Inferiority complex
మన జీవితంలో మనం అనుభవించే అన్ని సమస్యల్లోకెల్లా అత్యంత ప్రమాదకరమైనవి, మనలోని ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేసేవి కొన్ని మానసిక రుగ్మతలు. అవి మనల్ని ఎప్పటికీ ముందుకు అడుగు వేయకుండా ఆపుతాయి. చాలామంది ఈ సమస్యలను గుర్తించలేరు, కానీ అవి మనల్ని నిశ్శబ్దంగా లోపల నుంచి తినేస్తాయి. అలాంటి రెండు ముఖ్యమైన భావనలే ఇన్‌ఫిరియారిటీ కాంప్లెక్స్ (Inferiority Complex) ,ఇంపోస్టర్ సిండ్రోమ్ (Imposter Syndrome).
ఇన్‌ఫిరియారిటీ కాంప్లెక్స్(Inferiority complex హీన భావన )అంటే మనం ఇతరుల కంటే తక్కువ అని, ఎప్పటికీ అందరి కంటే వెనకబడి ఉన్నామని అనిపించుకోవడం. ఈ భావనకు మూలం చిన్నతనంలోనే ఉంటుంది. తల్లిదండ్రులు ఒక బిడ్డను మరో బిడ్డతో పోల్చడం, “నీ సోదరుడు బాగా చదువుతాడు, నువ్వు కాదు” అని చెప్పడం వంటి పోలికలు మనసులో లోతుగా నాటుకుపోయి ఈ భావన మరింత పెరుగుతుంది. ఈ ఫీల్ ఉన్నప్పుడు మన మెదడులో భయానికి కేంద్రమైన అమ్యగ్డలా అనే భాగం ఎక్కువగా పనిచేస్తుంది. దానివల్ల ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసోల్ ఎక్కువగా విడుదల అవుతుంది, ఇది ఆత్మగౌరవాన్ని తగ్గిస్తుంది. ఈ భావనలో ఉన్నవారు ఎప్పటికీ తక్కువగా అనిపించడం, ఇతరుల విజయాలను చూసి పోల్చుకోవడంతో పాటు ఎలాంటి రిస్క్‌లు తీసుకోరు.
ఇక, ఇంపోస్టర్ సిండ్రోమ్ (విజయంపై అనుమానం) అనేది మనం సాధించిన విజయాన్ని మనమే అర్హులం కాదని, ఏదో ఒక రోజు మన నిజం బయటపడుతుందని భయపడటం. ఈ భావన ఎక్కువగా ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తుల్లో కనిపిస్తుంది. ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థల విద్యార్థుల్లో, డాక్టర్లలో ఈ సమస్య ఉంటుంది. విజయం సాధించినా కూడా వారి మెదడులో ఆనందాన్ని కలిగించే రసాయనం డోపమైన్ తక్కువగా విడుదల అవుతుంది. అందుకే వారి మెదడు ఈ విజయం నీ కష్టం వల్ల వచ్చింది కాదు, కేవలం అదృష్టం వల్లే”అని నమ్మేలా చేస్తుంది. ఈ భావన ఉన్నవారు తమ విజయాన్ని అంగీకరించరు, అభినందనలు విన్నా నమ్మరు, ఎప్పుడూ విఫలమవుతామనే భయంతో ఉంటారు.
ఈ రెండింటి మధ్య తేడా ఏంటంటే..హీన భావనలో ఉన్నవారు నేనే తక్కువ అనుకుంటారు, కానీ విజయంపై అనుమానం ఉన్నవారు నా విజయాలు నావి కావని భావిస్తారు. ఈ సమస్యలు వేర్వేరు అయినా, రెండింటికీ పరిష్కారం ఒకటే.
ఇన్‌ఫిరియారిటీ కాంప్లెక్స్(Inferiority complex)ను ఎలా అధిగమించాలి అంటే..ఈ రెండింటికీ ప్రధాన పరిష్కారం మనల్ని మనం అర్థం చేసుకోవడం, మన విజయాలను నిజంగా స్వీకరించడం. ఈ ఫీలింగ్‌ను అధిగమించడానికి, మన ప్రతికూల ఆలోచనలను సవాలు చేసి, సానుకూల విశ్వాసాలను పెంపొందించుకోవాలి. అలాగే, మన శరీరాన్ని, మన సామర్థ్యాలను ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించాలి. చిన్న చిన్న విజయాలను కూడా లెక్కించుకుని ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. రోజూ మన బలాలు రాసుకుంటే మెదడులోని నాడీ వ్యవస్థ యాక్టివ్ అవుతుంది..
ఇక, ఇంపోస్టర్ సిండ్రోమ్‌ను అధిగమించడానికి, “నా కష్టం వల్లే విజయం వచ్చింది” అని మనకు మనం గుర్తు చేసుకోవాలి. మన భావాలను స్నేహితులు, మార్గదర్శకులతో పంచుకుంటే మానసిక ఒత్తిడి 70% తగ్గుతుంది. ఎప్పుడూ సంపూర్ణంగా ఉండాలని కాకుండా, తప్పులు చేయడం కూడా నేర్చుకునే ప్రక్రియలో భాగమే అని అంగీకరించాలి. అలాగే, మన విజయాన్ని మానసికంగా ఊహించుకుంటే మెదడుకు మనం ఆ విజయానికి అర్హులమని భావన కలుగుతుంది. ఈ రెండింటినీ అధిగమించగలిగితే, మనం ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని గడపొచ్చు.