Guilt
కొందరికి ఎక్కువగా గిల్ట్ (Guilt)ఫీలింగ్ ఉంటుంది. మంచి మనసే భారంగా మారే మానసిక కథచిన్న తప్పు చేసినా, ఎవరికైనా కాస్త మాట తప్పుగా అనిపించినా, లేదా మన చేతుల్లో లేని పరిస్థితి వల్ల ఏదైనా అపశ్రుతి జరిగితే.. కొందరు వెంటనే నాదే తప్పు అని కుంగిపోతుంటారు. అదే ఆలోచిస్తూ బాధపడతారు.
నిజానికి వాళ్లు చెడ్డవాళ్లు కాదు, చెప్పాలంటే వాళ్లే సమాజంలో ఎక్కువగా బాధపడే అతి మంచి మనుషులు. కానీ అదే మంచితనం ఒక దశలో గిల్ట్ (అపరాధభావం) గా మారి మనసును అంచుల్లేని భారంతో ముంచెత్తుతుంది. అసలు ఈ గిల్ట్ ఫీలింగ్ కొందరిలోనే ఎందుకు అంత బలంగా ఉంటుంది?
సైకాలజీ ప్రకారం, గిల్ట్ (Guilt)ఫీలింగ్ అనేది మనలోని అతి బాధ్యతాభావం నుంచి పుడుతుంది. నేను ఇలా చేయాల్సింది, నేను అలా ఉండాల్సింది అనే అంతర్గత అంచనాలు ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో, వాళ్లకు ఈ గిల్ట్ ఎక్కువగా వస్తుంది. వీళ్లు తమకు తాము కొన్ని కఠినమైన ప్రమాణాలు పెట్టుకుంటారు.
ఆ స్టాండర్డ్స్‌కు తగ్గట్టు ఏ చిన్న విషయం జరగకపోయినా, బయట వాళ్లు ఏమీ అనకపోయినా, లోపలే తమను తాము తీవ్రంగా శిక్షించుకుంటారు. దీనికి తోడు చిన్ననాటి అనుభవాలు కూడా ఒక కారణం. చిన్నప్పటి నుంచి నీ వల్లే ఇలా అయింది లేదా నీ తప్పే అనే మాటలు ఎక్కువగా విన్న పిల్లల్లో గిల్ట్ ఫీలింగ్ మనసు లోపల ఒక ముల్లులా పాతుకుపోతుంది.
కొంతమందిలో గిల్ట్ పెరగడానికి ఇతరులను బాధ పెట్టకూడదు అనే అతి సెన్సిటివ్ ఆలోచన కూడా కారణమే. ఎవరి ముఖంలో చిన్న మార్పు కనిపిస్తున్నా నేను ఏదైనా తప్పు చేశానేమో అని మదనపడిపోతుంటారు. నిజానికి అవతలి వ్యక్తికి వేరే ఏదైనా సమస్య ఉండొచ్చు, కానీ గిల్ట్ ఉన్నవాళ్లు ప్రతి విషయాన్ని తమకే లింక్ చేసుకుంటారు.
అలాగే, మన చేతుల్లో లేని విషయాలకు కూడా బాధ్యత తీసుకోవడం వల్ల మనసు అలసిపోతుంది. గిల్ట్ రెండు రకాలు.. ఒకటి చేసిన తప్పును సరిదిద్దుకునేలా చేసే హెల్తీ గిల్ట్, రెండోది తప్పు లేకపోయినా మనల్ని మనం హింసించుకునే అన్ హెల్తీ గిల్ట్. గిల్ట్ నుంచి బయటపడటం అంటే తప్పులను మర్చిపోవడం కాదు, మనం మనుషులం అని గుర్తించి మనల్ని మనం క్షమించుకోవడం.
