Tea: జపనీస్ సెన్చా నుంచి కశ్మీరీ చాయ్ వరకు ..హైదరాబాద్‌లో గ్లోబల్ టీ కల్చర్

Tea: కాఫీ కంటేకూడా టీకే ఎక్కువ ఓటేస్తున్నారు. ఇళ్లలో 89 శాతం మంది టీ తాగుతుండగా, కేవలం 8 శాతం మంది మాత్రమే కాఫీ తాగుతున్నారు.

Tea

హైదరాబాద్‌లో టీ అంటే అది ఒక ఎమోషన్. హైదరాబాద్‌కు, చాయ్‌కు ఉన్న అనుబంధం ఈ నాటిది కాదు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ బంధం ఇప్పుడు మరింత గట్టిపడింది. ఒకప్పుడు ఇరానీ చాయ్(Irani chai), బన్ మస్కాతో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు వందల రకాల టీలకు చేరుకుంది.

కేవలం ఐదు రూపాయల నుంచి వేల రూపాయల వరకు ధర ఉన్న టీలు ఇప్పుడు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇది కేవలం రుచికి సంబంధించిన విషయం కాదు, మన సంస్కృతి, జీవనశైలిలో టీకి ఉన్న స్థానాన్ని ఇది తెలియజేస్తుంది.

తలసరి టీ (Tea) వినియోగంలో హైదరాబాదీలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనలో వెల్లడైంది. ఒక్కొక్కరు సగటున 302 గ్రాముల టీ వినియోగిస్తున్నారట.

ఓ పరిశోధన ప్రకారం కాఫీ కంటేకూడా టీకే ఎక్కువ ఓటేస్తున్నారు. ఇళ్లలో 89 శాతం మంది టీ తాగుతుండగా, కేవలం 8 శాతం మంది మాత్రమే కాఫీ తాగుతున్నారు.

Tea

నగరంలో టీ (Tea) మాస్టర్లకు మంచి డిమాండ్ ఉంది. వారికి నెలకు రూ.20,000 నుంచి రూ.30,000 వరకు వేతనం ఇస్తున్నారంటే టీ షాపులకు ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు.

ఒకప్పుడు చిన్న వ్యాపారంగా భావించిన టీ అమ్మకం ఇప్పుడు ఒక భారీ ఫ్రాంచైజీల వ్యాపారంగా మారిపోయింది. రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు చెల్లించి ఫ్రాంచైజీలు తీసుకుని ఎంతోమంది యువ పట్టభద్రులు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు.

మిస్టర్ టీ(Mr Tea brand) వంటి బ్రాండ్లు అనతికాలంలోనే కోట్ల రూపాయల టర్నోవర్‌కు చేరుకోవడం దీనికి నిదర్శనం. కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ వంటివారు కూడా ఈ వ్యాపారంలో ఉన్నారు. ఈ కొత్త తరం పారిశ్రామికవేత్తలు టీ ప్రియులను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల టీలను పరిచయం చేస్తున్నారు.

హైదరాబాద్‌లో లభిస్తున్న టీ రకాలు చాలా అరుదైనవి, విలక్షణమైనవి. వాటిలో కొన్ని చాయ్‌లను చూద్దాం.

గోల్డెన్ టిప్స్ బ్లాక్ టీ ధర ఒక్క కప్పు ఏకంగా రూ.1000 వరకు ఉంటుంది. అయినా దీనికి గిరాకీ మాత్రం తగ్గడం లేదు.

ఉలాంగ్, సిల్వర్ నీడిల్ వైట్‌ టీ, జపనీస్ సెన్చా, మొరాకన్ మింట్‌ వంటి ప్రీమియం రకాలు రూ.300 నుంచి అరుదైన చాయ్‌లు ఎప్పుడూ అందుబాటులో ఉన్నాయి.

అలాగే తందూరీ మట్కా చాయ్, రాయల్ మచా, సంజీవని, ఇండియన్ స్పైస్, గ్రీన్ చాయ్, ఇలాచీ చాయ్, బాదం టీ, కశ్మీరీ చాయ్, బెల్లం చాయ్, లెమన్ టీ వంటి ఎన్నో రకాలు నగరవాసులకు కొత్త అనుభూతులు పంచుతూనే ఉంటాయి.

Tea

కొత్త ట్రెండ్స్ అయిన పిప్పర్ మింట్, తులసి మింట్, జెస్టీ జింజర్, రెడ్ జెన్, రష్యన్ కారవన్ వంటి కొత్త రుచులు కూడా యూత్‌ను తెగ ఆకర్షిస్తున్నాయి.

హైదరాబాద్‌లో టీ అనేది ఒక సామాన్య పానీయం కాదు, ఒక సెంటిమెంట్..ఒకఫీల్..ఒక అనుబంధం . అందుకే ..ఈ టీ కల్చర్(Hyderabad tea culture) నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపును తెస్తోంది.

Exit mobile version