Quinoa
క్వినోవా అనేది ఒక అద్భుతమైన ఆహారం. ఇది ఒకప్పుడు దక్షిణ అమెరికాలో మాత్రమే లభించేది. కానీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీనిని ఆరోగ్యానికి మంచి ఆహారంగా గుర్తిస్తున్నారు. ఇది ఒక రకమైన గింజ. చాలామంది దీన్ని ధాన్యంగా భావిస్తారు. కానీ, నిజానికి ఇది గడ్డి జాతికి చెందినది కాదు. ‘సూపర్ ఫుడ్’ గా పేరుపొందిన క్వినోవాలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
క్వినోవాను ‘పూర్తి ప్రోటీన్’ అని ఎందుకు అంటారంటే..సాధారణంగా మొక్కల నుంచి లభించే ప్రోటీన్లలో ఒకట్రెండు అమైనో ఆమ్లాలు తక్కువగా ఉంటాయి. కానీ, క్వినోవాలో తొమ్మిది రకాల ముఖ్యమైన అమైనో ఆమ్లాలు (Essential Amino Acids) ఉంటాయి. వీటిని మన శరీరం తయారు చేసుకోలేదు. అందుకే వీటిని ఆహారం ద్వారా తీసుకోవాలి. ఈ తొమ్మిది అమైనో ఆమ్లాలను కలిగి ఉన్నందున, క్వినోవాను ‘పూర్తి ప్రోటీన్’ అంటారు. శాకాహారులకు ఇది చాలా ముఖ్యమైన ఆహారం.
క్వినోవాలో ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫోలేట్, మరియు వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. దీనివల్ల అనవసరమైన ఆహారం తీసుకోవడం తగ్గుతుంది.
గోధుమలు, బార్లీ వంటివాటిలో గ్లూటెన్ ఉంటుంది. క్వినోవాలో గ్లూటెన్ ఉండదు కాబట్టి, గ్లూటెన్ అలర్జీ ఉన్నవారికి ఇది మంచి ప్రత్యామ్నాయం. క్వినోవాలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా మంచిది.ఇందులో ఉండే ఫైబర్ , మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.
క్వినోవా(Quinoa)ను అన్నంలాగా ఉడికించి తినవచ్చు. అలాగే, దీన్ని సలాడ్‌లు, సూప్‌లు, స్మూతీలలో కూడా ఉపయోగించొచ్చు. ఉదాహరణకు, ఉడికించిన క్వినోవాను ఉదయం అల్పాహారంలో పాలు లేదా పెరుగుతో కలిపి తీసుకోవచ్చు.
ఒక కప్పు క్వినోవా(Quinoa)కు రెండు కప్పుల నీటిని తీసుకుని, ఉప్పు వేసి, మూత పెట్టి ఉడికించాలి. నీరు పూర్తిగా ఇంకిపోయిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసి, ఐదు నిమిషాలు ఆవిరిలో ఉంచాలి. తర్వాత దీన్ని అన్నంలాగా తినేయడమే .ఇన్ని ప్రయోజనాలున్న క్వినోవాను మీ డైట్ లో యాడ్ చేసుకోండి మరి .