Injections
చిన్నప్పుడు హాస్పిటల్‌లో సూదిని చూడగానే ఏడ్చే పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం. అది సహజమైన భయం. కానీ, కొంతమంది పెద్దవాళ్లకు కూడా ఇంజెక్షన్ (Injections)అంటే మాటల్లో చెప్పలేని భయం ఉంటుంది. డాక్టర్ సిరంజి పట్టుకోగానే గుండె దడ, చెమట పట్టడం, కళ్లు తిరగడం, చివరికి స్పృహ తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి తీవ్రంగా ఉంటే, హాస్పిటల్‌ను చూసి పారిపోయేంత భయం కూడా ఉంటుంది. వైద్య పరిభాషలో ఈ విపరీతమైన భయాన్ని ట్రిపనోఫోబియా అని పిలుస్తారు. ఇది కేవలం భయం మాత్రమే కాదు, ఒక రకమైన మానసిక సమస్య.
ట్రిపనోఫోబియా ఎందుకు వస్తుంది అంటే కచ్చితమైన కారణం చెప్పడం కష్టం. అయితే, కొన్ని అనుభవాలు ఈ ఫోబియాకు కారణం కావచ్చు. చిన్నప్పుడు ఇంజెక్షన్ (Injections) వేయించుకున్నప్పుడు కలిగిన భయంకరమైన అనుభవం, లేదా ఇంజెక్షన్ వేస్తున్నప్పుడు వేరొకరు బాధపడుతూ చూడటం వంటివి మనసులో బలంగా ముద్ర వేసుకుంటాయి. ఆ భయమే పెద్దయ్యాక ట్రిపనోఫోబియాగా మారవచ్చు.
సూదులతో జరిగిన ప్రమాదాలు, లేదా శస్త్రచికిత్స సమయంలో కలిగిన బాధాకరమైన అనుభవాలు ఈ భయాన్ని పెంచుతాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన చిన్నతనంలో సూది వల్ల తీవ్రమైన గాయం అయితే, అది అతని మనసులో శాశ్వతంగా ఉండిపోతుంది. కొన్నిసార్లు ఇది జన్యుపరంగా కూడా రావచ్చు అని వైద్యులు నమ్ముతారు. కుటుంబంలో ఎవరికైనా ఈ భయం ఉంటే, అది తర్వాతి తరాలకు సంక్రమించే అవకాశం ఉంటుంది.
ట్రిపనోఫోబియాతో బాధపడేవారు సొంతంగా భయాన్ని జయించడం చాలా కష్టం. ఈ సమస్యకు సరైన పరిష్కారం మానసిక వైద్యుడిని సంప్రదించడం. డాక్టర్లు వివిధ రకాల చికిత్సల ద్వారా రోగికి సహాయం చేస్తారు. డాక్టర్లు ఎక్స్‌పోజర్ థెరపీ (Exposure Therapy) వంటి పద్ధతులను ఉపయోగిస్తారు. ఇందులో రోగిని నెమ్మదిగా, భయాన్ని దూరం చేసేలా ఇంజెక్షన్ వాతావరణానికి అలవాటు చేస్తారు. మొదట సూది బొమ్మలు చూపించడం, తర్వాత నిజమైన సూదిని దూరంగా చూపించడం, ఆపై దగ్గరగా చూపించడం వంటి పద్ధతుల ద్వారా భయాన్ని తగ్గిస్తారు.
కేవలం డాక్టర్ చికిత్స మాత్రమే కాకుండా, రోగి కూడా తన భయాన్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి. తన భయానికి కారణాన్ని తెలుసుకోవడం, దానిని ఎదుర్కొనేందుకు ధైర్యం చేయడం చాలా ముఖ్యం. ఈ చికిత్సకు ఫోబియా తీవ్రతను బట్టి కొన్ని నెలల నుంచి సంవత్సరం వరకు పట్టవచ్చు. ఇంజెక్షన్ (Injections)అంటే భయపడటం ఒక బలహీనత కాదు, అది ఒక మానసిక సమస్య అని గుర్తించి, దానికి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. సరైన చికిత్స, పట్టుదలతో ఈ భయాన్ని పూర్తిగా జయించొచ్చు.