Spiders
సాలెపురుగుల(Spiders) ఇంద్రియ సామర్థ్యాలపై శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన ఒక విప్లవాత్మక పరిశోధన, ఈ అరాక్నిడ్‌లు (Arachnids) తమ పరిసరాల వాసనలను ఎలా గ్రహిస్తాయో అనే పాత ప్రశ్నకు పరిష్కారం చూపింది. కీటకాల మాదిరిగా యాంటెన్నా లేని సాలెపురుగులు(Spiders), ముఖ్యంగా ఫెరోమోన్‌ల వంటి సున్నితమైన రసాయన సంకేతాలను గాలిలో ఎలా గుర్తించగలవనేది చాలా కాలంగా ఒక అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.
తాజాగా, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, ఈ రహస్యం సాలెపురుగుల కాళ్లపై ఉన్న ప్రత్యేకమైన వెంట్రుకల్లో దాగి ఉందని వెల్లడైంది. పరిశోధకులు వయోజన మగ సాలెపురుగులైన (ఆర్జియోప్ బ్రూయెన్నిచి – Argiope bruennichi) కాళ్లపై ‘వాల్-పోర్ సెన్సిల్లా’ అని పిలువబడే ఘ్రాణ వెంట్రుకలను గుర్తించారు. ఈ సూక్ష్మ నిర్మాణాలు ఫెరోమోన్‌లను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వారు నిర్ధారించారు.
హై-రిజల్యూషన్ స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ ద్వారా పరిశీలించినప్పుడు, ఈ సెన్సిల్లాలు వేలాదిగా కనిపించాయి. ముఖ్యంగా ఈ వెంట్రుకలు కేవలం వయోజన మగ సాలెపురుగులలో మాత్రమే ఉండటం విశేషం. ఆడ సాలెపురుగులలో, చిన్న మగ సాలెపురుగులలో ఇవి లేవు. దీని బట్టి, ఈ సెన్సిల్లాలు ఆడ సాలెపురుగులు విడుదల చేసే సెక్స్ ఫెరోమోన్‌లను గ్రహించి, సంభావ్య సహచరుడిని గుర్తించడంలో అత్యంత కీలకమని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ అధ్యయనం గతంలో సాలెపురుగులలో లేదని భావించిన అంతుచిక్కని ఘ్రాణ వ్యవస్థను మ్యాప్ చేసి, గుర్తించడం ఒక గొప్ప పురోగతిగా చెబుతున్నారు.
ప్రయోగాలలో, ఈ సెన్సిల్లాలు ఫెరోమోన్ సమ్మేళనాలకు ఎంత సున్నితంగా స్పందిస్తాయో వెల్లడైంది. కేవలం 20 నానోగ్రాముల చిన్న మొత్తంలో ఉన్న ఫెరోమోన్ పదార్థానికి కూడా అవి గణనీయమైన నాడీ సంబంధిత ప్రతిస్పందనలను (Neural Responses) కలిగించాయి. ఇది సాలెపురుగుల ఘ్రాణ వ్యవస్థలు కీటకాలలో కనిపించే అత్యంత సున్నితత్వానికి పోటీగా నిలుస్తాయని తేలింది.
ఈ పరిశోధన కేవలం ఒక్క జాతికే పరిమితం కాలేదు. పరిశోధకులు అదనంగా 19 ఇతర సాలెపురుగు జాతులపై కూడా ఇదే అధ్యయనం సాగించారు. ఇందులో కూడా చాలా మగ సాలెపురుగులలో వాల్-పోర్ సెన్సిల్లాను గుర్తించారు. ఈ లక్షణం కాలక్రమేణా పలు దఫాలుగా పరిణామం చెందిందని, అలాగే కొన్ని ఆదిమ జాతులలో ఈ నిర్మాణాలు లేవని కూడా వారు నిర్ధారించారు. ఈ పరిశోధన, సాలెపురుగుల ప్రవర్తనను నియంత్రించే అధునాతన ఇంద్రియ విధానాలను అర్థం చేసుకోవడానికి ఒక పునాది లాంటిదిగా చెప్పుకోవచ్చు.
భవిష్యత్తులో ఆడ సాలెపురుగులు వాసనలను ఎలా గుర్తిస్తాయో, సాలెపురుగులలో వాసన యొక్క పరిణామ క్రమం ఎలా ఉందనే అంశాలపై పరిశోధనలు కొనసాగనున్నాయి. ఈ అధ్యయనం ద్వారా వెలుగులోకి వచ్చే అంశాలు జీవశాస్త్ర ప్రపంచానికి ఎంతో ఉపయుక్తంగా మారనున్నాయి.