Tired
అలసట అనేది సాధారణంగా అందరికీ వచ్చేదే. కానీ, కొన్నిసార్లు ఈ అలసట ఎంత తీవ్రంగా ఉంటుందంటే, అది విశ్రాంతితో, నిద్రతో కూడా తగ్గదు. ఇలాంటి పరిస్థితినే క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ (Chronic Fatigue Syndrome – CFS) లేదా మయాల్జిక్ ఎన్సెఫలోమైలైటిస్ (Myalgic Encephalomyelitis – ME) అని అంటారు. ఇది కేవలం అలసట మాత్రమే కాదు, రోగి సాధారణ జీవితాన్ని గడపకుండా అడ్డుకునే ఒక తీవ్రమైన, సంక్లిష్టమైన వైద్య పరిస్థితి. ఈ సిండ్రోమ్ గురించి చాలామందికి తెలియదు, అందుకే దీనిని గుర్తించడం కష్టమవుతుంది.
క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ (CFS)తో బాధపడేవారు రోజువారీ పనులైన బ్రష్ చేసుకోవడం, నడవడం వంటి వాటికి కూడా చాలా కష్టపడతారు. దీనికి కారణం ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. వైరల్ ఇన్ఫెక్షన్లు ఉదాహరణకు, ఎప్స్టీన్-బార్ వైరస్, రోగనిరోధక వ్యవస్థలో సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, తీవ్రమైన ఒత్తిడి వంటివి దీనికి కారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.
లక్షణాలు.. నిద్ర తర్వాత కూడా తీవ్రమైన అలసట(Tired), విశ్రాంతి తీసుకున్నా సరే తగ్గదు.కొద్దిపాటి శ్రమ తర్వాత కూడా విపరీతమైన అలసట అంటే పోస్ట్-ఎక్సెర్షనల్ మలైస్ (Post-Exertional Malaise). ఏకాగ్రత లోపించడం, జ్ఞాపకశక్తి మందగించడం (దీన్ని బ్రెయిన్ ఫాగ్ అని కూడా అంటారు). కండరాల నొప్పి, కీళ్ల నొప్పులు, గొంతు నొప్పి, నిద్రలేమి లేదా సరిగ్గా నిద్ర పట్టకపోవడం.నిలబడినప్పుడు తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
CFS కు పూర్తి నివారణ లేకపోయినా, లక్షణాలను తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. శారీరక వ్యాయామాలను నెమ్మదిగా, జాగ్రత్తగా మొదలుపెట్టడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం, నిద్రను మెరుగుపరచుకోవడం ద్వారా కొంత ఉపశమనం లభిస్తుంది. ఈ వ్యాధికి సరైన నిర్ధారణ, చికిత్స కోసం వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి.