Insomnia
మంచి నిద్ర ఆరోగ్యానికి చాలా ముఖ్యం. కానీ, ఆధునిక జీవనశైలిలో చాలామందికి నిద్ర ఒక సవాలుగా మారింది. రాత్రి పూట నిద్రలేమి ఒత్తిడి, మానసిక అనారోగ్యంతో పాటు అనేక శారీరక సమస్యలకు దారితీస్తుంది.
నిద్రలేమి(Insomnia) వల్ల మన శరీరం, మెదడుకు కావాల్సిన విశ్రాంతి లభించదు. ఇది ఏకాగ్రతను తగ్గించి, చిరాకు, అలసట, జ్ఞాపకశక్తి లోపం వంటి సమస్యలను కలిగిస్తుంది. దీర్ఘకాలికంగా నిద్రలేమి గుండె జబ్బులు, అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.
మంచి నిద్ర కోసం మార్గాలు:
- రోజూ ఒకే సమయానికి పడుకుని, ఒకే సమయానికి లేవడాన్ని అలవాటు చేసుకోవాలి. దీనివల్ల శరీరానికి ఒక బయోలాజికల్ క్లాక్ ఏర్పడుతుంది.
- నిద్రకు సరైన వాతావరణం ఉండేలా అంటే.. పడుకునే గది ప్రశాంతంగా, చీకటిగా, చల్లగా ఉండేలా చూసుకోవాలి. పరుపు సౌకర్యవంతంగా ఉండాలి.
- గాడ్జెట్లను దూరం పెట్టాలి. పడుకోవడానికి ఒక గంట ముందు ఫోన్, టీవీ, ల్యాప్టాప్ వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటి నుంచి వచ్చే నీలి కాంతి (Blue Light) నిద్రను దెబ్బతీస్తుంది.
- రాత్రి పూట టీ, కాఫీ, శీతల పానీయాలు తీసుకోవడం మానుకోవాలి.పడుకోవడానికి ముందు ధ్యానం చేయడం, రిలాక్సింగ్ యోగా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారి మంచి నిద్ర పడుతుంది. మంచి నిద్ర మన శరీరానికి, మనసుకు చేసే ఒక పెద్ద సహాయం. దానిని నిర్లక్ష్యం చేయొద్దు.