Sugar
చాలా మంది చక్కెర(Sugar)ను కేవలం బరువు పెంచే, లేదా దంతాలను పాడుచేసే పదార్థంగానే చూస్తారు. కానీ, ఈ తీపి పదార్థం మన మెదడుపై, మరియు మానసిక ఆరోగ్యంపై కూడా ఎలాంటి తీవ్ర ప్రభావం చూపుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. చక్కెర అనేది మెదడులోని రివార్డు వ్యవస్థను నేరుగా ప్రేరేపిస్తుంది. మనం తీపి తినగానే, మెదడులో డోపమైన్ అనే సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చే హార్మోన్‌ను భారీగా విడుదల చేస్తుంది. ఈ ఆనందం తక్షణమే లభిస్తుంది కాబట్టి, మెదడు దానికి సులభంగా బానిసలం (Addiction) అవుతుంది. దీంతో ఆ తీపిని మళ్లీ మళ్లీ కోరుకోవడం మొదలవుతుంది.
నిరంతరం అధిక చక్కెర(Sugar) తీసుకున్నప్పుడు, మెదడులో వాపు (Inflammation) పెరుగుతుంది. దీన్ని ‘మెదడు మంట’ అని కూడా అంటారు. ఈ వాపు మన జ్ఞాపకశక్తిని, మరియు ఏకాగ్రతను తగ్గిస్తుంది. చక్కెర ఎక్కువగా తీసుకునే వారిలో నిరంతరం మూడ్ స్వింగ్స్ (Mood Swings), మరియు కారణం లేకుండా వచ్చే ఆందోళన (Anxiety) వంటి సమస్యలు కనిపిస్తాయి. మెదడులో చక్కెర స్థాయిలు వేగంగా పెరగడం, మళ్లీ అంతే వేగంగా పడిపోవడం వల్ల ఈ మానసిక అస్థిరత ఏర్పడుతుంది.
అయితే, చక్కెరను మానేయడం వల్ల మెదడులో అద్భుతమైన మార్పులు మొదలవుతాయి. మొదట్లో కొద్ది రోజులు తలనొప్పి, చిరాకు ఉన్నా, అవి మెదడు డోపమైన్‌కు అలవాటు పడటం నుంచి బయటపడుతున్న సంకేతాలు. కొద్ది రోజుల తర్వాత మెదడులో వాపు తగ్గి, న్యూరోట్రాన్స్‌మిటర్ల ఉత్పత్తి సమతుల్యం అవుతుంది. దీంతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి గణనీయంగా మెరుగుపడతాయి. ముఖ్యంగా, నిరంతరం చక్కెర కోసం మెదడు పడే ఆరాటం తగ్గి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. చక్కెర మానేయడం అనేది శరీరాన్ని మాత్రమే కాదు, మీ మెదడును పునరుద్ధరించడానికి (Reboot) ఉపయోగపడే ఒక శక్తివంతమైన విధానం.