Sugar
మనిషి లైఫ్ స్టైల్ లో వచ్చిన మార్పుల వల్ల ఇప్పుడు ప్రతి ఇంటిలోనూ ఒకరు మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారు. చక్కెర (Sugar) తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయనే భయంతో తీపి పదార్థాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, అలాంటి వారి కోసం శాస్త్రవేత్తలు ఒక విప్లవాత్మకమైన ఆవిష్కరణ చేశారు.
అదే ‘టాగటోజ్’ (Tagatose). ఇది ఒక నేచురల్ చక్కెర. దీని స్పెషల్ ఏమిటంటే, ఇది మన సాధారణ పంచదార లాగే 90 శాతం తియ్యగా ఉంటుంది కానీ, దీని వల్ల రక్తంలో ఇన్సులిన్ లేదా గ్లూకోజ్ స్థాయిలు అస్సలు పెరగవు. ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలతో పోరాడుతున్న వారికి ఇది ఒక తీపి కబురు అని చెప్పొచ్చు.
సాధారణంగా మనం వాడే షుగర్లో (Sugar) క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వుగా మారి చాలా అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. కానీ టాగటోజ్ లో సాధారణ చక్కెరతో పోలిస్తే కేవలం 40 శాతం మాత్రమే క్యాలరీలు ఉంటాయి. మనం పండ్లు , కొన్ని రకాల మిల్క్ ప్రొడెక్ట్స్ తీసుకున్నప్పుడు అందులో ఈ టాగటోజ్ చాలా స్వల్ప పరిమాణంలో సహజంగానే మన బాడీకి అందుతుంది.
అయితే, దీనిని విడిగా సేకరించడం ఇప్పటివరకు చాలా ఖరీదైన, క్లిష్టమైన ప్రక్రియగా ఉండేది. కానీ తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు ఒక సులభమైన పద్ధతిని కనుగొన్నారు. పాలలో ఉండే ‘గెలాక్టోజ్’ అనే షుగర్‌ని కొన్ని ప్రత్యేకమైన ఎంజైమ్స్ సహాయంతో తక్కువ ఖర్చుతో టాగటోజ్ గా మార్చే విధానాన్ని వారు అభివృద్ధి చేశారు. దీనివల్ల భవిష్యత్తులో ఈ హెల్దీ షురగ్ తక్కువ ధరకే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
టాగటోజ్ వల్ల కేవలం షుగర్ (Sugar) లెవల్స్ పెరగకపోవడమే కాకుండా మరికొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. మనం సాధారణ చక్కెర తిన్నప్పుడు అది దంత క్షయానికి (పళ్లు పుచ్చిపోవడం) కారణమవుతుంది. కానీ ఈ సరికొత్త చక్కెర వల్ల దంతాలకు ఎటువంటి హాని కలగదు. ఆహార, శీతల పానీయాల పరిశ్రమలో ఈ ఆవిష్కరణ ఒక పెద్ద మార్పు తీసుకురానుంది.
ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న షుగర్ ఫ్రీ స్వీట్లు లేదా డ్రింక్స్ లో వాడే ఆర్టిఫిషియల్ తీపి పదార్థాలు (Artificial Sweeteners) ఆరోగ్యానికి మంచివి కావని కొందరు భావిస్తుంటారు. అయితే టాగటోజ్ అనేది సహజమైనది కాబట్టి దీనిని నిశ్చింతగా వాడొచ్చు. కూల్ డ్రింక్స్, చాక్లెట్లు, బిస్కెట్లు, మిఠాయిల్లో దీనిని వాడటం వల్ల రుచిలో ఎటువంటి తేడా రాకుండానే మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
భవిష్యత్తులో మనం ఇష్టమైన స్వీట్లను తింటూనే షుగర్ గురించి భయం లేకుండా ఉండాలంటే టాగటోజ్ ఒక చక్కని ప్రత్యామ్నాయం. ఇప్పటికే దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ , ఉత్పత్తి దశ పనులు వేగంగా జరుగుతున్నాయి.
తక్కువ ఖర్చుతో తయారీ విధానం అందుబాటులోకి రావడంతో, అతి త్వరలోనే ఇది మన వంటింట్లోకి కూడా వచ్చే అవకాశం ఉంది. షుగర్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గిస్తూ, రుచిలో ఎక్కడా రాజీ పడకుండా తీపిని ఆస్వాదించడానికి శాస్త్రవేత్తలు చేసిన ఈ కృషి అభినందనీయం. ఇది అందుబాటులోకి వస్తే డయాబెటిస్ కంట్రోల్‌లో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.
Robotaxi:కొద్ది రోజుల్లోనే డ్రైవర్ లేని ప్రయాణం..రోబోటాక్సీలు ఎలా పనిచేస్తాయి?
