Robotaxi
టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పుడు వినిపిస్తున్న అత్యంత ఇంట్రస్టింగ్ పేరు రోబోటాక్సీ (Robotaxi). ఇప్పటివరకు మనం టాక్సీ కావాలంటే ఫోన్లో బుక్ చేసుకుంటే ఒక డ్రైవర్ వచ్చి మనల్ని తీసుకెళ్తున్నారు. కానీ ఇప్పుడు డ్రైవర్ అవసరం లేకుండానే కారు తనంతట తానుగా వచ్చి, మనల్ని ఎక్కించుకుని గమ్యస్థానానికి చేర్చే రోజులు వచ్చేస్తున్నాయి.
టెస్లా, వేమో (Waymo) వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఇప్పటికే ఈ సాంకేతికతను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. రోబోటాక్సీలు పూర్తిగా కృత్రిమ మేధస్సు (AI), అధునాతన సెన్సార్ల సహాయంతో నడుస్తాయి. కారు చుట్టూ ఉండే కెమెరాలు, లిడార్ (LiDAR) సెన్సార్లు రోడ్డుపై ఉన్న ప్రతి చిన్న వస్తువును, మనుషులను , ఇతర వాహనాలను గుర్తిస్తాయి. ఇది మనిషి కంటే వేగంగా రియాక్టయి యాక్సిడెంట్స్‌ను కూడా నివారించగలదని టెక్ నిపుణులు చెబుతున్నారు.
సాంకేతికంగా చూస్తే ఈ రోబోటాక్సీల వల్ల ట్రాన్స్ పోర్టులో పెద్ద మార్పులు రాబోతున్నాయి. ఈ కారులో స్టీరింగ్ వీల్ లేదా పెడల్స్ ఉండవు, కాబట్టి లోపల కూర్చున్నవారికి ఎక్కువ ప్లేస్ లభిస్తుంది. కారును ఒక కదిలే ఆఫీస్ లాగా లేదా ఒక సినిమా థియేటర్ లాగా కూడా వాడుకోవచ్చు.
ఈ వాహనాలు పూర్తిగా విద్యుత్ (Electric)తో నడవడం వల్ల పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో లేదా వర్షం పడుతున్నప్పుడు మనుషులు డ్రైవింగ్ చేసినప్పుడు తప్పులు చేసే అవకాశం ఉంటుంది, కానీ ఏఐ తో నడిచే ఈ కార్లు ఎలాంటి అలసట లేకుండా కచ్చితత్వంతో పనిచేస్తాయి. ఇప్పటికే అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో వంటి నగరాల్లో వేల సంఖ్యలో రోబోటాక్సీలు సామాన్య ప్రజలకు సేవలందిస్తున్నాయి. ఇది కేవలం ఒక ప్రయోగం కాదు, రవాణా వ్యవస్థలో ఒక విప్లవంగా చెప్పొచ్చు.
అయితే ఈ రోబోటాక్సీల వల్ల కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి.దీనివల్ల డ్రైవర్ల ఉపాధి దెబ్బతినడం, ట్రాఫిక్ నిబంధనల అమలు, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. కానీ టెక్ కంపెనీలు మాత్రం భవిష్యత్తులో వాహనాలను సొంతంగా కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా, అందరికీ చౌకగా ప్రయాణ సౌకర్యం కల్పించడమే తమ లక్ష్యమని చెబుతున్నాయి.
మనం ఇంట్లో కూర్చుని ఒక యాప్ ద్వారా కారును పిలిపిస్తే, అది మన తలుపు దగ్గరికి వచ్చి ఆగుతుంది. ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా ఉన్నా, ఇది ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణం కాబోతోంది. భారతదేశంలో కూడా బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో దీనికి సంబంధించిన ట్రయల్స్ , మ్యాపింగ్ పనులు ప్రారంభమయ్యాయి. రోబోటాక్సీల రాకతో రోడ్డు ప్రమాదాలు తగ్గి, ప్రయాణం మరింత ఈజీ అండ్ సేఫ్టీ జర్నీ కానుంది.
Japanese:జపాన్ ప్రజల లాంగ్ అండ్ హెల్దీ లైఫ్ సీక్రెట్ ఇదేనట.. మీరూ ట్రై చేయండి..
