Dinner
ఉరుకుల పరుగుల జీవితంలో.. చాలామంది రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం ఒక సాధారణ అలవాటుగా మారిపోయింది. ఆఫీసు పని ఒత్తిడి, ప్రయాణాలు, ఇతర కారణాల వల్ల రాత్రి 9 లేదా 10 గంటల తర్వాత తినేవారి సంఖ్య చాలా ఎక్కువ. అయితే, ఈ అలవాటు మన ఆరోగ్యంపై, ముఖ్యంగా జీర్ణవ్యవస్థపైన అలాగే బరువుపైన కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.
శరీర గడియారం (Circadian Rhythm)పై ప్రభావం..మనం నిద్రించే సమయంలో మన శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. కానీ, రాత్రి ఆలస్యంగా తింటే జీర్ణవ్యవస్థకు విశ్రాంతి దొరకదు. అప్పుడు మన శరీరం జీర్ణక్రియ కోసం పనిచేస్తూనే ఉంటుంది, దీనివల్ల నిద్ర సరిగ్గా పట్టదు. నాణ్యత లేని నిద్ర బరువు పెరగడానికి, రక్తపోటు పెరగడానికి, ఒత్తిడికి కారణమవుతుంది.
బరువు పెరగడానికి ప్రధాన కారణం..ఆలస్యంగా తినడం వల్ల శరీరం శక్తిని ఖర్చు చేయడానికి బదులు, దాన్ని కొవ్వు రూపంలో నిల్వ చేసుకుంటుంది. దీనివల్ల బరువు త్వరగా పెరుగుతారు. ముఖ్యంగా రాత్రిపూట కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే అది శరీరంలో కొవ్వుగా మారుతుంది. ఆలస్యంగా తినే అలవాటు ఉన్నవారికి మధుమేహం (డయాబెటిస్) వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.
రాత్రి ఆలస్యంగా తిని వెంటనే పడుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ (గుండెల్లో మంట), గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. దీనివల్ల ఉదయం పూట బద్ధకంగా, నీరసంగా అనిపిస్తుంది. మన జీర్ణవ్యవస్థ ఉదయం నుంచి సాయంత్రం వరకు చురుకుగా పనిచేస్తుంది, కానీ రాత్రికి దాని పని నెమ్మదిస్తుంది. అందుకే, రాత్రిపూట తేలికైన ఆహారం, సరైన సమయంలో తీసుకోవడం చాలా ముఖ్యం.
రాత్రి భోజనా(Dinner)న్ని వీలైనంత త్వరగా, అంటే రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య పూర్తి చేసుకోవడం మంచిది. రాత్రి పూట త్వరగా జీర్ణమయ్యే, తక్కువ నూనెతో వండిన ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు, కూరగాయల సలాడ్లు వంటి మంచి ఫుడ్స్ ఎంచుకోవాలి. భోజనానికి నిద్రకు మధ్య గ్యాప్ అంటే రాత్రి భోజనానికి, పడుకోవడానికి మధ్య కనీసం 2-3 గంటల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి.
భోజనం చేసిన వెంటనే కాకుండా, ఒక గంట తరువాత నీరు తాగడం అలవాటు చేసుకోవాలి.ఈ చిన్నపాటి మార్పులు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మీకు నాణ్యమైన నిద్ర, చురుకైన రోజును అందిస్తాయి.