Intermittent fasting
ఇప్పుడు చాలామంది దగ్గర ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్(Intermittent fasting) పేరు తరచుగా వింటున్నాం. ఇంకా చెప్పాలంటే ఆరోగ్యంగా ఉండటానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఒక శక్తివంతమైన సాధనంగా మారింది. ఇది మీరు ఏం తినాలని చెప్పదు, కానీ ఎప్పుడు తినాలని మాత్రమే చెబుతుంది.
సాధారణంగా 16 గంటలు ఉపవాసం ఉండి, మిగిలిన 8 గంటల వ్యవధిలో ఆహారం తీసుకునే ’16:8′ పద్ధతి అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ ఉపవాస సమయంలో శరీరం ‘ఆటోఫాగీ’ అనే ప్రక్రియను ప్రారంభిస్తుందట.
అంటే శరీరంలోని కణాలు తమంతట తాముగా చెడిపోయిన భాగాలను శుభ్రం చేసుకుని, కొత్త కణాలను పునరుద్ధరించుకుంటాయట. దీనివల్ల వయస్సు పెరిగే ప్రక్రియ (Aging) నెమ్మదిస్తుంది అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
బరువు తగ్గాలనుకునే వారికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఒక గొప్ప వరం అని చెప్పొచ్చు. మనం నిరంతరం తింటూ ఉండటం వల్ల బాడీలో ఇన్సులిన్ స్థాయిలు ఎప్పుడూ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల కొవ్వు కరగదు. కానీ ఉపవాస సమయంలో ఇన్సులిన్ తగ్గి, నిల్వ ఉన్న కొవ్వు ఎనర్జీగా మారుతుంది.
అయితే ఈ (Intermittent fasting)పద్ధతి పాటించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఉపవాస సమయంలో కేవలం నీరు, బ్లాక్ కాఫీ లేదా గ్రీన్ టీ మాత్రమే తీసుకోవాలి. ఆహారం తీసుకునే 8 గంటల సమయంలో జంక్ ఫుడ్ తినకుండా, పౌష్టికాహారం తీసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. గర్భిణీలు, చిన్న పిల్లలు , తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా లేకుండా దీన్ని అస్సలు చేయకూడదు. ఇది కేవలం డైట్ కాదు, ఒక జీవనశైలి అని గుర్తు పెట్టుకుంటే మంచిది.
