషయంలో తమకు సహకరించని దేశాలపై ఆర్థిక ఆంక్షలతో పాటు దిగుమతి సుంకాలు విధిస్తానని, జాతీయ భద్రత దృష్ట్యా అమెరికాకు గ్రీన్‌ల్యాండ్ స్వాధీనం చాలా అవసరమని ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవైపు ఉద్రిక్తతలను తగ్గించడానికి కోపెన్‌హాగన్‌లో అమెరికా ప్రతినిధి బృందం చర్చలు జరుపుతున్న సమయంలోనే ట్రంప్ ఇలాంటి కఠినమైన హెచ్చరికలు చేయడం గమనార్హం.
ట్రంప్ మైండ్‌సెట్‌ను గమనిస్తే .. అంతర్జాతీయ సంబంధాలను ఎప్పుడూ కూడా ఒక వ్యాపార ఒప్పందంగా (బిజినెస్ డీల్) చూస్తారనేది స్పష్టమవుతోంది. 2019లో డెన్మార్క్‌ను గ్రీన్‌ల్యాండ్ విక్రయించమని అడిగినప్పటి నుంచి ఆయన ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. గ్రీన్‌ల్యాండ్‌ను ఒక రియల్ ఎస్టేట్ ఆస్తుల లాగా భావించే ట్రంప్, తన పవర్ , డామినెన్స్ ను ప్రదర్శించడానికి ఆర్థికపరమైన ఒత్తిడిని ప్రధాన ఆయుధంగా వాడుకుంటున్నారు.
ఎవరైతే తన నిర్ణయాలకు మద్దతు ఇస్తారో వారికి సుంకాల నుంచి రాయితీలు ఇవ్వడం, వ్యతిరేకించే వారిపై పెనాల్టీలు వేయడం అనే ఎక్స్ఛేంజ్ లాజిక్ ను ఆయన అనుసరిస్తున్నారు. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి వచ్చే కార్లు, ఇతర ఉత్పత్తులపై 10 నుంచి 25 శాతం వరకు సుంకాలు పెంచే అవకాశం ఉందని ట్రంప్ ఇన్ డైరక్ట్‌గా చెప్పారు.
జాతీయ భద్రత అనే కార్డును ట్రంప్ ఇక్కడ బలంగా వాడుతున్నారు. ఆర్కిటిక్ మహాసముద్రంలో రష్యా , చైనా ఉనికి పెరుగుతున్న సమయంలో గ్రీన్‌ల్యాండ్ (Greenland) అమెరికాకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని అమెరికా అధ్యక్షుడు నమ్ముతున్నారు. అక్కడ ఉన్న థులే ఎయిర్‌బేస్ అమెరికా మిస్సైల్ ట్రాకింగ్ , రాకెట్ డిఫెన్స్ వ్యవస్థలకు అత్యంత కీలకం.
రష్యా వద్ద ఉన్న 50కి పైగా ఐస్‌బ్రేకర్లు ,అలాగే చైనా చేపట్టిన పోలార్ సిల్క్ రోడ్ ప్రాజెక్టులకు చెక్ పెట్టాలంటే గ్రీన్‌ల్యాండ్ పై అమెరికా జెండా ఎగరాల్సిందే అనేది ట్రంప్ వాదన. దీని కోసం నాటో దేశాలపై కూడా ఆయన ఒత్తిడి పెంచుతున్నారు. డెన్మార్క్ వంటి దేశాలు తమ రక్షణ బడ్జెట్ లో తక్కువగా ఖర్చు చేస్తున్నాయని, ఆ భారాన్ని అమెరికా మోయడం సాధ్యం కాదని ట్రంప్ పదే పదే గుర్తు చేస్తున్నారు.
అయితే ట్రంప్ అనుసరిస్తున్న ఈ ప్రతీకార చర్యలు అంతర్జాతీయ దౌత్యానికి కొత్త సవాళ్లు విసురుతున్నాయి. పబ్లిక్ షేమింగ్ , సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడం ద్వారా ఆయన ప్రత్యర్థులను ఒత్తిడికి గురిచేస్తారు. వెనిజులా వంటి దేశాల్లో అమెరికా సాధించిన విజయాల తర్వాత ట్రంప్ ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది.
దీనివల్ల ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు గ్రీన్‌ల్యాండ్ కు తమ దళాలను పంపడం వంటి కౌంటర్ చర్యలకు దిగుతున్నాయి. రష్యా కూడా దీనిని అమెరికా సామ్రాజ్యవాదంగా అభివర్ణిస్తూ తీవ్రంగా విమర్శించింది. మొత్తానికి ట్రంప్ మైండ్‌సెట్ అనేది అధికారం , ఆర్థిక బలం చుట్టూ తిరుగుతోంది. ఒకవేళ ఈ గ్రీన్‌ల్యాండ్ డీల్ వర్కవుట్ అయితే ఆయన ఇమేజ్ మాస్టర్ డీల్ మేకర్‌గా మారుతుంది, లేదంటే యూరోపియన్ దేశాలతో అమెరికాకు ఉన్న బంధం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది.
Iran vs Israel : ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్, అమెరికా..మిడిల్ ఈస్ట్ లో యుద్ధమేఘాలు
